Kingfisher beer|దిగొచ్చిన ‘కింగ్’ ఫిషర్

సోమవారం నుండి బీర్ల ఉత్పత్తిని ప్రారంభించింది.;

Update: 2025-01-21 06:30 GMT

దాదాపు 15 రోజులు బెట్టుచేసిన కింగ్ ఫిషర్ బీర్ల తయారీసంస్ధ యునైటెడ్ బ్రూవరీస్ చివరకు దిగొచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మొదటికే మోసం వస్తుందని ఆలోచించి వేరేదారిలేక ప్రభుత్వంతో రాజీపడింది. ఫలితంగా సోమవారం నుండి బీర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఉత్పత్తి మొదలుపెట్టిన విషయమై బాంబే స్టాక్ ఎక్స్చేంజికి లేఖ కూడా రాసింది. తాజా పరిణామాలతో బీరు ప్రియులకు గతంలో లాగే కింగ్ పిషర్ బీర్లు(King fisher Beer) అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీర్లపైన కమీషన్ పెంచాలని, బకాయిలను వెంటనే తీర్చాలని యునైటెడ్ బ్రూవరీస్(యుబీ)(UB Company) కంపెనీ యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బకాయిలను వెంటనే చెల్లించకపోయినా, కమీషన్ పెంచకపోయినా కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వటమే కాకుండా ఉన్న ఆరుయూనిట్లలోను కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని నిలిపేసింది.

యూబీ కంపెనీ చర్యలతో ముందు షాక్ తిన్న రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం వెంటనే తేరుకున్నది. మార్కెట్లో బీరుప్రియులకు కింగ్ ఫిషర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర కంపెనీల బీర్లను అందుబాటులో ఉంచేట్లుగా చర్యలు మొదలుపెట్టింది. ఇంత సడెన్ గా బీర్ల తయారీ ఉత్పత్తిని పెంచటం ఏ కంపెనీకీ సాధ్యంకాదు. ఎందుకంటే ముడిసరకు దొరకాలి, సేకరించాలి, వర్కర్లు దొరకాలి, ఫిష్టులు పెంచాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బీర్ల కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. అవసరమైతే మూడు షిఫ్టుల్లో వర్కర్లను పెట్టుకుని బీర్లను ఉత్పత్తిచేయాలని, ముడిసరుకు కొనుగోలుకు అనుమతులిస్తామని చెప్పింది. మార్కెట్లో బీర్ల కొరత అన్నది లేకుండా చేయాలని ఆదేశించింది. దాంతో మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్లకు ప్రత్యామ్నాయంగా ఇతర బీర్లు బడ్ వైజర్(Budweiser), కార్ల్స్ బర్గ్, రాయల్ చాలెంజ్(Royal challenge) లాంటి 30 రకాల బీర్ల అమ్మకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. భవిష్యత్తులో కింగ్ ఫిషర్ బీర్ కు ప్రత్యామ్నాయంగా అనేకరకల బీర్లను ప్రమోట్ చేయటమే ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది.

ప్రభుత్వం తరపున జరుగుతున్న వ్యవహారాలను గమనించిన యూబీ కంపెనీ యాజమాన్యంలో కలవరంమొదలైంది. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని నిలిపేస్తే మార్కెట్లో బీర్లకు కొరతవచ్చేస్తుందని, మందుబాబులు ప్రభుత్వంపై తమ ఉత్పత్తుల కోసం గోలచేస్తారని యూబీ కంపెనీ అనుకున్నది. మందుబాబుల నుండి వచ్చేఒత్తిడికి ప్రభుత్వంతలొంచి తమడిమాండ్లను అంగీకరిస్తుందని కంపెనీ యాజమాన్యం భావించింది. అయితే యూబీకంపెనీ యాజమాన్యం ఒకటి అనుకుంటే ప్రభుత్వం మరోటి ఆలోచించింది. దాంతో కింగ్ ఫిషర్ బీర్ల మార్కెట్ ను ఇతరకంపెనీల బీర్లు ఆక్రమించేస్తే తమకు మొదటికేమోసం వస్తుందని యూబీ కంపెనీ భయపడింది. అందుకనే వేరేదారిలేక ప్రభుత్వంతో రాజీకి వెళ్ళింది. ఫలితంగా సోమవారం నుండి సంగారెడ్డిలోని యూనిట్లలో కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని మొదలుపెట్టింది.

ప్రభుత్వ వాదన ఏమిటి ?

