కావేరీ బస్సు.. కడుపు కోత మిగిల్చిందిలా..
బస్సు కొన్నది ఒక చోట.. బాడీని కట్టించింది మరోచోట.. తిప్పేది మరోచోట.. అయినా ఎవ్వరికీ పట్టింపులేకపోయా..
By : Amaraiah Akula
Update: 2025-10-24 11:33 GMT
అదో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన వాళ్లందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. ఇంతలో భారీ శబ్ధం.. కింది నుంచి చూస్తే మంటలు ఎగిసిపడుతున్నాయి.. బస్సులో కలకలం చెలరేగింది. మంటలు మరింత ఎగబాకాయి. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో సజీవదహనమయ్యారు. బస్సు డ్రైవర్లు పారిపోయారు. 20 మంది కాలి బూడిదయ్యారు..కొందరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
కర్నూలుకు 25 కిలోమీటర్ల దూరంలో దగ్ధమైన వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆకాశ్ అనే ప్రయాణీకుని కథనం ఇది. ఈ ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్న ఆకాశ్ .. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. దీపావళికి హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఆకాశ్ మాటల్లో ‘‘బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. హఠాత్తుగా లేచి చూడగా పెద్దఎత్తున మంటలు వచ్చాయి. వెంటనే బస్సు అద్దం పగలగొట్టి బయటకు దూకేశాను. నాతో పాటు బస్సులో నుంచి మరో ఇద్దరు బయటకు దూకారు’’ అని వివరించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాద సమయంలో కొందరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 22 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు.
బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారుడు కిందపడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ కుటుంబానికి చెందిన నలుగురూ సజీవదహనం అయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ కూడా ఉన్నారు.
మరణించిన వారిలో ఇప్పటి వరకు 14 మందిని గుర్తించారు. మిగతావారి ముఖాలు గుర్తుపట్టలేక పోవడంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు నిపుణులు కర్నూలు చేరుకున్నారు.
ప్రాణాలతో బయటపడిన వారు వీరే..
ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమా రెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కర్నూలులో జరిగిన ప్రమాద ఘటనలో 19 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. బైక్ పూర్తిగా బస్సు కిందికి వెళ్లిపోయిందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవీ..
కలెక్టరేట్‌లో: 08518-277305.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059.
ఘటనాస్థలి వద్ద: 91211 01061.
కర్నూలు పోలీసు స్టేషన్‌లో: 91211 01075.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(హెల్ప్ డెస్కు) : 94946 09814, 90529 51010
ప్రయాణికులు తేరుకునేలోపు బస్సు దగ్ధం: డీఐజీ
బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని.. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునేలోపు బస్సు దగ్ధమైందన్నారు. ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని.. మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదన్నారు. బైక్‌ను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
బస్సు యజమాని ఒకచోట.. రిజిస్ట్రేషన్ మరోచోట...
కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులు బయటపడ్డాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది.
ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకుంది. ఆల్ట్రేషన్‌లో రాయగడ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ కావేరి ట్రావెల్స్ 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్‌వోసీతో డయ్యూడామన్‌తో మరోసారి రిజిస్ట్రేషన్‌తో స్లీపర్ కోచ్‌గా మార్చారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను కోరారు.
కర్నూలు జిల్లా చిన్నిటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుంటున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రుల వెంట డీజీపీ హారీశ్ గుప్తా, ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, దస్తగిరి ఉన్నారు.
కర్నూలు ప్రమాదం కేవలం ఒక ఘటన కాదు. ఇది ఒక వ్యవస్థ వైఫల్యం, మానవ నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం. ఇవన్నీ కలిసి పెట్టిన కడుపుకోత ఇది. నిద్రలోనే సజీవదహనమైన వారిని తిరిగి తెచ్చుకోలేం కానీ భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి బస్సుల్లో మృతి చెందకుండా చూడవచ్చు అధికారులకు చిత్తశుద్ధి ఉంటే అని మానవహక్కుల వేదిక ఉపాధ్యక్షుడు ఎం.శరత్ అన్నారు.