Kuppam | టీడీపీ ఖాతాలోకి 'కుప్పం' మున్సిపాలిటీ
మున్సిపాలిటీలో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. వన్నెకుల క్షత్రియ నేత15-9 ఓట్లతో చైర్మన్ పదవి దక్కించుకున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-04-28 07:54 GMT
కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. నియోజకవర్గంలో అధికంగా ఉన్న వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.
కుప్పంలో టీడీపీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఎంఎల్సీ కంచెర్ల శ్రీకాంత్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. చైర్మన్ ఉప ఎన్నిక నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మన్ గా ఎన్నిక అయిన తరువాత పట్టణంలో ర్యాలీతో పాటు విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి.
ఉత్కంఠ వాతావరణంలో మీట్
కుప్పం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఉప ఎన్నికను సోమవారం ఉదయం స్థానిక ఆర్డీవో వి. వెంకటేశ్వరరాజు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వి. వెంకటేశ్వరరావు ఏర్పాట్లు చేశారు.
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఎన్నికల్లో వైపీసీ నుంచి19 కౌన్సిలర్లు ఎన్నిక కాగా, టీడీపీ నుంచి ఆరుగురు విజయం సాధించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నుంచి చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ సుధీర్ తన, పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయనతో పాటు నలుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ తన కౌన్సిలర్లను కాపాడుకోవడానికి ఎంఎల్సీ భరత్ సారధ్యంలో బెంగళూరులో క్యాంప్ నిర్వహించారు. వారందరినీ ప్రత్యేక బస్సులో బెంగళూరు నుంచి కుప్పం పట్టణానికి సోమవారం ఉదయం సమావేశం జరిగే సమయానికి తీసుకుని వచ్చారు.
ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి కుప్పంలో కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వైసీపీ నుంచి గెలిచిన వారిలో మొదట నలుగురు టీడీపీలో చేరారు. మున్సిపల్ మీట్ జరిగే సమయానికి ముందే ఇంకొందరికి టీడీపీ తాయిలాలు ఎర వేసినట్టు సమాచారం. దీంతో టీడీపీ, వైసీపీ పార్టీల బలబలాలు తీరుమారయ్యాయి.
తీవ్ర పోటీ అయినా..
కుప్పం నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం సంఖ్య ఎక్కువ. ఓటర్లు కూడా మెజారీటీ టీడీపీ పక్షానే నిలుస్తున్నారు. దీంతో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము, బలిజ సామానికవర్గం నుంచి ఎస్. సోమశేఖర్ తోపాటు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం నుంచి చైర్మన్ పదవి రేసులో నిలిచారు.
బాబు మద్దతు వన్నెకులానికే..
కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వన్నెకుల సామాజిక వర్గం నుంచి ఐదో వార్డు నుంచి కౌన్సిలర్ సెల్వరాజ్ ను చైర్మన్ గా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్లు కూడా సెల్వరాజ్ పక్కనే మొగ్గు చూపారు. దీంతో.
మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన చైర్మన్ ఉప ఎన్నికలో టీడీపీ నుంచి బరిలో నిలిచిన సెల్వరాజ్ కు 15 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఈ లెక్కన
టీడీపీకి స్వతహాగా ఉన్న ఆరుగురు కౌన్సిలర్లకు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో ఇన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నిర్వహించిన క్యాంపు రాజకీయాలు కూడా ఫలించలేదు.
వన్నెకులస్తుడికే ఎందుకు?
వన్నెకుల క్షత్రియ నేత, కౌన్సిలర్ సెల్వరాజ్ ను చైర్మన్ పదవికి ఎంకి చేయడం వెనుక సీఎం ఎన్. చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించారనే విషయం స్పష్టం అవుతుంది. అందులో ప్రధానంగా వైసీపీ ఎంఎల్సీ భరత్ కు చెక్ పెట్టడానికే ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది.
కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ముమ్మరంగా ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ ఏర్పడిన తరువాత వన్నెకుల క్షత్రియులకు ప్రాధాన్యం వస్తున్నట్లు, ఆ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ 2014 ఎన్నికలకు తెరమీదకు తీసుకువచ్చింది. ఒక ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తరువాతి ఎన్నికల నాటికి ఆయన మరణించడంతో చంద్రమౌళి కొడుకు భరత్ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. అంతకుముందే ఆయనకుమ వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పార్టీ నుంచి ఎంఎల్సీగా పదవి కట్టబెట్టారు. ఈ వ్యూహం వెనుక కుప్పంలో వన్నెకుల క్షత్రియుల ఓట్లకు గాలం వేయాలనేది వైసీపీ ఎత్తుగడ. దీనికి ధీటుగానే టీడీపీ కూడా ప్రతిస్పందిస్తోంది. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ సెల్వరాజ్ కు ఆ పదవికి ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతోంది.