‘గెలిచేది మనమే’.. నాగబాబు ధీమా
తిరుపతి కూటమిలో ఎటువంటి సమస్యలు లేవని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
By : S Subrahmanyam
Update: 2024-04-13 10:40 GMT
రానున్న ఎన్నికల్లో జనసేన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జనసేనా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత వివాదాలు ఏమీ లేవని, అసంతృప్తి నేతలతో ఉన్న చిన్నచిన్న సమస్యలు కూడా సర్దుకున్నాయని ఆయన ప్రకటించారు. తిరుపతిలో జిల్లా నేతలతో పవన్ కల్యాణ్, నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్బంగానే నాగబాబు తన వ్యాఖ్యలతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరిగిన చర్చలను కూడా ప్రస్తావించారు. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో కలిసి పనిచేయడానికి ప్రతి నేత సుముఖత వ్యక్తం చేశారని నాగబాబు వెల్లడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుస్తారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభంజనంలా రాబోతుందని అన్నారాయన.
అందుకే తిరుపతి వచ్చాం
రెండు, మూడు పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడిన సందర్భాల్లో ఆయా పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండటం షరా మామూలేనని, వాటిని పరిష్కరించడానికే తాను, పవన్.. తిరుపతికి వచ్చామని నాగబాబు స్పష్టం చేశారు. ‘‘కూటమి నేతలతో చర్చించాం. అన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు. రానున్న ఎన్నికల్లో మనదే హవా. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. వైసీపీని చిత్తు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం అంతా ఏకమై కృషి చేయాలని, వైసీపీ వైఫల్యాలను ప్రజలను అర్థమయ్యేలా చెప్పాలని కేడర్‌కు సూచించారు.
తిరుపతి జనసేనలో సమస్య ఇదే
తిరుపతిలో తమ అభ్యర్థిగా జనసేన.. ఆరణి శ్రీనివాసులును ప్రకటించినప్పటి నుంచి తిరుపతి జనసేనలో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇరు పార్టీల నేతలు వ్యతిరేకించారు. అభ్యర్థిని మార్చేది లేదని పవన్ చెప్పడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆరణి శ్రీనివాసులు గెలవడం డౌటే అన్న అని ప్రచారం జోరందుకుంది. ఆరణికి తిరుపతిలో జనసేన, టీడీపీ ఓట్లు రావని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఈ ప్రచారం రోజురోజుకు పెరుగుతుండటంతో జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరణి శ్రీనివాసులు విషయంలో కేడర్‌తో మాట్లాడి వారికి నచ్చజెప్పారు. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని, అందుకు వారి సహకారం ఎంతైనా అవసరం ఉందని కేడర్‌కు వివరించారు. పవన్ మాటకు తలొంచిన కేడర్.. ఆరణి గెలుపు కోసం అంతా ఒక్కటై కృషి చేస్తామని ప్రకటించింది.