"కౌకుంట్ల" పోరాట వారసులే ప్రత్యర్థులయ్యారు..

చారిత్రక కౌకుంట్ల భూపోరాటాన్ని సాగించిన కుటుంబ వారసులు ప్రత్యర్థులుగా మారారు. అధికార వైసీపీ, కాంగ్రెస్ పార్టీ తరపు ఎన్నికల బరిలో తలపడనున్నారు.

Update: 2024-05-02 14:31 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: భూస్వామ్య పెత్తందార్ల పడగ నీడ నుంచి పేదలకు విముక్తి కల్పించిన కుటుంబం అది. కౌకుంట్ల భూ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కుటుంబం నుంచి వచ్చిన సోదరులు ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. వామపక్ష ఉద్యమాల పాఠాలు నేర్చుకున్న వారిద్దరూ 2024 ఎన్నికల్లో కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన కౌకుంట్ల భూపోరాటం తరువాత మళ్లీ ఇప్పుడు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. దీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్ధితో కూడా అధికార వైయస్సార్‌సిపి నాయకుడు పోరాటం సాగిస్తున్నారు.

అనంతపురం జిల్లా అంటేనే కరువు ప్రాంతం. జిల్లా పరిధిలోని ఉరవకొండ నియోజకవర్గం క్షామ పీడిత ప్రాంతమే కాదు. వజ్రాల గని కూడా. మా సమస్యలు పట్టించుకోరు అని అడిగే జనం ఇక్కడ కనిపించరు. మేమున్నామని చెప్పడమే తప్ప చేసే నాయకుడు ఇక్కడ లేకుండా పోయారు అనేది ఉరవకొండ ప్రాంతంలో ప్రజల నుంచి వినిపించే మాట.

రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంత ఆసక్తి రేపిస్తున్నాయో, ఉరవకొండ శాసనసభ స్థానంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకకు సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలోని ఉరవకొండ, కూడేరు, బెలుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,15,744 ఓటర్లలో 1,07, 637 మంది పురుషులు, 1,08,085 మహిళా ఓటర్లు ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో తమ కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై విశ్వేశ్వరరెడ్డికి ఇంటిపోరు ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్సిపిలో అంతర్గత పోరుతో పాటు ఆయనకు స్వయానా తమ్ముడు వై. మధుసూదన్ రెడ్డితో పోటీ అనివార్యమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో ప్రముఖ పోటీ ఏర్పడింది.

ఇంటి పోరు...

ఉరవకొండ వైఎస్ఆర్సిపిలో గ్రూపుల కుంపటి సమస్యగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శివరాం రెడ్డి, వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. మూడేళ్ల కిందట ఏర్పడిన ఈ అంతర్గత పోరాటాన్ని చక్కదిద్దడానికి ఆ పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న చర్యలు తాత్కాలికంగానే మారాయి.

ఒకే వేదికపైకి వచ్చిన వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి మధ్య జరిగిన ఘర్షణతో పార్టీ వర్గాలే విస్తుపోయాయి. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన ఎంపీటీసీ ఒకరు వేదిక పైకి రాగానే విశ్వేశ్వర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. శివరాం రెడ్డి కుమారుడు భీమ్ రెడ్డి వాదనకు దిగారు. "2019 ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడడం ఏమిటి" అని విశ్వేశ్వరరెడ్డి అభ్యంతరానికి అప్పట్లో కారణమైనట్లు చెబుతారు. అంతకు ముందు నుంచే రెండు వర్గాలుగా ఉన్న వైఎస్ఆర్ సీపీలో సమన్వయం లోపించింది. అనే విషయం ప్రధానంగా బట్టబయలైంది. నష్ట నివారణ చర్యలకు వైఎస్ఆర్సిపి పెద్దలు రంగంలో దిగినా ఆ తర్వాత కాలంలో మళ్ళీ మొదటికి వచ్చిందని చెబుతున్నారు. ఇదే పరిస్థితిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డికి ఇంటి పోరు తప్పని పరిస్థితి ఏర్పడింది.

" విశ్వ"కు ఇంటి పోరు.. ప్రత్యర్థి కూడా..

సార్ సీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి 12 ఏళ్లుగా చురుకైన కార్యకర్త గానే కాకుండా రాష్ట్ర కమిటీలో కూడా వై.విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై. మధుసూదనరెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

పార్టీలు అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను జీర్ణించుకోలేని మధుసూదన్ రెడ్డి గొంతు విప్పారు. తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డి కుమారుడు. ప్రణయ్ రెడ్డి , ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కుమారుడు భీమ్ రెడ్డి "ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేశారు. పార్టీ అగ్ర నేతలు కూడా దీనిపై సమగ్ర విషయం తెలుసుకోకుండా మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.

" అక్రమాలను ప్రశ్నిస్తే, నాపై చర్య తీసుకుంటారా?

బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు నేను తగ్గేదే లేదు" అని మధుసూదన్ రెడ్డి కౌకుంట్ల భూ పోరాటాల సమయంలో తమ కుటుంబం ఏ తరహాలో ఉద్యమించిందో గుర్తు చేసుకున్నారు. దీంతో మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిచి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.

ఇద్దరికీ పోరాటమే స్ఫూర్తి...

