ఆర్పీ సిసోడియాను తప్పించి జయలక్ష్మిని నియమించారు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారిని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖకు కార్యదర్శిగా నియమించారు.;
ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి కూటమి ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది. ఈసారి చేసిన ఐఏఎస్ బదిలీల్లో ఆసక్తికర అంశం నెలకొంది. జగన్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించారనే కారణంగా కొంత మంది అధికారులను పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం ఈ సారి మంచి పోస్టులను కేటాయించింది.
ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పీ సిసోడియాను ఆ పోస్టు నుంచి తప్పించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్పీ సిసోడియాకు మంచి ప్రాధాన్యత కల్పించింది. కీలకమైన బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియాను నియమించింది. అయితే తాజాగా ఆదివారం చేపట్టిన బదిలీల్లో ఆయనను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. అంతగా ప్రాధాన్యత లేని చేనేత జౌళి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇప్పటి వరకు సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయలక్ష్మిని అదే పోస్టులో కొనసాగిస్తూ, అదనంగా రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఐటీ శాఖ కార్యదర్శిగా ఉన్న కాటమనేని భాస్కర్‌కు ఆ పోస్టును అలాగే కంటిన్యూ చేస్తూ ఏపీహెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.