ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆంధ్రాలో వ్యవసాయ సంక్షోభం
ఏ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంలో ప్రభుత్వ పాత్ర ఉందంటున్న రైతులు, నిపుణులు
అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం రైతు జి. నాగార్జున తన ఐదు ఎకరాల పొలం లో ఐదు లక్షలు పెట్టుబడితో అరటి పంట వేశారు. పంట చేతికి అందే సరికి ధర పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. “అరటి ధర కిలో రెండు రూపాయలకు పడిపోయింది. పది నుండి పదిహేను రుపాయలకు అమ్మితే గానీ గిట్టదు,”అన్నారు. ఈ సారి రాయలసీమ జిల్లాల్లో ధరలు పడిపోవడంతో అరటి రైతులంతా ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా (Fruit Bowl of Indiaa) గా పేరున్న అనంతపురం జిల్లాలో నష్టానికి పంటను అమ్ముకోలేక అరటి గెలలను రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. ఇటీవలి దాకా దేశ, విదేశాల్లో అనంతపురం జిల్లాలో పండించే అరటి పళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో తాడిపత్రి నుంచి ఏకంగా ఒక ‘బనానా ట్రైన్’ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది అదే అరటి రైతు మీద చావు దెబ్బ వేసింది. గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. ఈ సంక్షోభం అరటికే కాదు, చాలా పంటలకు సోకింది. ఆంధ్రప్రదేశ్ రైతులంతా వరుసగా ధరలు పడిపోతున్న సంకోభానికి గురవుతున్నారు. మామిడి సీజన్ లో మామిడి పంటను రోడ్ల మీద పారబోశారు. తర్వాత టొమాటో రైతుకు ఇదే పరిస్థితి ఎదురయింది. వేరుశనగ రైతుకూడా డీలా పడిపోయాడు. మొక్కజొన్న పంటకూడా ధర పలకక ముంచేసింది. ఉల్లి కన్నీళ్లు తెప్పించింది. మిర్చి కంట్లో కారం చల్లింది.
ఎందుకీ పరిస్థితి వచ్చింది?
గత రెండు ఏళ్లుగా రాష్ట్రం లో పండుతున్న పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవటం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనే విమర్శ సర్వత్రా వినపడుతుంది. పంటల ప్రణాళిక లేకపోవటంతో ఏ పంటకు ధర వస్తే దాని వైపు రైతులు పరుగు పెడుతున్నారు. దీనితో పంట ఉత్పత్తి పెరిగి, ధరలు పడిపోయి, చివరకు పంటను రోడ్డు మీద పొలాలో పారబోసే పరిస్థితి వచ్చింది. మామిడి, మిర్చి లాంటి పంటలను ప్రణాళిక లేకుండా పండించటం, విదేశీ మార్కెట్ల పైన అతిగా ఆధారపడటం కూడా సంక్షోభానికి దారి తీస్తోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంట వేసినా గిట్టుబాటు అవటం లేదు.
“మొక్కజొన్న గిట్టుబాటు ధర రెండువేల నాలుగు వందల రూపాయలు ఉంటే కేవలం 1,600 రూపాయలు మాత్రమే దక్కుతోంది. మూడు కిలోల టమోటాలు 20 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం టమోటా పంటలో నాకు లక్ష లాభం వచ్చింది. ఇటీవల మంచి ధర వస్తుండటం తో నేను అరటి వేశాను,” అన్నారు. పశువులకు గడ్డి అవసరం కాబట్టి ఈసారి ఆ మేరకే వేరుశెనగ వేశాను అని కూడా బుక్కరాయసముద్రం నాగార్జున చెప్పారు.
