మోడి క్యాబినెట్లో తెలంగాణా నుండి ఇద్దరికే చోటు

నరేంద్రమోడి మంత్రివర్గంలో తెలంగాణా నుండి ఇద్దరికి అవకాశం దక్కబోతోంది. సామాజికవర్గాల సమతూకంలో భాగంగా ఒక రెడ్డి, మరో బీసీని మోడి తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

Update: 2024-06-09 06:45 GMT

నరేంద్రమోడి మంత్రివర్గంలో తెలంగాణా నుండి ఇద్దరికి అవకాశం దక్కబోతోంది. సామాజికవర్గాల సమతూకంలో భాగంగా ఒక రెడ్డి, మరో బీసీని మోడి తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

నరేంద్రమోడి 3.0 క్యాబినెట్లో తెలంగాణా నుండి ఇద్దరికి మాత్రమే చోటు దక్కిందని సమాచారం. కొలువుతీరబోయే మంత్రులకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఫోన్లు వెళుతున్నాయి. కాబోయే మంత్రులకు తన ఇంట్లో మోడి కాసేపట్లో సమావేశం అవబోతున్నారు. బీజేపీ ఎంపీలకు, మిత్రపక్షాల తరపున గెలిచిన ఎంపీల్లో కొందరికి సమావేశానికి హాజరవ్వాలని ప్రధాని కార్యాలయం నుండి సమాచారం అందుతోంది. దీని ప్రకారం తెలంగాణా నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఫోన్లు అందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో కిషన్ రెడ్డి తెలంగాణా అధ్యక్షుడిగానే కాకుండా మొన్నటివరకు కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక బండి కిషన్ కన్నా ముందు తెలంగాణాకు అధ్యక్షుడిగా పనిచేశారు.

కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉంటూనే బండి ప్లేసులో తెలంగాణా అధ్యక్షుడయ్యారు. కిషన్ గతంలో కూడా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. కిషన్ ఆధ్వర్యంలో పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున 8 మంది ఎంఎల్ఏలు గెలిచారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా 8 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో కిషన్ తో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు. కిషన్ మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సమీపఅభ్యర్ధి, ఎంఎల్ఏ దానం నాగేందర్ పై సుమారు 49 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా కిషన్ ఇక్కడి నుండే గెలిచి కేంద్రంలో మంత్రయ్యారు. మోడి, అమిత్ షా కు కిషన్ నమ్మినబంటుగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇక బండి విషయానికి వస్తే కరీంనగర్ నుండి ఎంపీగా రెండోసారి గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా బండి ఇక్కడినుండే గెలిచారు. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేసిన బండి ఓడిపోయారు. అయితే ఐదుమాసాల్లోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలిచారు. తెలంగాణాలోని మొత్తం 17 సీట్లలోను బండికి అత్యంత భారీగా 5.89 లక్షల ఓట్ల మెజారటి వచ్చింది. తెలంగాణా అధ్యక్షుడిగా బండిని తప్పించిన వెంటనే కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కబోతోందంటు బాగా ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గంలో కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. బీసీ సామాజికవర్గానికి చెందిన బండికి జనాధరణ దండిగానే ఉంది. మహబూబ్ నగర్ నుండి గెలిచిన డీకే అరుణ, మల్కాజ్ గిరి నుండి గెలిచిన ఈటల రాజేందర్ పేర్లు కూడా మంత్రివర్గంలో చోటు ఖాయమని వినిపించినా చివరకు కిషన్, బండికి మాత్రమే చోటు దక్కినట్లే అనుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కార్యాలయం నుండి సమావేశానికి హాజరవ్వాలని సమాచారం అందింది ఈ ఇద్దరు ఎంపీలకు మాత్రమే. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News