క్రిష్ణా వరదలు.. బోట్ రాజకీయాలు..

పన్నెండు రోజులుగా విజయవాడను వరద నీరు వదల లేదు. అలాగే బురద, వరద రాజకీయాలుకూడా వదలలేదు. ఎప్పుడు ఈ కుట్ర రాజకీయాలకు స్వస్తి చెబుతారో వేచి చూడాల్సిందే.

Update: 2024-09-12 09:48 GMT

పన్నెండు రోజుల నుంచి క్రిష్ణా వరద రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ను కూల్చే కుట్రకు కొందరు పాల్పడ్డారని, ఆ కుట్రలో వైఎస్సార్సీపీ వారు ఉన్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని, బాధితుల విషయం ప్రజలు మరిచిపోయేలా చేసేందుకే ఈ కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఈ నెల ఒకటి నుంచి వరద నీరు విజయవాడను ముంచెత్తుతోంది. వరదలకు గొల్లపూడి ప్రాంతం నుంచి ఐదు బోట్లు కొట్టుకొచ్చాయి. సెప్టెంబరు ఒకటో తేదీ రాత్రి కొట్టు కొచ్చిన బోట్లను రెండో తేదీన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చూశారు. ప్రకాశం బ్యారేజీలోకి మూడు బోట్లు కొట్టుకొచ్చాయని మొదట చెప్పి ఆ తరువాత ఒకటి వరద నీటిలో కొట్టుకుపోయిందని, నాలుగు బ్యారేజ్ గేట్లకు అడ్డుపడ్డాయని వెల్లడించారు.

ఈ బోట్లు ఎవరివి? ఎందుకు వరదల్లో కొట్టుకొచ్చాయనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బోట్ల యజమానులుగా చెబుతున్న ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమస్య బోట్ల యజమానుల గురించి అధికార, ప్రతిపక్షానికి వచ్చింది. వారు మీ పార్టీ వారంటే కాదు మీ పార్టీ వారంటూ ఒక పార్టీపై ఒక పార్టీ ఆరోపణలకు పాల్పడుతోంది. అయితే నిందితులైన కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు అటు వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలతో కలిసి ఫొటోలు దిగారు. ఇరు పార్టీల వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిరువురినీ ఏ పార్టీ అనాలో కూడా తెలియని పరిస్థితి ఉంది.

Delete Edit

కోమటి రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ నేత కోమటి జయరామ్ సోదరుని కొడుకు. ఈ కేసులో ఆలూరి చిన్న కూడా ఉన్నారు. మైలవరం టీడీపీ టిక్కెట్ ఆశించిన బొమ్మసాని సుబ్బరావుకు రామ్మోహన్ అత్యంత సన్నిహితుడని వైఎస్సార్సీపీ వారు అంటున్నారు. మైలవరం లేదా ఎక్కడ పోటీకి సీటు ఇచ్చినా పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పలేదా అని వారు ప్రశిస్తున్నారు. అయితే ఆయనకు చివరకు టిక్కెట్ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీలోకి వద్దామని ప్రయత్నించి విరమించుకున్నారు. ఈ బోట్లను క్రిష్ణానదిలో తిప్పేందుకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అనుమతి తీసుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బుధవారం గుంటూరులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్మోహన్, ఉషాద్రిలు టీడీపీ నేతలతో ఫొటోలు దిగారని ట్విటర్ వేదికగా వైఎస్సార్సీపీ స్పందిస్తే, వైఎస్సార్సీపీ కార్యదర్శి తలశిల రఘురామ్ మేనల్లుడు రామ్మోహన్ అంటూ టీడీపీ వారు ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలా ఇరు పార్టీల వారు రాజకీయ వాగ్యుద్దానికి దిగారు.

12 రోజులు గడిచినా బ్యారేజ్ గేట్లకు అడ్డుపడిన బోట్లను తొలగించడం ప్రభుత్వానికి చేతకాలేదు. ఆరోపణలు చేసుకోవడంలో మాత్రం అధికార, ప్రతిపక్షం ఒకడుగు ముందులో ఉన్నాయి. ఇటువంటి రాజకీయ విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్యారేజ్ ను కూల్చే కుట్ర చేయడం ద్వారా విదేశీయులకైతే లాభం ఉంటుందేమో కాని, స్వదేశీయులు, పైగా ఈ ప్రాంతం వారు అయినందున వారు ఎందుకు ఇటువంటి కుట్రలు చేస్తారనేది పలువురు రాజకీయ నాయకుల వాదన.

ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ ఒకటి రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌కు 11.45 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో బ్యారేజ్ 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి అధికారులు పంపించారు. ఈ వరద నీటిలో కొట్టుకొచ్చిన బోట్లు బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్ల గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీ కొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) దెబ్బతిన్నది. విషయం తెలుసుకున్న మీడియా వారు ఆగస్ట్ 2న బ్యారేజ్ గేట్ల వద్దకు న్యూస్ కవరేజ్ కు చేరుకున్నారు. అక్కడున్న మరో బోట్ కదిలి పిల్లర్ 67ను ఢీకొంది. దీంతో ఆ పిల్లరు కూడా దెబ్బతిన్నది. కాంక్రీట్ భీమ్ లు దెబ్బతిన్న మాట వాస్తవమని పేర్లు చెప్పేందుకు ఇష్టపడని ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ఆ సమయంలో కొద్ది సమయం బ్యారేజ్ పై రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. దీంతో ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. బోట్లు ఢీ కొట్టిన ఘటనలో 67, 69 గేట్ల వద్ద ఉండే కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. 70వ నంబర్ కౌంటర్‌ వెయిట్‌కు కూడా పగుళ్లు ఏర్పడ్డాయంటున్నారు. జలవనరుల ఇంజనీరింగ్ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ మూడింటి స్థానంలో కొత్త స్టీల్‌ కౌంటర్‌ వెయిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్ వెయిట్ బరువు 17 టన్నులు.

బ్యారేజీ వద్ద ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించే ఏర్పాట్లు చేస్తున్నా ఫెయిల్ కావడంతో నీటిలోనే బోట్లను ముక్కలుగా చేచి తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం రాత్రి నుంచి ఈ నులు జరుగుతున్నాయి. అడ్వైజర్, రిటైర్డ్ ఇంజినీర్ కేవీ కృష్ణారావు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బ్యారేజీపై ఉండి మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News