విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం
అత్యంత రహస్యంగా టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసి వాటిని పేల్చేందుకు కుట్రలు పన్నారనే ఆరోపణలతో సీరాజ్, సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.;
By : The Federal
Update: 2025-05-23 09:11 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. విశాఖపట్నం రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను విజయనగరం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. విచారణ కోసం విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల సెంటర్‌కు వారిని తరలించారు. సమాచారం అందుకున్న విజయనగరం ఇన్‌ఛార్జి ఎస్పీగా ఉన్న మాధవరెడ్డి కూడా పోలీసు ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నిందితులు సిరాజ్, సయ్యద్‌ల విచారణ జరగనుంది.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఉగ్ర కార్యకలాపాలపై దేశ వ్యాప్తంగా తనఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయనగరంలో సిరాజ్, సమీర్‌లు అంశం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా నుంచి ఐఎస్‌ఐ హ్యండ్లర్ ఆదేశాల మేరకు టిఫిన్ బాంబులు తయారు చేసి వాటిని పేల్చేందుకు కుట్రలు పన్నారని, రంపచోడవరం అటవీ ప్రాంతంలో ట్రయల్స్ కూడా నిర్వహించారనే సమాచారం మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వీరిని విజయనగరం కోర్టులో హాజరు పరచగా, వీరికి రిమాండ్ విధించింది. దీంతో వీరిని విశాఖ జైలుకు తరలించారు. ఈ క్రమంలో విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన విజయనగరం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల పాటు విచారణ జరిపేందుకు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏడు రోజుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.