ఏసీఏ చైర్మన్‌గా కేశినేని చిన్ని?
ఆంధ్ర క్రికికెట్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ను ఎన్నుకునేందుకు అంతా రెడీ అయింది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-08-07 05:22 GMT
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు. ప్రస్తుత ప్రభుత్వ వత్తిడి మేరకు రాజీనామా చేసినట్లు విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. నూతన అధ్యక్షుడిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్‌ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు ఓటు హక్కు కూడా వచ్చింది. కర్నూలు జిల్లా అసోసియేషన్‌లో సభ్యత్వం పొందారు. అక్కడి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం
రాష్ట్రంలో ఏసీఏకు అనుబంధంగా 13 జిల్లాల్లో జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా ముఖ్య పట్టణాల్లో 36 క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయి. అసోసియేషన్స్, క్రికెట్ క్లబ్స్‌లో ఉన్న సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. వీరు నూతన కమిటీని ఎన్నుకుంటారు. శివనాథ్‌కు ఇటీవలి వరకు క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యత్వం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు కర్నూలు క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఆయనకు ఓటు హక్కు వచ్చింది. ఎన్నికల్లో శివనాథ్ ప్యానల్ పోటీ చేస్తుంది. ఈ ప్యానల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేవారు లేరని చెప్పొచ్చు. ఎవ్వరూ పోటీ వేయకుంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.
కొత్త పాలకవర్గానికి 14 నెలల సమయం
కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గం 14 నెలల పాటు అధికారంలో ఉంటుంది. పాలకవర్గానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంది. అయితే గత పాలక వర్గం మధ్యలోనే రాజీనామా చేసినందున కొత్త పాలకవర్గం ఎన్నిక అనివార్యమైంది. కొత్త పాలవర్గం ఎన్నిక ముగిసిన తరువాత తిరిగి మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఏసీఏ చరిత్రలో ఒకసారి పాలవర్గం ఎన్నికైతే మూడేళ్లు పూర్తిగా ఉండి ఆతరువాత కొన్న అపెక్స్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అది తారుమారైంది. మధ్యలోనే పాలకవర్గం రాజీనామా చేయాల్సి వచ్చింది.
రాజకీయాలే కారణం
గత ప్రభుత్వం నుంచి ఏసీఏలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గత పాలకవర్గంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన అల్లుడు, ఆయన సోదరుడికి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించి రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓడిపోగానే తెలుగుదేశం ప్రభుత్వం తమకు చెందిన వారిని ఏసీఏలో పెట్టుకునేందుకు వ్యూహం రచించింది. అందులో భాగంగానే గత పాలకులను రాజీనామా చేయించి కేశినేని చిన్నిని రంగంలోకి దించింది. ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రంగా ఏసీఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక నుంచి విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని ఏసీఏ వారు భావిస్తున్నారు.
ఉద్యోగుల్లో తొలగని ఆందోళన
ఏసీఏ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు ఏసీఏలో ఉన్న ఉద్యోగులు ఒకసారి ఉద్యోగంలో చేరితే రిటైర్డ్ అయ్యే వరకు ఉంటూ వచ్చారు. అయితే రాజకీయాలు ఏసీఏలో ప్రవేశించినందున వారికి అనుకూలమైన వారిని ఉద్యోగులుగా నియమించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళలో ఉద్యోగులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పడినప్పుడు క్రికెట్ అసోసియేషన్‌కు బయటి నుంచి సహాయ సహకారాలు అందించిన మాజీ ఎంపి గోకరాజు గంగరాజు కొత్త పాలవర్గం నుంచి ఒక హామీ తీసుకున్నారు. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించమని మాట ఇచ్చిన తరువాతనే వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని ఎన్నుకునేందుకు వకాశం కల్పించారు. గంగరాజు వైపు నుంచి పోటీకి ఎవ్వరూ దిగకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా అటువంటి హామీ ఉద్యోగులకు ఎవరు ఇస్తారనే చర్చ జరుగుతోంది. గంగరాజు మనుషులు ఇప్పటికీ ఏసీఏలో ఎక్కువ మందే ఉన్నారు.