జగన్‌పై జనసేన శ్రేణులు ఫిర్యాదు

పవన్‌ కల్యాణ్‌ మీద జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు.;

By :  Admin
Update: 2025-03-06 13:40 GMT

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు భగ్గు మన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు రోడ్లెక్కాయి. జగన్‌మోహన్‌రెడ్డి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఏలూరు పోలీసు స్టేషనల్‌లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు జగన్‌ మీద కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మీద మాట్లాడారు. అప్పులు మీద కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని వెల్లడించారు. బడ్జెట్‌ కేటాయింపులు, సంక్షేమ పథకాలు, సూపర్‌ సిక్స్‌ వంటి అంశాల మీద మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిందని ∙కూటమి ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్‌ జర్మనీకి వెళ్లాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని, దీనిపై ఏమంటారని మీడియా అడిగిన ప్రశ్నకు జగన్‌ సమాధానం చెబుతూ.. కార్పొరేటర్‌కు తక్కువ.. ఎమ్మెల్యేకు ఎక్కువ.. జీవితంలో ఒక సారి ఎమ్మెల్యే అయ్యారు అంటూ పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.
జగన్‌ బుధవారం చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో చిచ్చు రేపాయి. దీంతో రోడ్లపైకొచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఎంపీడీవో కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న జనసేన శ్రేణులు పవన్‌ కల్యాణ్‌ మీద జగన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు పెద్ద ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈడీకి తక్కువ.. సీబీఐకి ఎక్కువ’. కోడికత్తికి తక్కువ.. గొడ్డలికి ఎక్కువ’. ‘అర డజన్‌కు ఎక్కువ.. డజనుకు తక్కువ’. అంటూ జగన్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. పవన్‌ కల్యాణ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడూతూ.. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మీద చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా జగన్‌ తన పద్ధతిని మార్చుకోవాలి. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదు. పవన్‌ కల్యాణ్‌ ఏ స్థాయిలో అసెంబ్లీలో కూర్చోబెట్టారో జగన్‌ గుర్తుంచుకోవాలి. తండ్రి చావును, బాబాయి హత్యను అడ్డం పెట్టుకొని సీఎం అయ్యావు. అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News