ఏపీ అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్

వైసీపీ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2025 సమావేశాలు ప్రారంభం అయ్యాయి.;

Update: 2025-02-24 05:04 GMT
వైసీపీ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2025 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 24న సరిగ్గా ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోకి ప్రవేశించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించాలని నినదించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను ప్రస్తావించాలంటే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని నినదించారు. అసెంబ్లీ సమావేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ నాయకుడు జగన్ పక్కన శాసనమండలిలో వైసీపీ నేత బొత్ససత్యనారాయణ, ఆయన పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చొన్నారు.
గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున ఆటంకం సృష్టించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నిలబడి నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల నడుమ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు 11 నిమిషాల పాటు వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన తర్వాత వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వైసీపీ నేత జగన్ నాయకత్వంలో సభ్యులందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
బొత్స సత్యనారాయణ ధ్వజం...
రైతు సమస్యలపై గొంతు విప్పుతామన్నారు. ప్రభుత్వ స్పందన చూసి మా చర్య ఉంటుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఉన్నది రెండే పక్షాలని, అందులో ఒకటి అధికార పక్షం, మేము ప్రతిపక్షం, అందువల్ల వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో టీవీ చానల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించిందని విమర్శించారు.
Tags:    

Similar News