Kurnool | పుష్కరం తర్వాత మళ్లీ ప్రాణాలు తీసిన బ్లాక్ స్పాట్ అదే!
మృత్యువు రహదారిగా మారిన ఎన్ హెచ్ 44
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-24 11:21 GMT
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనతో 12 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సుదూర ప్రాంతాలకు ప్రయివేటు ట్రావెల్స్ లో ప్రయాణించే వారికి మృత్యుమార్గంగా మారింది. జాతీయ రహదారుల శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్ లోనే ఈ దుర్ఘటన జరగడం గమనించదగిన విషయం.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేటు బస్సుల వేగానికి కళ్లెం వేయడంలో రవాణా శాఖ చోద్యం చూస్తోంది. నామమాత్రపు తనిఖీలతో జరిమానాలు విధించడం ద్వారా చేతులు దులుపుకుంటున్నారు. ఇదే త్వరగా గమ్యస్థానం చేరాలని ఆతృతపడే ప్రయాణికులకు ప్రమాదంగా మారుతోంది.
బాధ్యత ఎవరిది?
కర్నూలు మీదుగా ప్రయాణించడానికి జాతీయ రహదారి 40 ( National Highway 40) ప్రధానమైంది. కర్నూలు వద్ద జాతీయ రహదారి 44 ప్రధాన కూడలిగా ఉంది. కర్నూలు నుంచి ప్రారంభమై ఏపీలోని కడప, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణిపేట వరకు సాగుతుంది. ఈ ప్రస్తావన తీసుకురావడం వెనుక ప్రధాన కారణం ఉంది. కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ పాపానికి బాధ్యులు ఎవరు అనే ధర్మ సందేహం కూడా తెరపైకి వచ్చింది.
బ్లాక్ స్పాట్లు..
కర్నూలు జాతీయ రహదారి ( NH 44)లోని కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం సమీపంలో ఆ శాఖ అధికారులు బ్లాక్ స్పాట్ గానే గుర్తించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చిన్నటేకూరు క్రాస్ రోడ్డు ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ (Black Spot ID : AP-(02) 149, Chain Link Kilometers. 222+000 To 222_500) గుర్తించారు.
చిన్న టేకూరు క్రాస్ రోడ్డు (థడకనపల్లి క్రాస్ రోడ్డు, కల్లూరు మండలం, చిన్న టేకూరు గ్రామం) ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ (Black Spot ID: AP-(02)-149, చైనేజ్: Km.222+000 to 222+500) గా గుర్తించడం జరిగింది.
ఇది 2019-2022 సంవత్సరాలకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ( Ministry of Road Transport and Highways) గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో ఇదొకటి అని ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోనే ప్రమాదాల నివారణకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ చర్యలు తీసుకున్నారు. అంటే థర్మోప్లాస్టిక్, రోడ్డు మార్కింగ్, మీడియన్ ఎడ్జ్ లైన్ వేయడం వంటి పనులు పూర్తి చేశారు.
"ఒక మార్గంలో జరిగిన ప్రమాదాల సంఖ్య, తీవ్రతను పరిగణలోకి తీసుకుని బ్లాక్ స్పాట్లు గుర్తిస్తాం" జాతీయ రహదారుల శాఖ ఓ అధికారి చెప్పారు.
2023 నాటికి ఎన్ హెచ్ 44లోని కర్నూలు, అనంతపురం జిల్లాల మధ్య ఉన్న 251 కిలోమీటర్ల పరిధిలో 39 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. 2011 నుంచి 14 మధ్య కాలంలో 29 ఉంటే, 2015 నుంచి 2018 మధ్య 24, 2019 నుంచి 2022 నాటికి ఆ బ్లాక్ స్పాట్ల సంఖ్య 36 ఆ తరువాత 39కి పెరగడం అంటే, ప్రమాదాల సంఖ్య కూడా పెరగడమే కారణంగా జాతీయ రహదారుల శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది.
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద వాహన డ్రైవర్లను అప్రమత్తం చేసే విధంగా మార్కింగ్ ఉంటుంది. అలసిపోతే రోడ్డు పక్కన వాహనం నిలిపి విశ్రాంతి తీసుకునే విధంగా కూడా మార్కింగ్ కూడా ఉంటుంది. ఇదే సమయంలో ప్రమాదాలకు నిలయంగా మారిన ఎన్ హెచ్ అధికారులు, హైవే పెట్రోలింగ్ కూడా అత్యంత ప్రధానమైంది.
అపుడు ఏమయ్యారు?
కర్నూలు జిల్లా చిన్నటేకూరుపేట వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయ్యే వరకు అధికారులు లేదా పెట్రోలింగ్ సిబ్బంది ఎందుకు చేరలేకపోయారునేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. సమాచారం తెలిసిన 15 నిమిషాల్లో పోలీసు అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నట్లు పోలీస్ పీఆర్ఓ చెప్పారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
"తిరుపతి నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి -40లో కర్నూలు వద్ద జరిగిన ఈ దుర్ఘటన మొదటిది కాదు. చివరిది అంతకంటే కాదు. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..
పాఠాలు నేర్పని విషాదం...
