కొల్లేరును పరిరక్షించుకోవాలి..ప్రజల సమస్యలను పరిష్కరించాలి

కొల్లేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.;

Update: 2025-06-02 12:34 GMT

పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు. కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొల్లేరు పరిధిలో 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములు ఉన్నాయి. కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీ, సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలి. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.

కొల్లేరులోకి వెళ్తున్న డ్రైన్‌ వాటర్‌కు ట్రీట్మెంట్‌ జరగాలి. విచ్చల విడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడాలి. డ్రైన్‌లో పూడికలు తొలగించాలి. నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలి. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు అక్రమణలను తొలగించాలి. ఉప్పుటేరు పూడిక తీసి, ఆక్రమణలు తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలి. అవుట్‌ లెట్లు పూర్తిగా క్లియర్‌ చేయాలి. ఈ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌తో పాటు అధికారులు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, అధికారులు హాజరయ్యారు.
Tags:    

Similar News