నాగబాబు వర్సెస్‌ వంగా గీత.. పిఠాపురంపై మాటల యుద్ధం

ఎర్ర కండువాపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు జనసేన నేత నాగబాబు ఘాటు సమాధానం ఇచ్చారు. అది కూడా తెలియకపోతే ఎలా అంటూ చురకలంటించారు.

Update: 2024-05-15 11:54 GMT

తాజాగా పోలింగ్ ముగించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. ఆంధ్రలో ఎన్నికల సమర శంఖం మోగినప్పటి నుంచే కీలకంగా మారిన ఈ నియోజకవర్గం ఇప్పుడు మరింత హాట్‌టాపిక్‌గా మారింది. అందుకు అక్కడ జరుగుతున్న ఎర్ర కండువా రాజకీయమే కారణం. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ రోజున జనసైనికులు ఎర్ర కండువాలు వేసుకోవడంపై అక్కడి వైసీపీ అభ్యర్థి వంగా గీత, జనసేన కీలక నేత నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లు మాటల అస్త్రాలను సంధించుకుంటున్నారు.

ఎర్ర కండువా గొడవ ఇదీ

అసలు పిఠాపురం పీఠాన్ని చుట్టుకుని ఉన్న ఎర్ర కండవా కొడవేంటో తెలుసా.. పోలింగ్ సమయంలో పిఠాపురంలోని పోలింగ్ కేంద్రాలను వైసీపీ అభ్యర్థి వంగా గీత పరిశీలించారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఎర్ర కండువాలు ధరించి ఉండటాన్ని గమనించిన ఆమె వారిపై ఫైరయ్యారు. ‘‘ఎర్ర కండువాలు కప్పుకుని జనసేనకు ఓటేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు. అలా పార్టీకి సంబంధించిన గుర్తులను వాటిని ధరించకూడదు’’ అంటూ అగ్గిమీద గుగ్గుళంలా మారారు. ఇదే అంశంపై ఆమె.. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రంలో జనసేన మద్దతుదారులు ఎర్ర కండువాలు ధరించి గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని, ఒకరు తనకు కూడా అదే విధంగా చెప్పారని ఆమె ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. జనసైనికులు అలానే ఎర్ర కండువాలు ధరించి తిరిగితే తాము కూడా వైసీపీ కండువాలు ధరించి తిరుగుతామని హెచ్చరించారు. జనసేన ఎన్నికల అబ్జర్వర్ కూడా ఎర్ర కండువా ధరించి ఉన్నాడని ఆమె.. ఎన్నికల అధికారికి ఫోన్లో చెప్పారు.

ఘాటుగా బదులిచ్చిన నాగబాబు

ఎర్ర కండువాలు వేసుకోవడంపై వంగా గీత.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంపై జనసేన నాయకుడు నాగబాబు ఘాటుగా స్పందించారు. ఎర్ర కండువా అనేది జనసేన జెండా కాదు అని ఆయన స్పష్టం చేశారు. ‘‘జనసేనకు ప్రత్యేక జెండా ఉంది. ఎర్ర కండువా జనసేన జెండా కాదు, రంగు కాదు. పవన్ కల్యాణ్ వినియోగించడం వల్ల ఎర్ర కండువాకు అంత క్రేజ్ వచ్చింది. ఈ ఎర్ర కండువాని ‘కాశీ తువాలు’ అంటారు. దాన్ని మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సామాన్యుడు తన చెమటను తుడుచుకోవడానికి సాధారణంగా వాడే మామూలు తువాలు మాత్రమే ఇది. ఈ తువాల్ గురించి కూడా తెలియకుండా వంగా గీత మాట్లాడుతున్నారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వ్యాఖ్యలపై వంగా గీత ఎలా స్పందిస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ముదురుతున్న మాటల యుద్ధం

ఈ ఎర్ర కండువా వివాదం ఇరు పార్టీల వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఆ మాత్రం తెలిస్తే పోలింగ్ కేంద్రంలో ఆమె అంత రాద్దాంతం చేసి ఉండేవారు కాదంటూ జనసైనికులు సెటైరలు వేస్తుంటే.. తమ పార్టీకి చెందిన వస్తువులా ప్రమోట్ చేసుకుని దాన్ని పోలింగ్ కేంద్రంలో ప్రదర్శించడమే కాకుండా మాకు నీతులు చెప్పడానికి వచ్చారా అంటూ వైసీపీ వర్గాలు ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ నేతలతో పాటు పార్టీల వర్గాల మధ్య కూడా వాడివేడిగా మాటల యుద్ధం సాగుతోంది.

అంత భయమెందుకో!

ఈ క్రమంలోనే ‘‘మొన్నటి వరకు ప్రచారం చేసినప్పుడు జనసేనకు డిపాజిట్ కూడా దక్కదు, పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌ను నమ్మరు అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రచారాలు కూడా ఫెయిల్ అంటూ దుమారం రేపారు. అంత ధీమాగా ఉన్న మీకు ఇంత భయం ఎందుకు మేడమ్.. ఎర్ర కండువా చూస్తేనే పీడకల వచ్చినట్లు ఉలిక్కి పడుతున్నారు’’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. అంేతకాకుండా పవన్‌ను ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు పన్నే కదా ముద్రగడను కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి దించారూ.. ఆయన కూడా ఫెయిలా.. అంటూ చురకలంటిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ వైసీపీ వర్గీయులు మాత్రం వీటన్నింటికి జూన్ 4న ప్రజలే సమాధానం ఇస్తారంటూ తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News