వాతావరణంలో మార్పులు
వాతావరణ మార్పులలో భాగంగా అకాల వర్షాలు రాష్ట్రంలో రైతులకు శాపంగా మారాయి. చేతికి వచ్చిన ఉల్లి పంట అకాల వర్షాల వలన కర్నూలు జిల్లాలో నాశనం అయ్యింది. జిల్లా లోని ఓర్వకల్ మండలం, దొడ్డిపల్లి గ్రామ కౌలు రైతు కురవ స్వాములు రెండు ఎకరాలలో వేసిన పంట పూర్తిగా కుళ్లిపోయింది. “మేము తినడానికి ఒక్క గడ్డ కూడా మిగల్లేదు. ప్రతి ఎకరాకు గుత్త 16,000 రూపాయలు, 50,000 రూపాయల పెట్టుబడి మొత్తం 1,32,000 రూపాయలు నష్ట పోయాను. అధికారులు వివరాలు తీసుకున్నారు. నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో తెలీదు,” అన్నారు. 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి పండించి రు. 2.5 లక్షలు నష్టపోయిన ఇదే గ్రామ రైతు బోయ నాగస్వామి. ప్రకటించిన 20,000 రూపాయల నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారా అని ఆయన ఎదురుచూస్తున్నారు.
ఈ సంవత్సరం అయినా మామిడి పంటకు సరైన ధర వస్తుంది అప్పులనుండి కోలుకుంటామని ఆశిస్తే మళ్ళీ నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోందని చిత్తూరు జిల్లా సదుం మండలం, పుట్టావారిపల్లెకు చెందిన ఆర్. ఓబులేశ్వర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. “మామిడి పంట పూత వచ్చే దశలో దిత్వా తుఫాను వలన వర్షాలు పడ్డాయి. ఇప్పుడు చెట్టు ఎండితే పూత బాగా వచ్చి మంచి పంట వస్తుంది. హర్టీకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షాలు తగ్గేవరకూ చెట్లకు మందులు కొట్టద్దు అని చెప్తున్నారు. ఈ సారి ఎక్కువ పెట్టుబడి పెట్టాలా వద్దా, పంట వచ్చిన కాడికి చాలు అనుకుందామా అనే ఆలోచనలో ఉన్నాను,” అన్నారు.
పీలేరు మండలం, ఆగ్రహం గ్రామం, ఎనుములవారిపల్లె రైతు, అఖిల్ మూడు ఎకరాలలో వంకాయ, దోసా, అలసందలు, ఖర్బూజా వేశారు కానీ దేనికి రేటు రాలేదు. “మూడు ఎకరాలలో దోస పెట్టాను. 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. పంటకు కిలోకు 7 లేదా 8 రూపాయలు మాత్రమే వచ్చింది. చివరి దశలో మాత్రమే పదికి అమ్మింది. దాంతో నష్టం రాకుండా బయటపడ్డాను. పెట్టుబడి బాగా ఉండి నష్టాలను తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ భూమి లీజు కు తీసుకుని టొమాటో, దోస, కర్బూజ, వంకాయలు పండిస్తున్నారు. అలాంటి వాళ్ళ వలన కొన్ని పంటలు అధిక ఉత్పత్తి అవుతున్నాయి. పోతే రు. 20 లక్షలు వస్తే రు. కోటి అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం,” అని అన్నారు.
అధికారుల వివరణ:
అనంతపురం జిల్లా లో అరటి పంట సాధారణ విస్తీర్ణం 14,800 ఎకరాలు లేదా 19,700 ఎకరాల మధ్యన ఉండేది. అది ఈ ఏడు 37,000 ఎకరాలకు పెరిగింది. ఉత్తర భారత దేశం లోనూ పంట విస్తీర్ణం పెరిగింది. ఇటీవలి కాలం లో మంచి రేట్లు రావటం తో రైతులు ఎక్కువ మంది అరటి వైపు మళ్లారు. జిల్లా లో 30 నుండి 40 శాతం పెరిగింది. ఉత్తర భారత దేశ మార్కెట్లకు మనకంటే మహారాష్ట్ర దగ్గర, రవాణా ఛార్జీలు తక్కువ కాబట్టి మన పంటకు ప్రస్తుతం డిమాండ్ లేదు. ఎగుమతిదారులు ఆ రాష్ట్రంలోని ముంబై లో పోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుండే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు, అని అనంతపురం జిల్లా, హర్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ డి. ఉమా దేవి వివరించారు.