నిజానికి బీర్ల కంపెనీకి ప్రభుత్వం దాదాపు రు. 2 వేల కోట్లు బకాయిలున్నది వాస్తవమే. అయితే ఈ బకాయిలు బీఆర్ఎస్ హయాంలోనివి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తమహయంలో రెగ్యులర్ గా బిల్లులు చెల్లిస్తు పాతబకాయిలను కూడా కొంచెంకొంచెం చెల్లిస్తోంది. ఇదేసమయంలో బీర్లకమీషన్ పెంచే విషయంలో ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీని నియమించింది. ఈ కమిటీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ధరలు, కమీషన్ తదితర విషయాలపై అధ్యయనంచేస్తోంది. కమిటీరిపోర్టు అందిన తర్వాత చర్చలు జరుపుదామని ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలకు చెప్పింది. ఇక్కడ సమస్య ఏమిటంటే బీర్ల కమీషన్ పెంచాలంటే ముందు బీర్ల ధరలు పెంచాలి. బీర్ల ధరలు పెంచకుండా కంపెనీలకు కమీషన్ పెంచటం సాద్యంకాదు. ఎందుకంటే ధరలు పెంచకుండా కమీషన్ పెంచితే ప్రభుత్వానికి ఆదాయంతగ్గిపోతుంది. పోనీ ధరలు పెంచుదామా అంటే మందుబాబులపై ప్రభావంపడుతుంది. అందుకనే కమీషన్ పెంచే విషయంలో ప్రభుత్వం కమిటీని వేసింది. కమిటీ రిపోర్టు ఎప్పుడిస్తుందో చూడాలి.


యూబీ ధైర్యం ఏమిటి ?

ఏమిటంటే బీర్ల మార్కెట్లో కింగ్ ఫిషర్ రారాజనే చెప్పాలి. తెలంగాణ(Telangana)లో రోజుకు 15 లక్షల బీర్లు అమ్ముడుబోతున్నాయి. ఇందులో కింగ్ ఫిషర్ మార్కెట్ షేర్ సుమారు 11 లక్షల బీర్లు. టోటల్ మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ల మార్కెట్ సుమారు 70 శాతం. మిగిలిన అన్నీ కంపెనీల బీర్ల మార్కెట్ 30 శాతం మాత్రమే. మార్కెట్లో తమ బీర్ మోనోపలి కాబట్టి ఉత్పత్తిని నిలిపేస్తామని అంటే ప్రభుత్వంభయపడిపోయి తమడిమాండ్లకు అంగీకరిస్తుందని యూబీ కంపెనీ యాజమాన్యం అనుకున్నది. అయితే ప్రభుత్వమేమో యూబీ కంపెనీ బెదిరిస్తోందన్న భావనకు వచ్చి భవిష్యత్తులో కింగ్ ఫిషర్ బీర్ అన్నది మార్కెట్లో లేకుండాచేయాలని డిసైడ్ అయ్యింది. అందుకనే యూబీ కంపెనీ బెదిరింపులను పట్టించుకోకుండా ప్రత్యామ్నాయమార్గాలను చూసింది. ఇతర బీర్లతయారీ కంపెనీలయాజమాన్యాలతో బ్రూవరీస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. కింగ్ ఫిషర్ మార్కెట్లో దొరక్కపోయినా ప్రత్యామ్నయంగా ఇతర కంపెనీలబీర్లు మందుబాబులకు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటున్నది.

ఇపుడు ప్రభుత్వ డిపోల్లో కింగ్ ఫిషర్ బీర్ల నిల్వలు 11 లక్షల బాటిళ్ళు మాత్రమే. ఈ నిల్వలు మహాయితే మరో వారంరోజులు వస్తాయంతే. అందుకనే ఇపుడున్న స్టాక్ అయిపోయిన తర్వాత కింగ్ ఫిషర్ బీర్ల మార్కెట్ ను ఇతర కంపెనీల బీర్లు పంచుకునేట్లుగా అధికారులు ఆయాకంపెనీలయాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు. జరుగుతున్నది గమనించిన తర్వాత తాము మొండికేస్తే మొదటికే మోసంవస్తుందని అర్ధమైన యూబీ కంపెనీ వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కమీషన్ పెంపు, బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆదివారం నాటికి ప్రభుత్వ డిపోల్లో కింగ్ ఫిషర్ బీర్ల నిల్వలు సుమారు లక్ష కేసులు మాత్రమే ఉన్నాయి. దాంతో చర్చలు సక్సెస్ అయ్యాయి కాబట్టి కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తిని వెంటనే ప్రారంభించబోతున్నట్లు ముంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్(Mumbai stock exchange) కి లేఖ రాయటమే కాకుండా బీర్ల ఉత్పత్తిని మొదలుపెట్టేసింది. నిజానికి యూబీ కంపెనీ యాజమాన్యానికి ఇప్పుడిచ్చిన హామీనే గతంలో కూడా ఇచ్చింది. అయితే అప్పట్లో ప్రభుత్వ హామీని పట్టించుకోకుండా మొండిపట్టుబట్టిన కంపెనీ ఇపుడు సరెండర్ అయిపోయింది. సరే, కారణాలు ఏవైనా మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్లయితే అవైలబులిటిలోకి వచ్చాయి అంతే చాలు.

Tags:    

Similar News