టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారుల్లో ఒకడైన టీ ప్రభాకరరావు పాస్ పోర్టును పాస్ పోర్ట్ ఆథారిటి ఆఫ్ ఇండియా(పీఏఐ) రద్దుచేసింది;
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకున్నది. ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారుల్లో ఒకడైన టీ ప్రభాకరరావు పాస్ పోర్టును పాస్ పోర్ట్ ఆథారిటి ఆఫ్ ఇండియా(పీఏఐ) రద్దుచేసింది. ప్రభాకరరావు పాస్ పోర్టును రద్దుచేసినట్లు సీఐడీ ఉన్నతాధికారులకు పీఏఐ సమాచారం అందించింది. ట్యాపింగ్(Telephone Tapping) కేసు విచారణ నుండి తప్పించుకునేందుకు ప్రభాకరరావు గడచిన ఏడాదిగా అమెరికా(America)లోనే ఉన్నవిషయం అందరికీ తెలిసిందే. 2024 మార్చిలో ట్యాపింగ్ కేసులో మొదటి అరెస్టు జరగ్గానే బీఆర్ఎస్(BRS) హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు, మీడియా అధినేత శ్రవణ్ రావు హైదరాబాదు నుండి అమెరికాకు పారిపోయారు. వీళ్ళిద్దరినీ అమెరికా నుండి హైదరాబాద్(Hyderabad) రప్పించేందుకు సీఐడీ అధికారులు ఎంతప్రయత్నించినా సాధ్యంకాలేదు.
అయితే చివరి ప్రయత్నంగా సీఐడీ అధికారులు సీబీఐ ద్వారా అమెరికాలోని ఇంటర్ పోల్(Inter Pol) ఉన్నతాధికారులను సంప్రదించారు. అప్పటికే ప్రభాకరరావు తనకు అమెరికా పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకరరావు అరెస్టుకు రెడ్ కార్నర్ నోటీసు జారీఅయ్యింది. ఎప్పుడైతే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యిందో వెంటనే పౌరసత్వం ప్రక్రియను అమెరికా ప్రభుత్వం నిలిపేసింది. ఫాలో అప్ గా అమెరికాలోని కాన్సులేట్ జనరల్, ఇంటర్ పోల్, కేంద్రప్రభుత్వం సహకారంతో ప్రభాకరరావును ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయగానే నిందితుడి పాస్ పోర్టును జప్తుచేస్తున్నట్లు పీఏఐ ప్రకటించింది. ఇదే విషయాన్ని నిందితుడికి పీఏఐ సమాచారం కూడా అందించింది. పీఏఐ నిబంధనల ప్రకారం పాస్ పోర్టు జప్తుచేస్తే వెంటనే నిందితుడు తన పాస్ పోర్టును పీఏఐకి సరెండర్ చేయాలి. అయితే ప్రభాకరరావు తన పాస్ పోర్టును సరెండర్ చేయలేదు. అందుకనే తాజాగా నిందితుడి పాస్ పోర్టును రద్దుచేస్తున్నట్లు సీఐడీ అధికారులకు పీఏఐ సమాచారం అందించింది. ఎప్పుడైతే పాస్ పోర్టు రద్దయ్యిందో ప్రభాకరరావు ఎక్కువరోజులు అమెరికాలో ఉండలేరు. పాస్ పోర్టు లేకుండా ఉండేవారిని అమెరికా ప్రభుత్వం ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ కింద లెక్కేస్తుంది. అందుకనే పట్టుకుని అరెస్టుచేసినా చేస్తుంది.
పాస్ పోర్టు రద్దు అవటంవల్ల ఏమవుతుందంటే అమెరికా నుండి ప్రభాకరరావు ఏ దేశానికీ వెళ్ళలేడు. అలాగని ఇండియాకు కూడా రాలేడు. అందుకనే ఇంటర్ పోల్ ఉన్నతాధికారులు నిందితుడిని పట్టుకుని ఇండియాకు అప్పగించేరోజు ఎంతోదూరంలో లేదని అర్ధమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యర్ధులకు చెందిన వేలాది మొబైల్ ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాప్ చేయించటంలో ప్రభాకరరావే కీలకంగా వ్యవహరించారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. చాలాకాలం జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు. విచారణలో వాళ్ళిచ్చిన వాగ్మూలం ప్రకారమే ట్యాపింగ్ లో ప్రభాకరరావు కీలకమన్న విషయం బయటపడింది. ప్రభాకరరావు అరెస్టయి విచారణకు హాజరైతే ట్యాపింగ్ లో కీలకసూత్రదారి ఎవరనే విషయం బయటకు వస్తుంది.
ప్రభాకరరావుతో పాటు ట్యాపింగ్ లో కీలకమైన మరో పాత్రదారుడు మీడియా యజమాని శ్రవణ్ రావు సీఐడీ విచారణకు మూడుసార్లు హాజరయ్యాడు. అరెస్టు చేయద్దనే సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రవణ్ అమెరికా నుండి ఇండియాకు వచ్చి సీఐడీ విచారణకు హాజరవుతున్నాడు. మూడుసార్లు విచారణకు హాజరైనా విచారణలో సహకరించలేదని సమాచారం. 2023 ఎన్నికల్లో వాడిన రెండు ఫోన్లను ఇవ్వాలని అడిగినా శ్రవణ్ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ప్రభాకరరావు గనుక హైదరాబాదుకు వస్తే ట్యాపింగ్ దర్యాప్తు ఒక్కసారిగా ఊపందుకునే అవకాశముంది.