ఇప్పుడు వచ్చిన అరటి పంట మొదటి పంట కాదు, రెండవ కొయ్య. పోయిన ఏడు మొక్కకు పిలకలు మొలవటం వలన వచ్చిన పంట. మొదటి పంట కాలం 12 నెలలు. జనవరి లో నాటితే పంట ఫిబ్రవరి, మార్చికి గాని రాదు. మహారాష్ట్రలో చలి పెరిగితే డిసెంబర్ 15 తరువాత అక్కడ పంట పాడవుతుంది. కాయ కోసం వ్యాపారస్తులు అప్పుడు మన దగ్గరికి వస్తారు మన పంటకు మంచి ధర వస్తుంది అని పేరు చెప్పటానికి ఇష్టపడని మరో అధికారి అన్నారు.
ఇటీవల మామిడి గుజ్జు కు డిమాండ్ పడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి మన చేతిలో లేవు. రెడ్ సీ మార్గాన్ని హౌతి తిరుగుబాటుదారుల వలన ఉపయోగించుకోలేక పోవడం తో పోయిన సంవత్సరం 1.5 లక్షల గుజ్జు నిల్వ ఉండిపోయింది. దానికి తోడు సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమ జ్యూస్ పైన జీఎస్టీ తగ్గించుకోవటానికి ఫ్రూట్ శాతం తగ్గించాయి. దీనితో వాళ్ళ వాడకం మూడు లక్షల టన్నుల నుండి 1.5 లక్షల టన్నులకు పడిపోయింది. పండ్లకు లీగల్ గా మద్దతు ధర లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుండి కిలో రు. 12 కు ఫ్యాక్టరీలు కోనాలని వాళ్ళకు సలహా యిచ్చాము. అందులో నాలుగు రూపాయలు ప్రభుత్వం భరించటానికి ముందుకు వచ్చింది. రైతులకు ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని తెలిసే పంటలు వేస్తారు. పచ్చి సరుకు అయితే నిల్వ ఉంచడం కుదరదు. దేశం లో ఉల్లి పంట లో మన రాష్ట్రం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కేంద్రం ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వకపోవటం తో సమస్య వచ్చింది, అని రాష్ట్ర హర్టీకల్చర్ జాయింట్ డైరెక్టర్, ఎమ్. జి. ముని రెడ్డి అన్నారు.
నాణ్యత ఉన్న అరటి కి డిమాండ్ ఉందని వైఎస్ఆర్ హర్టీకల్చర్ విశ్వవిద్యాలయం లో సీనియర్ సైంటిస్టు డి. శ్రీనివాస రెడ్డి అన్నారు. సాధారణంగా ఎగుమతి దారులు పంట నాణ్యత కాపాడటానికి సస్యరక్షణ చర్యలు చేపడతారు. డిమాండ్ లేకపోవటం తో రైతులు ఆ పనులు చేయటం లేదు. ఈ సమస్యకు మూల కారణం మనకు పంటల ప్రణాళికా లేకపోవటమే. యితర రాష్ట్రాలలో ఏ పంటలు ఎంత వేస్తున్నారు అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ లేదు. అరటి ఈ ఏడు అనంతపురం జిల్లాలోనే 7,000 ఎకరాలు పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ ల లో పంట ఎప్పుడు వస్తుంది అనే స్టడీ చేసి మన రైతులకు పంట వేయటం లో తగిన సూచనలు చేయాలి. ఢిల్లీ లోని ఆజాద్‌పూర్ మార్కెట్ లో ఏ రాష్ట్రం నుండి ఏ పంటలు వస్తున్నాయి అనే వివరాలు తీసుకుని మన పంటలు వేయాలి. అందుకు మన రాష్ట్రానికి ఒక ప్రణాళిక వుండాలి, అన్నారు.
