టీడీపీ ఆఫీసుకు చేరిన కొలికపూడి కాంట్రోవర్శీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరింది. వివరణ ఇవ్వాలని అధిష్టాం కోరింది.

Update: 2024-10-05 11:43 GMT

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కాంట్రోవర్శీ తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరింది. వివాదం ఎందుకు జరిగింది, ఆరోపణలు ఎందుకొచ్చాయి వంటి పలు అంశాలపైన వివరాలు ఇవ్వాలని టీడీపీ పార్టీ అధిష్టానం కోరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పార్టీ కార్యాలయానికి రావాలని శనివారం పిలిపించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శినాథ్, సీనియర్‌ నేత వర్ల రామయ్య, సత్యనారాయణ రాజులు ఎమ్మెల్యేతో మాట్లాడారు. తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఇంత వివాదం ఎందుకు జరిగింది, ఆరోపణలు ఎందుకు వచ్చాయి వంటి పలు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరారు.

మీడియా ప్రతినిధులతో కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. బెదిరింపులకు దిగుతున్నారనే దానిపైనా కొన్ని ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఈ సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కొలికపూడిని శనివారం పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అయితే తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, పని గట్టుకొని కొంత మంది చెడు ప్రచారం చేస్తున్నారని, సేవ్‌ తిరువూరు పేరుతో ర్యాలీ నిర్వహించాలని ఇది వరకు ప్లాన్‌ చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు దీనిని విరమించుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై పార్టీనే విచారణ చేసి ఆరోపణలు నిజమైతే తనను శిక్షించాలని, లేదంటే ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇది వరకే ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News