కవిత అరెస్టు వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగిందా ?

కేసీయార్ కూతురు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అంశం బీజేపీకి బాగా అచ్చొచ్చినట్లే కనబడుతోంది.

Update: 2024-06-10 04:40 GMT

కేసీయార్ కూతురు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అంశం బీజేపీకి బాగా అచ్చొచ్చినట్లే కనబడుతోంది. పార్టీ గ్రాఫ్ పెరిగి ఎక్కువ సీట్లు రావటానికి కవిత అరెస్టే కారణమి బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అందుకనే కవిత అంశాన్ని నిచ్చెనమెట్లులాగ ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు అనుకుంటున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కవితను అరెస్టుచేయటం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువసీట్లు వచ్చాయని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత అరెస్టు అంశం చాలా కీలకంగా ఉండేది. కేసీయార్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది కాబట్టే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సూత్రదారి, కీలకపాత్రధారి అయిన కవితను ఈడీ, సీబీఐ అరెస్టు చేయటంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి తదితరులు పదేపదే ఆరోపించారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్, బీజేపీ సమర్ధవంతంగా తిప్పికొట్టలేక బాగా ఇబ్బంది పడ్డాయి. అప్పట్లో జరిగిన వ్యవహారాలను చూసిన జనాలు కూడా కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అనుకున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అందరినీ అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం రెండురోజుల విచారణతో వదిలిపెట్టేసింది.

సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఆ పరిణామాన్ని కాంగ్రెస్ తనకు అడ్వాంటేజ్ గా బాగా ఉపయోగించుకున్నది. కాంగ్రెస్ ఆరోపణలో లాజిక్ ఉండటంతో ప్రత్యర్ధులు తిప్పికొట్టలేకపోవటంతో జనాలు కూడా నిజమే అని నమ్మారు. దాని ఫలితంగా బీఆర్ఎస్, బీజేపీలు రెండూ నష్టపోయాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవాలన్న కేసీయార్ ఓడిపోయారు. అధికారంలోకి వచ్చేస్తామని ఒకవేళ రాకపోయినా గణనీయమైన సీట్లు సాధిస్తామని అనుకున్న బీజేపీ మీద కూడా దెబ్బపడింది. కవిత విషయంతో పాటు అనేక అంశాల నేపధ్యంలో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుని 64 సీట్లు గెలుచుకుని అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కమలంపార్టీ నేతల రివ్యూల్లో కవితను ఈడీ అరెస్టుచేయకపోవటం కూడా పార్టీ ఇమేజీని బాగా దెబ్బతీసిందనే నిర్ణయానికివచ్చారు. ఆ తర్వాత పార్టీతో పాటు కేంద్రప్రభుత్వంలోని పెద్దల మధ్య ఏమి చర్చలు జరిగాయో తెలీదు. పార్లమెంటు ఎన్నికలకు ముందు అంటే మార్చిలో ఈడీ కవితను అరెస్టుచేసి ఢిల్లీకి తీసుకెళ్ళింది.

ఎందుకింత హఠాత్తుగా కవిత అరెస్టు జరిగిందంటే అసెంబ్లీ ఎన్నిక లిక్కర్ స్కామ్ అంశం పార్టీని దెబ్బతీసినట్లుగానే పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతీయకూడదని. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వైపునుండి వినబడిన ఆరోపణలు పార్లమెంటు ఎన్నికల్లో వినబడలేదు. పార్లమెంటు ఎన్నికల్లో లిక్కర్ స్కామ్, కవిత పాత్ర అంశాన్ని కాంగ్రెస్ పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. అవినీతికి పాల్పడిన వాళ్ళపై కేసులు పెట్టడం, చర్యలు తీసుకునే విషయంలో కేంద్రప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదనే సంకేతాలను బీజేపీ నేతలు పదేపదే ఇచ్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవటం ఖాయమని, 12 సీట్లు గెలుచుంటామని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు చాలామంది నేతలు చెప్పినా చివరకు వచ్చింది 8 సీట్లు మాత్రమే.

8 సీట్లలో గెలవటం కూడా బీజేపీకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఎలాగంటే 2019 ఎన్నికల్లో పార్టీకి ఉన్నది నాలుగుసీట్లు మాత్రమే. అలాంటిది 4 సీట్ల నుండి 8 సీట్లకు పెరిగిందంటే నూరుశాతం బలాన్ని పెంచుకున్నట్లే. తమకు అన్ని పార్లమెంటు సీట్లు రావటానికి కవిత అరెస్టే కారణమని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇదేసమయంలో బీఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో చాలామంది నేతలపైన అనేక ఆరోపణలొచ్చాయి. స్వయంగా కేసీయార్ మీదే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలున్నాయి. కాబట్టి బీజేపీ బలపడి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ ను సాంతం దెబ్బతీయటమే మార్గమని బీజేపీ నేతలు డిసైడ్ అయినట్లున్నారు. బీఆర్ఎస్ ను లేవకుండా దెబ్బతీస్తే కాని బీజేపీ పుంజుకోదని నిర్ణయానికి వచ్చారు. అందుకనే కేసీయార్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది ముఖ్యనేతలపై బీజేపీ కన్నేసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమంది సీనియర్ కారునేతలపై ఈడీ, సీబీఐ దాడులుచేసి కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే కాని బీజేపీ గ్రాఫ్ పెరగదని అంతర్గత సమావేశాల్లో బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇదేసమయంలో కేసులు, అరెస్టుల నుండి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరటమే మార్గమని కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా అనుకుంటున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసీయార్ మీద గనుక కేంద్రప్రభుత్వం చర్యలు మొదలుపెడితే అప్పుడు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి నేతల వలసలు ఒక్కసారిగా ఊపందుకోవటం ఖాయం. అదేదో స్ధానికసంస్ధల ఎన్నికలు మొదలయ్యేలోగా జరిగితే బావుణ్ణని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకోవటంతో పాటు నరేంద్రమోడి మూడోసారి ప్రదానమంత్రి అయిన జోష్ పార్టీ నేతల్లో కనబడుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News