కిడ్నాప్ చేసి..గొంతు కోసి
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-07-25 07:20 GMT
ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలు ఓ తండ్రి, అతని కుమారుడి హత్యకు కారణాలయ్యాయి. తనను ఆర్థికంగా మోసం చేశాడనే కోపంతో రగిలి పోయిన ఓ వ్యక్తి పగతో రగిలి పోయాడు. అదును కోసం ఎదరు చూసి ఇద్దరిని మట్టుబెట్టాడు. ఈ జంట హత్యలు బాపట్ల జిల్లాతో పాటు పల్నాడు జిల్లాలో కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కే వీరాస్వామిరెడ్డి కర్ణాటక రాజధాని బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. బెంగుళూరులో వీరాస్వామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన కుమారుడు కేవీ ప్రసాద్‌రెడ్డి కూడా బెంగుళూరులోనే ఉంటూ తండ్రి చేసే వ్యాపారాల్లో తోడు నీడగా ఉంటున్నాడు. వీరిది బాపట్ల జిల్లా సంతమాగులూరు. అయితే గత కొన్నేళ్లుగా వ్యాపార రీత్యా బెంగుళూరుకు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. వీరాస్వామిరెడ్డి సొంతూరైన బాపట్ల జిల్లా సంతమూగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్‌రెడ్డికి వీరాస్వామిరెడ్డికి పాత గొడవలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తడంతో కక్షలకు దారి తీశాయి.
వీరాస్వామిరెడ్డి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో అనిల్ కుమార్‌రెడ్డి అద్దంకి కోర్టుతో పాటు ఒంగోలు, నరసరావుపేట కోర్టుల్లో కేసులు వేశారు. ఈ చెల్లని చెక్కుల కేసులో నరసరావుపేట కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీరాస్వామిరెడ్డి, ఆయన కుమారుడు కేవీ ప్రసాద్‌రెడ్డి బెంగుళూరు నుంచి వచ్చారు. వారి వెంట తమ లాయర్ నాగభూణంను కూడా బెంగుళూరు నుంచి వెంటబెట్టుకొచ్చారు.
స్థానికంగా బుధవారం ఉదయం బయట టిఫిన్ చేసి నరసరావుపేట కోర్టుకు వెళ్లేందుకు వీరాస్వామిరెడ్డి, ఆయన కుమారుడు ప్రసాద్‌రెడ్డి, వారి లాయర్ నాగభూషణం బయలుదేరారు. చెల్లని చెక్కులు ఇచ్చారని వీరాస్వామిరెడ్డి మీద కోర్టులో కేసు వేసిన గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డి కొంత అనుచరులతో కలిసి స్కార్పియోలో వచ్చి వీరాస్వామిరెడ్డిని, ప్రసాద్‌రెడ్డిలను కిడ్పాప్ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. దానిలో నుంచి తేరుకొని చూసే లోగా కిడ్పాపర్లు అక్కడ నుంచి పరారయ్యారు. పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా, క్షణాల్లో స్కార్పియో అక్కడ నుంచి మాయం అయ్యింది.
వీరాస్వామిరెడ్డిని, ఆయన కుమారుడు ప్రసాద్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోకి తీసుకెళ్లి వీరాస్వామిరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలను గొంతు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు.
జంట హత్యల సమాచారం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి ఆర్థిక లావాదేవీల కారణంగా హత్యలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యల వెనుక ఇంకా ఏమైనా కారణాలు న్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే దీనికి తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. నిందితుడికి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చనిపోయిన తండ్రీ కొడుకులు బెంగుళూరులో బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. రాజకీయ పరమైన కక్షలు ఏమైనా ఈ హత్యల వెనుక ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.