కర్నూలు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంలో 25 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన బాధిత కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది.

Update: 2025-10-24 03:48 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో స్లీపర్ బస్ (DD01N9490) ఒక బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మందికి పైగా మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు (39 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులు) ఉండగా, అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో జాతీయ రహదారి 44పై ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు బైక్‌ను 300 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ముందు భాగంలోని ఇంధన ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి, చాలా మంది సజీవ దహనానికి గురయ్యారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గ్రహించే అవకాశం లేకపోవడం విషాదకరం. అత్యవసర ద్వారాలు పగలగొట్టబడినా, 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. మిగిలిన వారిలో గాయాలతో 11 మంది కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, తీరని దుఃఖం

ఈ ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను దహనం చేసింది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లి మూలాలున్న గొల్ల రమేష్ (35), అతని భార్య అనూష (30), పిల్లలు మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరించాలని కోరారు. ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తూ బెంగళూరు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. మిగిలిన మృతుల్లో అశోక్ (27), ఎంజీ రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18) వంటి వారి పేర్లు గుర్తించబడ్డాయి. బయటపడినవారిలో రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు.

స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, బస్సు పూర్తిగా బూడిదైపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్, సిబ్బంది పరారయ్యారని, వారిని పోలీసులు వెతుకుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, 19 మందిని గుర్తించామని, మిగిలినవారి గుర్తింపుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఘటనాస్థలికి హైదరాబాద్ నుంచి వచ్చిన నవీన్, గాయపడిన ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వివరాలు తెలిపగానే, ముఖ్యసెక్రటరీ (సీఎస్)తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేశారు. ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఘటనాస్థలికి పంపి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం, క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని, మృతుల సంఖ్య పెరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలచి వేసింది..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. 

ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖకు భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మృతదేహాల గుర్తింపుకు డీఎన్ఏ పరీక్షలు చేపట్టాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరపున కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ నంబర్‌లను (కర్నూలు: 08518-277111, హైదరాబాద్: 040-23452497) ప్రకటించింది. ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. అధికారులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News