కిషన్ కు ప్రమోషన్ గ్యారెంటీనా ?

పార్టీకి మాత్రమే పరిమితంచేయటం అంటే అదేదో పనిష్మెంట్ అని అనుకునేందుకులేదు.

Update: 2024-06-08 08:02 GMT

తెలంగాణా బీజేపీలో అనూహ్య మలుపులు జరిగేట్లున్నాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తొందరలో పార్టీకి మాత్రమే పరిమితంచేయబోతున్నారు. పార్టీకి మాత్రమే పరిమితంచేయటం అంటే అదేదో పనిష్మెంట్ అని అనుకునేందుకులేదు. కేంద్రమంత్రి పదవిలో నుండి తప్పించి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయాన్ని నరేంద్రమోడి ఆలోచిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా చాలాకాలంగా పనిచేస్తున్నారు. అందుకనే నడ్డాను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుని కిషన్ను ఆయన ప్లేసులో తీసుకోవాలన్నది మోడి ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. కిషన్ కు పార్టీ జాతీయపార్టీ పగ్గాలు అప్పగించటం అంటే చాలా గొప్పనే చెప్పాలి. తెలుగునేతల్లో ఒకపుడు ఎం వెంకయ్యనాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు.

బంగారు లక్ష్మణ్ కూడా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినా అవినీతికేసులో రెడ్ హ్యాండెడ్ గా స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయి పదవిని పోగొట్టుకున్నారు. వెంకయ్య తర్వాత మళ్ళీ ఇపుడు ఆ పదవికి కిషన్ పేరు బలంగా వినబడుతోంది. అధికారంలో ఉన్నపార్టీకి జాతీయ అధ్యక్షుడి పదవి దక్కటం అంటే మామూలు విషయంకాదు. అందులోను నరేంద్రమోడి, అమిత్ షా కు కిషన్ నమ్మినబంటుగా ఉంటున్నారు. అందుకనే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ కే తెలంగాణా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీని బలోపేతం చేయటంలో కిషన్ నూరుశాతం పనిచేయలేదనే ఆరోపణలున్నాయి. అలాగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయని మాట కూడా వాస్తవమే.

కిషన్ ప్రచారం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన విషయం పార్టీలోనే పెద్ద చర్చనీయాంశమైంది. మోడి, అమిత్ షా, నడ్డా లాంటి ప్రముఖులు ఢిల్లీ నుండి ప్రచారానికి వచ్చినపుడు మాత్రం వాళ్ళతో కనబడిన కిషన్ ఎక్కువ ప్రచారం గ్రేటర్ పరిధికే పరిమితమైపోయారనే ఆరోపణలున్నాయి. అయితే కిషన్ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎలాగంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 8 నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే తాజా పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ 8 నియోజకవర్గాల్లో విజయంసాధించింది. ప్రచారం రీత్యా కిషన్ పాత్ర తక్కువే అయినా 8 సీట్లలో గెలవటంతో కిషన్ మైనస్సులు మరుగునపడిపోయాయి. 2019లో నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇపుడు 8 చోట్ల గెలవటంతో పార్టీ నూరుశాతం బలం పెరిగినట్లు అనుకోవాలి. తెలంగాణాలో గెలిచిన 8 సీట్లే ఇపుడు బీజేపీకి ఎంతో అక్కరకు వస్తున్నాయి.

అందుకనే కిషన్ వైఫల్యాలను పార్టీ జాతీయనాయకత్వం కూడా పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. ఇదే సమయంలో నడ్డాను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్న కారణంగా కిషన్ను ఆ ప్లేసులో భర్తీ చేయబోతున్నారనే వార్త పార్టీలో బలంగా వినబడుతోంది. మరి కిషన్ను జాతీయ అధ్యక్షుడిని చేస్తే తెలంగాణా పగ్గాలు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా బాగా ఊపందుకుంటోంది. చివరకు మోడి ఆలోచనలు, నిర్ణయాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో పార్టీ నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి ‘ పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాత నిర్ణయిస్తార’ని చెప్పారు. జాతీయ అధ్యక్షుడిగా గతంలో ఎం వెంకయ్యనాయుడు కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పార్టీలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలన్న విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోర’ని చెప్పారు. ‘జాతీయ అధ్యక్షుడిగా కిషన్ పేరు పరిశీలిస్తున్నారన్న ప్రచారంపై తాను ఏమీ మాట్లాడదలచుకోలేద’ని కూడా మహేశ్వరరెడ్డి స్పష్టంచేశారు.

Tags:    

Similar News