కడప టీడీపీ మహానాడు కోలాహాలం మొదలు
వచ్చే నెల మే 27, 28, 29 తారీకుల్లో మహానాడును వైఎస్ కుటుంబ కంచుకోట అయిన కడపలో నిర్వహిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-04-08 06:38 GMT
కడపలో జరుపాలనుకుంటున్నతెలుగుదేశం పార్టీ 43వ మహానాడుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మహానాడుకు అనువైన స్థలం పరిశీలించేందుకు పార్టీ అధిష్టాన నాయకులు కడపను సందర్శించారు. వచ్చే నెల మే 27, 28, 29 తారీకుల్లో మహానాడును వైఎస్ కుటుంబ కంచుకోట అయిన కడపలో నిర్వహిస్తున్నారు. సుమారు 50 వేలమంది పాల్గొనేందుకు వీలుగా సభలో ఏర్పాట్లు చేయడానికి స్థల అన్వేషణ మొదలైంది.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కడప పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, కడప, కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు మాధవి, పుత్త చైతన్య రెడ్డి, వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీలు రాంభూపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జీలు బీటెక్ రవి, భూపేష్ రెడ్డి, రితీష్ రెడ్డి, కడప జిల్లా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, అమీర్ బాబులతో కలిసి సోమవారం కడపలో మంత్రుల బృందం మూడు స్థలాలను పరిశీలించింది.
కడప నగరం చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను పార్టీ నాయకులు పరిశీలించారు. కడప ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న స్థలాన్ని, కడప రింగ్ రోడ్డులోని జయరాజ్ గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. అలాగే కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న ఎన్జీవో లే అవుట్స్‌ను పరిశీలించారు. పరిశీలించిన మూడు స్థలాలను పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు నివేదిస్తారు. వీటిపైన చర్చించిన అనంతరం ఎక్కడ నిర్వహించాలనే దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు. కడపలో తలపెట్టిన మహానాడు వేదిక మరో వారం రోజుల్లో ఖరారు కానుందని, అనంతరం మహానాడు పండుగ ఏర్పాట్లు మొదలవుతాయని కడప పార్లమెంటు అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
మూడు రోజులపాటు జరిగే మహానాడు పండుగలో నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుగానే ప్రణాళికలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. మహానాడు వేదిక జాగాతో పాటు ఆహ్వానితులకు ఆహారం వడ్డించేందుకు అనువైన స్థలం, వంట వండడానికి అనువైన స్థలాన్ని సోమవారం మంత్రుల బృందం పరిశీలించింది. మహానాడుకు రాబోయే అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కడప నగరంతో సహా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గం హెడ్ క్వార్టర్‌లోని లాడ్జిలను ముందస్తుగా బుక్ చేయబోతున్నారు.