“కేవలం వరి, గోధుమ, చెరకు పంటలకు మాత్రమే గిట్టుబాటు ధరలు ఇచ్చినంత వరకు మనకు అవసరం అయిన పంటలు రైతులు పండించరు. పప్పు దినుసులు, నూనె గింజలకు మద్దతు ధర ఎందుకు ఇవ్వకూడదు. వర్షాలు రానప్పుడు పంట నష్టపోయిన రైతులకు ఇన్షూరెన్స్ లేదు,” అని ఈ పరిస్థితి మారకుండా సమస్య పరిష్కారం కాదు అన్నారు.
అధికారులు మాత్రం 2020 లో కరొన సమయం లో పడిపోతున్న ధరలను నిలబెట్టటానికి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం మద్దతు ధరలను సూచిస్తూ జారీ చేసిన జీవోలనే ఇప్పటికీ చూపుతున్నారు. కనీసం వాటిని ఇప్పటి ధరలకు అనుగుణంగా మార్చలేదు. జీవోలు రైతులకు కనీస ధర డిమాండ్ చేసే హక్కును కల్పించవని పేరు చెప్పటానికి ఇష్టపడని మరో అధికారి అన్నారు. అసెంబ్లీ లో లేదా పార్లమెంటు లో చేసిన చట్టం మాత్రమే రైతులకు మద్దతు ధర హక్కును కల్పిస్తుందని అన్నారు.
మార్కెట్ ధరలు ప్రకటించిన ధరకంటే తగ్గితే ప్రభుత్వం తన స్వంత నిధులు ఖర్చు చేసి ఆదుకుంటుందని జీవోలలో ఉంది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అవి కాగితాలకే పరిమితం అయ్యాయి.
రైతు నాయకులు, ప్రతిపక్షాల విమర్శ:
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుడు సాకే శైలజానాథ్ అనంతపురం కలెక్టర్ ఆఫీసు ముందు రైతులకు మద్దతుగా ధర్నా చేశారు. వాళ్ళు కిలో రెండు రూపాయలకు అమ్ముకుంటుంటే పది రూపాయలకు కొంటామని కేవలం మాటలకే పరిమితం అవుతూందని ఆరోపించారు. “ప్రభుత్వం కొని కనీసం హాస్టల్ పిల్లకు ఇస్తే తింటారు కదా. తమ వాళ్ళకు భూములు పంచటం ప్రజలచేత సూర్య నమస్కారాలు చేయించటం తప్ప చేసిందేమీ లేదు. వ్యవసాయం దండగ అని నమ్మే ప్రభుత్వం ఇది. 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అందులో 10,000 కోట్లు అయిన రైతులకోసం ఖర్చు చేయలేదు. 200 నుండి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతులను ఆదుకోవచ్చు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్లనే పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదు. మహారాష్ట్ర లో అరటి పంట పెరగటం వలన మన పంటకు ఢిల్లీ లో డిమాండ్ తగ్గిందని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేసి అక్కడికి కాయలను పంపవచ్చు కదా,” అని ఆ సందర్భంగా నిలదీశారు.
‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో మాట్లాడుతూ పంట విస్తీర్ణం పెరగటం వల్లనే ధర రాలేదు అనటం కేవలం సాకు మాత్రమే. అధికారులు నివేదికలు పంపాము అంటున్నారు కానీ ఎటువంటి చర్యలు ఇంత వరకు చేపట్టింది లేదు. ముఖ్యమంత్రి ఆర్భాట ప్రకటనలు చేస్తుండగా, ప్రశ్నించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనం వీడటం లేదు, అన్నారు.
రాష్ట్రం లో ధరల స్థిరీకరణ నిధి లేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention) కాదు కదా కనీసం పంటల భీమా(Crop insurance) కూడా లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్కెట్ శక్తులకు వదిలేశారని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం, జనరల్ సెక్రెటరీ, కె. ప్రభాకర్ రెడ్డి, అని ఆరోపించారు.
రాష్ట్రం లో ఒక్క పంటకు కూడా సరైన ధర రాలేదని ఆయన అన్నారు.
