కేసీఆర్ ఎంత కాలానికి కనిపించారో

కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరవ్వటమే చాలా గొప్పగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా ఫోకస్ చేసింది.

Update: 2024-07-25 09:03 GMT

చాలాకాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రజంటేషన్ సమయానికి కేసీయార్ అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరైన కేసీఆర్ దీనిపైన చర్చ జరిగే శనివారం నాడు కూడా హాజరవుతారా లేదా అన్నది చూడాలి. కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరవ్వటమే చాలా గొప్పగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా ఫోకస్ చేసింది. కేసీయార్ అసెంబ్లీకి హాజరవ్వటాన్ని మీడియా ఎందుకింతగా హైలైట్ చేసింది ?

విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న పదేళ్ళల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను కేసీఆర్ నోరెత్తనిచ్చేవారుకారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం మొదలుపెట్టగానే మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదేపదే అడ్డుతగిలేవారు. చివరగా కాంగ్రెస్ సభ్యులను కేసీఆర్ చాల చులకనగా మాట్లాడేవారు. తప్పదని అనుకుంటే కాంగ్రెస్ సభ్యులను సభలో నుండి సస్పెండ్ చేసి బయటకు పంపేసేవారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదో గొడవ జరుగుతునే ఉండేది. సభలో నుండి రేవంత్ ను ఒకసారి నెలరోజల పాటు సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

ఈ నేపధ్యంలోనే పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోవటం ఒకఎత్తయితే కేసీఆర్ కు బద్ధవిరోధి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రవ్వటం మరో ఎత్తు. అసెంబ్లీ సెషన్ కు వస్తే రేవంత్ ను కేసీయార్ ఫేస్ చేయాల్సుంటుంది. అందుకనే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ మొదలైంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండోరోజే కేసీయార్ బాత్ రూములో జారిపడటంతో తుంటిఎముక విరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించటంతో కేసీయార్ బెడ్ దిగలేదు. దాంతో అసెంబ్లీలో ఎంఎల్ఏగా ప్రమాణం కూడా చేయలేకపోయారు.

అనారోగ్యం కాస్త సర్దుకున్నాక, నడవటం మొదలుపెట్టిన తర్వాత కేసీయార్ అసెంబ్లీకి హాజరై స్పీకర్ ఛాంబర్లో ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడగానే జరిగిన యాక్సిడెంట్ కారణంగా మొదటి అసెంబ్లీ సమావేశానికి, విశ్రాంతి కారణంగా రెండో సమావేశానికి కూడా కేసీయార్ హాజరుకాలేకపోయారు. ఇపుడు జరుగుతున్నది మూడో సెషన్ పైగా కీలకమైన బడ్జెట్ సమావేశాలు. అందుకనే బడ్జెట్ సమావేశానికి అయినా కేసీయార్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన గురువారం అసెంబ్లీకి కేసీయార్ హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన ప్రకటన ప్రకారం శనివారం ఉదయం బడ్జెట్ పై చర్చ మొదలవుతుంది. మరి చర్చలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News