KTR self certificate|ఫార్ములా కేసులో కేటీఆర్ సెల్ఫ్ క్లీన్ చిట్ ?

ఏసీబీ, ఈడీ విచారణలో ఎలాంటి అవినీతి జరగలేదన్న విషయం బయటపడిందని తనకు తానే క్లీన్ సర్టిఫికేట్(Clean chit) ఇచ్చేసుకున్నారు.;

Update: 2025-01-18 07:09 GMT

ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారు. ఫార్ములా కార్ కేసు(Formula E Car case) విచారణ కోసం ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) ఒక్కోసారి విచారించిన విషయం తెలిసిందే. కేటీఆర్(KTR) ను ఏసీబీ(ACB) అధికారులు ఉదయం నుండి సాయంత్రంవరకు 6 గంటలు విచారిస్తే, ఈడీ అధికారులు 7 గంటలు విచారించారు. ఈవిచారణపై కేటీఆర్ మాట్లాడుతు ఏసీబీ, ఈడీ విచారణలో ఎలాంటి అవినీతి జరగలేదన్న విషయం బయటపడిందని తనకు తానే క్లీన్ సర్టిఫికేట్(Clean chit) ఇచ్చేసుకున్నారు. రెండుదర్యాప్తుసంస్ధల విచారణకు ఒకసారి హాజరుకాగానే కేటీఆర్ తనకు తానే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసుకోవటం ఏమిటో అర్ధంకావటంలేదు.

కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఏసీబీ, ఈడీలు కాదని అందరికీ తెలిసిందే. ఫార్ములా కార్ రేసు కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది కోర్టు(Telangana High court)మాత్రమే. ఎందుకంటే ఫార్ములా కార్ కేసులో అవినీతి, అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఏసీబీ చూపించిన ఆధారాలతో హైకోర్టు ఏకీభించింది. కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ దగ్గర అన్నీ ఆధారాలున్నాయని కన్వీన్స్ అయిన తర్వాతే విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ కేసునమోదు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయగానే దాని ఆధారంగా ఈడీ కూడా కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని సహనిందితులుగా చేర్చి కేసులు నమోదుచేసి ఎఫ్ఐఆర్ లు కట్టింది. మనీల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)(FEMA) కేసుల కోణంలో ఈడీ విచారణ చేస్తోంది.

ఫార్ములా కారు రేసు నిర్వహణ సంస్ధ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు అనుకూలంగా కేటీఆర్ అధికారదుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఏసీబీ చాలా ఆధారాలను సేకరించింది. హెచ్ఎండీఏ నుండి బ్రిటన్లోని ఎఫ్ఈవో కంపెనీకి రు. 45 కోట్ల చెల్లింపులో కేటీఆర్ నిబంధనలకు నీళ్ళొదిలేసినట్లు బయటపడింది. ఎఫ్ఈవో కంపెనీకి నిధుల చెల్లించేందుకు ఆర్ధికశాఖ అనుమతి తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోలేదన్నది వాస్తవం. ఈ రెండు అధికారదుర్వినియోగం కిందకు వస్తుంది. పదికోట్లరూపాయలకుమించి ఎవరికైనా చెల్లింపులు చేయాలంటే సంబంధిత శాఖలు ముందుగా ఆర్ధికశాఖ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ హెచ్ఎండీఏ ఆర్ధికశాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కారణం ఏమిటంటే హెచ్ఎండీఏ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరిధిలోనే ఉండటం.

అప్పట్లో తనపరిధిలోకే హెచ్ఎండీఏ వస్తుంది కాబట్టి ఆర్ధికశాఖ అనుమతి తీసుకోకుండానే చెల్లింపులు చేసేయమన్నారు. విదేశీకంపెనీకి చెల్లింపులు చేయాలంటే అందుకు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. ఆర్ధికశాఖకు చెప్పకుండానే, క్యాబినెట్ ఆమోదంలేకుండానే రు. 45 కోట్ల చెల్లింపులు చేసేశారు. దీనికి కారణం ఏమిటంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటీఆర్ కొడుకు కావటమే. స్వయాన కేసీఆర్(KCR) కొడుకు పైగా మంత్రి కూడా కావటంతో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించేధైర్యం ఉన్నతాధికారులకు లేకపోయింది. పై రెండుఅంశాలు అధికారదుర్వినియోగం కిందకే వస్తాయని ఏసీబీ తేల్చేసింది. అలాగే విదేశీకంపెనీకి విదేశీకరెన్సీలో చెల్లింపులు చేయాలంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)(RBI) అనుమతి తీసుకోవాలి. బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు చేసేముందు హెచ్ఎండీఏ ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం కేటీఆరే.

కేటీఆర్ ఆదేశాల కారణంగానే ఆర్బీఐకి చెప్పకుండానే హెచ్ఎండీఏ నిధులను బదిలీ చేసేసింది. ఇక్కడ నిబంధనలఉల్లంఘన స్పష్టంగా కనబడుతోంది. హెచ్ఎండీఏ నుండి బ్రిటన్ కంపెనీకి పౌండ్లలో రు. 45 కోట్ల చెల్లింపులు జరిగిన విషయం బయటపడగానే ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్ల జరిమానా విధించింది. విదేశీకంపెనీకి నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా అంగీకరించింది కాబట్టే ప్రభుత్వం రు. 8 కోట్ల జరిమానాను చెల్లించింది. 8 కోట్ల రూపాయల జరిమానాను తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐకి జరిమానా ఎందుకు చెల్లించింది ? ఎందుకంటే కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టే. కేటీఆర్ బ్రిటన్ కంపెనీకి రు. 45 కోట్లు చెల్లించమని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను నిధులు మంజూరు చేయాలని అప్పటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఆదేశించినట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేసిన అర్వింద్ కుమార్ అంతర్గతవిచారణలో రాతమూలకంగా వాగ్మూలమిచ్చారు. నిధులు విడుదలచేసి చెల్లింపులు చేయమని కేటీఆర్, అర్వింద్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాను బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు చేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణలో చెప్పారు.

కాబట్టి ఫార్ములా కార్ కేసు లొట్టపీసు కేసని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని ఏసీబీ, ఈడీ విచారణలో తేలినట్లుగా తనకు తాను సెల్ఫ్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. తనకు తాను క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకునేట్లయితే ఏసీబీ, ఈడీ దర్యాప్తు ఎందుకు, కోర్టులో విచారణ ఎందుకు ? అయినా ఫార్ములా కేసు లొట్టపీసు కేసని ఒకవైపు చెబుతునే ప్రతిరోజు పదేపదే ఇదే కేసుగురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నట్లు ? తమనేతలతో ఎందుకు మాట్లాడిస్తున్నట్లు ?

Tags:    

Similar News