“అరటి పంట పోయిన సంవత్సరం క్వింటాల్ రూపాయల నుండి 25,000 రూపాయల ధర పలికింది. ఈ ఏడు 2,000 రూపాయలకు పడిపోయింది. ట్రాక్టర్ లు పెట్టి రైతులు పంటను దున్నేస్తున్నారు. రాష్ట్రం లో పత్తి 12 లక్షల ఎకరాలలో పండుతుంది, అందులో సగం కర్నూలు జిల్లాలోనే వేస్తారు. ఇక్కడ మే చివరి నాటికి విత్తనం వేస్తారు కాబట్టి సెప్టెంబర్ 1 కే పంట వస్తుంది. అయితే నవంబర్ వరకు సిసిఐ కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. పత్తి క్వింటాల్ మద్దతు ధర 8,110 రూపాయలు అయితే 7,500 నుండి 7,600 కు అమ్ముకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టంతో పాటు మిల్లుల దోపిడి కూడా సాగింది. రైతు ఇంట్లో 25 క్వింటాల్ తూకం వున్న పత్తి మిల్లులో 23 మాత్రమే తూగింది. తూకంలో మోసాన్ని మేము బయటపెట్టేనాటికి వాళ్ళు వందల క్వింటాల్ ల పత్తిని దోపిడీ చేశారు. అయినా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు,” అని ఆయన వాపోయారు.
రాయలసీమ ను ఉద్యాన పంటలకు కేంద్రం లేదా హబ్ గా చేస్తామనటం కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే అంటూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని ఆయన ఆరోపించారుప
“ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమను ప్రపంచంలోనే ఉద్యాన పంటల కేంద్రం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఉద్యాన పంటలను 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. రాయలసీమ ప్రకాశం జిల్లాల రైతులు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను అంది పుచ్చుకుంటారు,” అన్నారు.
పంటల ధరలను మార్కెట్ శక్తులకు వదిలేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం పై వ్యవసాయ రంగ నిపుణుడు దేవీందర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.
“ప్రతి ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన వస్తువు ధరను నిర్ణయిస్తాడు మరి రైతు పండించిన పంటను మాత్రం ఎందుకు మినహాయిస్తున్నారని . ప్రతి పంటకు మద్ధతు ధర ఉండాలి. కూరగాయలు పళ్ళతో సహ. కేరళ రాష్ట్రం 16 పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. కనీస మద్దతు ధర కల్పించడమే పడిపోతున్న ధరలకు సరైన పరిష్కారం,” అని శర్మ అన్నారు.
డిమాండ్ సప్లయ్ వల్లనే ధరలు నిర్ణయమవుతున్నాయని చెప్పే అర్థ శాస్త్రవేత్తల, అధికారుల జీతాలను కూడా ఒక సంవత్సరం మార్కెట్ కు ముడిపెడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ ఉద్యోగస్థులు పాత పెన్షన్ పథకాన్ని ఎందుకు కోరుకుంటున్నారు, కొత్త పెన్షన్ విధానంలో వాళ్ళకు తగిన జీతం రావటం లేదనే కద, రైతుల విషయం లోనే ఈ నిర్లక్ష్యం ఎందుకు, అని శర్మ ప్రశ్నించారు.
“పంటలకు గిట్టుబాటు ధర వస్తే రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తయారైన వస్తువులకు దేశం లో డిమాండ్ పెరుగుతుంది. వరి పండించే రైతు ఇతర పండ్లు కూరగాయలు విరివిగా కొనుక్కుని తినగలుగుతాడు. మనం పండించిన తయారు చేసిన వస్తువులు మనం వినియోగించగలగాలి, అప్పుడు మనం యితర దేశాల మార్కెట్ల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటాము,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిస్థితి ఇలా ఉంటే సిఎం చంద్రబాబు నాయుడు వరి సాగు వద్దరని, దాని వల్ల రోగాలు వస్తున్నాయని, ఆ పంట స్థానం లో ఉద్యాన పంటలు సాగు చేయాలని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల లో బుధవారం నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమం లో సూచించడం కొసమెరుపు.