శ్రావణికి ఏమైంది..!? చెల్లెలి కోసం శ్రమిస్తున్న ఓ అక్క..
పోలింగ్ గడువు సమీపించింది. టిడిపి అభ్యర్థి అస్వస్థకు గురికావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తించింది. చెల్లెలి బాధ్యత అక్క భుజానికి ఎత్తుకున్నారు.
(ఎస్.ఎస్.వి. భాస్కరరావ్)
తిరుపతి: అక్కచెల్లెళ్ళ అనురాగం మాటలకు అందని భావం. అందుకే, ప్రతి ఇంటా ఆడబిడ్డ ఉండాలంటారు. ఈ మాటను ఓ అక్క అక్షర సత్యం చేస్తున్నారు. "మా తండ్రులను ఓడించండి" అని ఇటీవల కొందరు వారసులు బయటకు రావడం ద్వారా రాజకీయాల్లో అనుబంధానికి తావు ఉండదనే విషయం తేటతెల్లం అవుతోంది. ఇక్కడ మాత్రం అస్వస్థతకు గురైన చెల్లెలి విజయానికి ఆమె సోదరి, తమ్ముడు శ్రమిస్తున్నారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వెళ్తూ ప్రచారం చేస్తున్నారు.
టిడిపి అభ్యర్థికి అస్వస్థత
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండలు మండుతున్నాయి. 100ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాయి. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అనంతపురం జిల్లా సింగనమల కూటమిలోని టిడిపి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. ఏనలేని ఉత్సాహంతో అవిశ్రాంతంగా ప్రచార ఘట్టంలో నిమగ్నమైన శ్రావణిశ్రీ మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ తమ పార్టీ అభ్యర్థి శ్రావణిశ్రీ అస్వస్థతకు గురి కావడంపై టిడిపి నేతలు ఆందోళన చెందారు. ఆరోగ్యం సహకరించని స్థితిలో ఆమె సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి పరిమితమయ్యారు.
ఇంటిలో వైద్య సేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివయాదవ్, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, అనంతపురం జిల్లా ఎన్నికల సమన్వయకర్త ఈరన్న, శింగనమల నియోజకవర్గం పరిశీలకులు గుర్రప్ప నాయుడు బండారు శ్రావణి నివాసానికి వెళ్లి పరామర్శించారు. మునుపటి కంటే ఏమాత్రం ఉత్సాహం, పట్టుదల సడలనివ్వకుండా టిడిపి నాయకులు నియోజకవర్గంలో ప్రచారం మరింత ముమ్మరం చేశారు. ఇందుకోసం..
తెరమీదికి శ్రావణి సోదరి
తన చెల్లెలు బండారు శ్రావణిశ్రీ వడదెబ్బ వల్ల అస్వస్థతకు గురికావడం ఆమె అక్క బండారు కిన్నెర తట్టుకోలేకపోయారు. మాజీమంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బంధువుల కుటుంబంలో వివాహం చేసుకున్న కిన్నెరకు రాజకీయాలతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ఈ అనుభవంతో ఇప్పటివరకు చెల్లెలు బండారు శ్రావణిశ్రీ పార్టీ ప్రచార సరళి, వ్యూహాలు తయారు చేయడంలో తెరవెనుక తన మేధస్సుకు పదును పెట్టిన కిన్నెర తన తమ్ముడుతో కలిసి ప్రచారరంగంలోకి వచ్చారు. పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపరుస్తూ, పల్లెలను చుట్టేస్తున్న కిన్నిర ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. ఈ విషయమై సింగనమల మండలం టిడిపి నాయకుడు, బలిజ సంఘం అధ్యక్షుడు దండు విజయకుమార్.. ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.
" ఈనెల నాలుగో తేదీన 8 పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించాం. పొద్దున ప్రచారానికి బయలుదేరితే, సాయంత్రం నాలుగు గంటలకు మధ్యాహ్న భోజనం చేశాం. రాత్రి 12 గంటల వరకు తిరుగుతూనే ఉన్నాం’’ అని విజయ్ కుమార్ తెలిపారు. ‘‘ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా ఆ రోజు అర్ధరాత్రి శ్రావణిశ్రీ అస్వస్థతకు గురయ్యారు" అని విజయకుమార్ తెలిపారు. ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో సోమవారం ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యామని ఆయన చెప్పారు. ప్రచారానికి బయలుదేరారు కానీ.. బండారు శ్రావణిశ్రీ కదల లేకపోయారని, మంగళవారం నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందని విజయకుమార్ వివరించారు.