కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యంలేదన్న కేసీఆర్
కేసీఆర్(KCR) మాట్లాడుతు ఈప్రభుత్వం ఐదేళ్ళుంటేనే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు జనాలకు తేడా తెలుస్తుందని చెప్పారు;
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టంచేశారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి(Elkaturti public meeting)లో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ బహిరంగసభ జరిగింది. పార్టీ రజతోత్సవం సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్(KCR) మాట్లాడుతు ఈప్రభుత్వం ఐదేళ్ళుంటేనే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు జనాలకు తేడా తెలుస్తుందని చెప్పారు. అన్నీ రంగాల్లోను ఫెయిలైన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government failed) కావాలో లేకపోతే ఈసారి బీఆర్ఎస్(BRS) ను గెలిపించుకోవాలో జనాలే ఆలోచించాలన్నారు.
2023 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయటంలో ప్రభుత్వం ఫెయిలైందన్నారు. విద్యార్ధినులకు స్కూటీలు ఇవ్వటంలో ఫెయిలైందని, రైతుల నుండి వడ్లు కొనటంలో ఫెయిలైందని, రైతు రుణమాఫీ చేయటంలో, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో, 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయటంలో ఏ అంశంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని కేసీఆర్ ధ్వజమెత్తారు. తప్పుడు హామీలివ్వటంలోను, గోల్ మాల్ చేయటంలోను కాంగ్రెస్ పార్టీకి మించిందిలేదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులో పూడికలు తీయటానికి ఉపయోగపడిన బుల్డోజర్లు ఇపుడు పేదలఇళ్ళను కూల్చటానికి ఉపయోగపడుతున్నట్లు మండిపడ్డారు.
రైతుబంధు, వృద్ధాప్య పించన్, వికలాంగ పెన్షన్ ఏది తీసుకున్నా తమ ప్రభుత్వం ఇచ్చిందానికన్నా ఎక్కువిస్తామని జనాలకు కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చినట్లు కేసీఆర్ ఆరోపించారు. 420 తప్పుడు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్ళకు మొక్కాలని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ 15మాసాల పాలనచూసి తనకు దుఖఃమవుతోందని, మనసుకు బాధ కలుగుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఏమీ మాట్లాడలేదు, జనాల్లోకి కూడా రాలేదన్నారు. కాని ఇపుడు అన్నీరంగాల్లోను విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి ఇక నుండి తాను రంగంలోకి దిగుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
15 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సర్వనాశనం అయిపోయిందన్నారు. తన పాలనలో ప్రతిఏడాది రు. 15 వేలకోట్ల ఆదాయం వస్తే ఇపుడు లక్షల కోట్లరూపాయల అప్పుల్లో ముణిగిపోయినట్లు మండిపడ్డారు. కాంగ్రెస్ చేతికి కత్తిచ్చి తనను యుద్ధంచేయమని అంటే ఎలా సాధ్యమో జనాలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసి ఎలాంటి శనిని నెత్తిన పెట్టుకున్నామో జనాలంతా ఆలోచించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇక రెండున్నరేళ్ళే కాబట్టి కాంగ్రెస్ పాలనగురించి మేథావులు, ఉద్యమకారులు, జనాలు ఆలోచించాలని పిలుపిచ్చారు. అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే అని గట్టిగా చెప్పారు. భూములను అమ్మటంలో తప్పులేదు కాని విచక్షణ ఉపయోగించాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి, ఉస్మానియా యూనివర్సిటి భూములు అమ్మచ్చా అని ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు.
పోలీసులకు హెచ్చరిక
పనిలోపనిగా పోలీసులను కూడా కేసీఆర్ హెచ్చరించారు. పోలీసులు ఎందుకు రాజకీయాల్లో తలదూరుస్తున్నారని నిలదీశారు. అధికారంలోకి రాబోయేది తామే అన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ళకు వెళ్ళి అందరు డైరీల్లో రాసుకోండని హెచ్చరించారు. తమనేతలు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఎందుకు బలవుతారని ప్రశ్నించారు. తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పార్టీ లీగల్ సెల్ పోరాటాలు చేస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.