స్వయానా సోదరులైన వై. విశ్వేశ్వరరెడ్డి, వై. మధుసూదనరెడ్డికి కుటుంబపరంగా కమ్యూనిస్టు భావజాలంతో అలవడిన పోరాటస్ఫూర్తితో రాటు తేదీన వారే. తండ్రి రాకెట్ల నారాయణరెడ్డి, మరో సోదరుడు వై.రవీంద్రారెడ్డి.. 1985 మే 24న దారుణ హత్యకు గురయ్యారు. వీరు హత్యకు గురయ్యే సమయానికి మిత్ర ధర్మాన్ని పాటిస్తూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ సిపిఐ నాయకుడి హోదాలో వై. విశ్వేశ్వరరెడ్డి ఆ రోజు ఒకే వేదికపై పయ్యావులతో కలిసి కూర్చుని ఉన్నారు. "తన తండ్రి, సోదరుడి హత్యల వెనక కుట్ర దారులు ఎవరో తెలుసు" అని పలు సందర్భాల్లో విశ్వేశ్వరరెడ్డి స్వయంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ హత్యలు జరగడానికి వెనుక…

కౌకుంట్ల భూ పోరాటం

ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కౌకుంట్ల పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వై విశ్వేశ్వరరెడ్డి రాకెట్ల నారాయణ రెడ్డిలగా సుపరిచితుడు. సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, ఇవ్వకుండా పార్టీ బాధ్యుడిగా ఆయన.. మిగులు భూములు పేదలకు పంచాలని ఏకైక నినాదంతో పోరాటాలు సాగించిన గొప్ప వ్యక్తి. ఆయన సారధ్యాన కౌకుంట్లలో భూస్వాముల పెత్తందారీతనానికి సాగించిన పోరాటానికి సిపిఐ అగ్రనాయకులు దండుగా నిలిచారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్, అనంతపురం జిల్లా చెందిన ఆంజనేయ శాస్త్రి, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నీలం రాజశేఖర్ రెడ్డి, సిపిఐ అనంతపురం జిల్లా పెద్దన్న వీకే ఆదినారాయణ రెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి దిగ్గజ సిపిఐ నాయకులు అందరూ మమేకమై సాగించిన పోరాటంతో.. అప్పటి సీఎం ఎన్టీ. రామారావు స్వయంగా దిగి వచ్చారు. కౌకుంట్ల ప్రాంతంలో అప్పటి రాష్ట్ర కార్యదర్శులు దాసరి నాగభూషణరావు, కొరతల సత్యనారాయణతో కలిసి పెత్తందారుల నుంచి భూముల స్వాధీనం చేసుకొని "భూదానం పేరిట" 1200 ఎకరాలు పేదలకు సీఎం ఎన్టీ రామారావు స్వయంగా పంపిణీ చేశారు. ఈ పోరాటాల వారసులు ప్రత్యక్ష సంబంధాలు ఉన్న సోదరులు ఇద్దరు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు.

 

వైయస్సార్సీపి నేతలపై ఆరోపణలు

వైఎస్ఆర్సిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరాంరెడ్డి కుమారుడు భీమ్ రెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. "అనంతపురం- ఉరవకొండకు మధ్యన ఉన్న కూ-మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించారు. జాతీయ రహదారుల పక్కన కూడా వదలలేదు. అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదనరెడ్డి చేస్తున్న ఆరోపణ. ఈ వ్యవహారం తేల్చుకునే వరకు వదిలేది లేదు" అని హెచ్చరిస్తున్న ఆయన వీటినే ప్రచారాస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.

అధికారంలో లేకున్నా పోరాటం...

స్వతహాగా విద్యార్థి, యువజన రాజకీయ ఉద్యమాల నుంచి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన, 2014 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. తాగునీరు, సాగునీటి కోసం సాగించిన పోరాటం ప్రజల మనసుల నుంచి ఇంకా చెరిగిపోలేదు. హంద్రీనీవా కాలువలో నీరు వదలాలని డిమాండ్తో ఆందోళన సాగించారు. ప్రస్తుతం ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా గతంలో ఆయన సాగించిన పోరాటాలు ఒకటైతే.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే..

 

గెలవాలని లక్ష్యం... బాబు వాగ్దానాలు శాపం

ఉరవకొండలో 2024 ఎన్నికల్లో కూడా గెలవాలని టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశావాహంగా ఉన్నారు. 1994 లో గెలిచిన పయ్యావుల ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థైన వై విశ్వేశ్వరుడు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో పయ్యావుల చేతిలో ఓటమి చెందారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అంశాలను అస్త్రాలు తనకు లాభిస్తాయని కేశవ్ భావిస్తున్నారు. వైయస్సార్సీపీలో అంతర్గత పోరాటం, ప్రత్యర్థులుగా మారిన సోదరుల వైరం కూడా తనకు అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే..

గత హామీలు గాలికి

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరని పరిస్థితి. తాగు, సాగునీటి కొరత ఇక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే చందంగా ఉంది. దాదాపు 15 వేల మంది వృత్తి ఆధారంగా జీవించే కార్మికులు, కుటుంబాల సంక్షేమం కోసం "చేనేత పార్కు ఏర్పాటు" దీపం పెట్టి గాలించినా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది కార్మికులు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. కొందరు ఉపాధి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లడంతో పరిశ్రమ దెబ్బతినింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందించిన స్వల్పకాలిక ఆర్థిక సహాయంతో కొన్ని కుటుంబాలకు సాంత్వన దొరికిందని చెబుతారు. దీంతో 12 వేల వరకు ఉన్న కుటుంబాల సంఖ్య ఐదు వేలకు పడిపోయాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి పక్కన ఉంచితే.. నియోజకవర్గంలో అన్నదమ్ముల పోరు, అమలు కాని టిడిపి వాగ్దానాల నేపథ్యంలో ఓటర్లు ఎటు మొగ్గు తారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News