2013 అక్టోబర్ నెల 30వ తేదీ లో బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరిన జబ్బార్ ట్రావెల్స్ ఓల్వో బస్సు కర్నూలు దాటి, మహబాబ్ నగర్ లిమిట్స్ లోకి చేరింది. ముందు వెళుతున్న కారును అధిగమించే యత్నంలో అదుపుతప్పింది. కల్వర్టును ఢీకొనడం వల్ల డీజిల్ ట్యాంక్ లీక్ అయింది. భారీ పేలుడు వల్ల చెలరేగిన మంటల్లో 45 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు డ్రయివర్, క్లీనర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై విచారణ చేసిన సీఐడీ 400 పేజీల నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అందులో చార్జిషీట్ లో ఆర్ అండ్ బీ అధికారులు, జబ్బార్ ట్రావెల్స్ తోపాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన భార్య పేరును కూడా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు మార్చడం, టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండడం వల్ల బస్సుకు త్వరగా మంటలు వ్యాపించాయని సీఐడీ రిపోర్టులో ప్రస్తావించారు. రోడ్డు నిర్మాణం తోపాటు బస్సులు సీట్ల సంఖ్య పెంచడం, ఓవర్ లోడ్ ,లగేజీ, ప్రమాదకర వస్తువులు ఉండడం వల్ల భారీ నష్టం జరిగిందిన సీఐడీ నివేదిక ఎత్తి చూపింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా పెద్ద రాద్దాంతం జరిగింది. చర్యలు ఏమి తీసుకున్నారనేది వెల్లడికాలేదు.
2021 ఫిబ్రవరి 14
కర్నూలు జిల్లా వెల్దుర్తి మాదాపురం వద్ద 14 మంది మరణించారు. మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువుమిట్ట, బాలాజీనగర్ ప్రాంతాలకు చెందిన 18 మంది బంధువులు మినీ బస్సులో అజ్మీర్ యాత్రకు బయలుదేరారు. వెల్దుర్తి వద్ద వారి వాహనం ప్రయాణిస్తుండగా, ప్రయివేటుచ లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఓ బాలుడు ఘటనా స్థలంలోనే మరణించారు.
కర్నూలు వద్ద శుక్రవారం జరిగిన ఘటనతో మదనపల్లెకు చెందిన ఉర్దూ టీచర్ పఠాన్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా కలత చెందారు.
"అజ్మీర్ యాత్రకు బయలుదేరిన బృందంలో మా బంధువులు కూడా ఉన్నారు. మదనపల్లె జెడ్పీ హైస్కూల్ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు" అని నాటి ఘటనను గుర్తు చేసుకున్న మహ్మద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2019 కర్నూలు జిల్లా వెల్డుర్తి వద్ద జరిగిన ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లా రామాపురానికి చెందిన 16 మంది మరణించారు. అనంతపురం జిల్లా గుంతల్లు పట్టణంలో బంధువుల ఇంట పెళ్లి నిశ్చితార్దానికి హాజరై తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టెంపోను ప్రైయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఇదే ప్రదేశంలో అప్పటికి రెండళ్లలో జరిగిన 12 ప్రమాదాల్లో 29 మంది మరణించారు. రోడ్డు నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపమే అని రవాణా శాఖాధికారులు స్పష్టం చేశారు.
గాలిలో ప్రయాణం...
రహదారులపై నిర్మాణంపై ప్రత్యేకంగా నివేదికలు ఇచ్చిన అధికారులు గాలిలో ప్రయాణించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వేగానికి మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారనే విషయం కర్నూలు వద్ద శుక్రవారం జరిగిన బస్సుదగ్ధం ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది.
తిరుపతి నుంచి కడపకు 120 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఏపీఎస్ఆర్టీసీ 3.30 గంటల నుంచి నాలుగు గంటల సమయం నిర్ణయించారు. అదే ప్రైవేటు బస్సు రెండున్నర గంటల్లో చేరుకుంటోంది. అంటే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మాత్రమే సాధ్యం అవుతుంది.
"తిరుపతి నుంచి హైదరాబాద్ కు 580 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రయివేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. తిరుపతి నుంచి కర్నూలు చేరడానికి 70 కిలోమీటర్ల ముందే మరో డ్రైవర్ సీటులో కూర్చుంటారు" అని తిరుపతిలోని ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు మల్లికార్జున చెప్పారు. ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేటు బస్సులకు వేగ నియంత్రణ లేకపోవడం అనేది ప్రమాదాలు, తీవ్రతకు కారణంగా మారింది.
"ఇటీవల కొంతకాలంగా ఆకస్మిక తనిఖీలు సాగిస్తున్నట్లు తిరుపతి రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీ చెప్పారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్న బస్సుల తోపాటు చిన్న కేసుల్లో జరిమానాలు విధించాం. వరుస సెలవుల నేపథ్యంలో స్పేర్ బస్సులు రోడ్డు పైకి తీసుకుని రాకుండా జంబ్లింగ్ పద్దతిలో ఒకో రోజు ఒకో మార్గంలో తనిఖీలు సాగించాం. ఇది ఇంకా కొనసాగిస్తాం" అని రవాణా శాఖాధికారి మురళీ తెలిపారు.