‘కేసులకు భయపడొద్దు.. ప్రలోభాలకు లొంగొద్దు’.. ఎమ్మెల్సీలకు జగన్ సూచన
పార్టీ ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. దిశానిర్దేశం చేశారు. కేసులకు భయపడొద్దని, ప్రలోభాలకు లొంగొద్దని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈరోజు పార్టీ ఎమ్మెల్సీలతో తొలిసారి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలకు ధైర్యం చెప్పారు. దిశానిర్దోశం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, ధైర్యంగా పోరాడాలని, అడుగడుగునా వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. పార్టీ కోసం పనిచేసిన ఎవరినీ పార్టీ వదులుకోదని, వారు ఏ కష్టంలో ఉన్నా అండగా నిలుస్తుందని, వారి కోసం ఎంత దూరం వెళ్లడానికైనా వైసీపీ సిద్ధంగా ఉందని, ఉంటుందని చెప్పుకొచ్చారు. శాసనసభలో బలం లేకపోయినప్పటికీ శాసనమండలిలో వైసీపీ అంటే ప్రజల కోసం పోరాడే శక్తి అని నిరూపించాలని జగన్.. తమ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు.
భయపడొద్దు
‘‘ఎన్నికల్లో మనం సీట్ల సంఖ్య పరంగా ఓడిపోయాము. కానీ మన ఓటింగ్ శాతం 40కిపైనే ఉంది. అంటే రాష్ట్రంలోని 40 ప్రజలు మనతోనే ఉన్నారు. కాబట్టి మన భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మన పక్షాన ఉన్నారు. ఎమ్మెల్సీలు ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు. కేసులు పెట్టినా భయపడొద్దు. న్యాయపోరాటంలో వైసీపీ మీకు అండగా నిలుస్తుంది. మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయి. అందుకు మనకు లభించిన ఓటింగ్ శాతమే నిదర్శనం. 2024 ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయి. ప్రజల తీర్పు ఎలా ఉన్నా.. ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయి’’ అని ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి’’ అని జగన్.. ఎమ్మెల్సీల్లో ధైర్యం నింపారు.
ఈవీఎంలపై చర్చ అవసరం
అంతేకాకుండా ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు ట్యాపరింగ్‌కు గురయ్యుండొచ్చని కూడా ఆరోపించారు. ‘‘ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. వాటి పనితీరు, వినియోగం, ఎన్నికల ఫలితాలపై వాటి ప్రభావం వంటి అనేక అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూల్ నడుస్తోంది. వారికి మరికొంత సమయం ఇద్దాం. సెలబ్రేట్ చేసుకోనివ్వండి. ఆ తర్వాత మన పోరాటం ప్రారంభిద్దాం. అసెంబ్లీలో వైసీపీ నేతల నోరు కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శాసనమండలిలో గట్టిగా పోరాడదాం’’ అని ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు.
జగన్ మాస్టర్ ప్లాన్ అదేనా..
అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు కావడంతో అసెంబ్లీలో అధికార పార్టీ ప్రవేశపెట్టే బిల్లు ఆమోదాన్ని అడ్డుకోవడం వైసీపీకి అసాధ్యం. ఈ పరిస్థితుల్లోనే అధికార పక్షాన్ని అడ్డుకోవడానికి శాసనమండలిని వైసీపీ తమ ఆయుధంగా మార్చుకోనుంది. అధికార పార్టీ ప్రవశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే శాసనమండలిలో తగినంత బలం ఉండాలి. దానినే జగన్ తనకు అనుకూలంగా మార్చుకోనున్నారు. టీడీపీ కూటమి ప్రవేశపెట్టే బిల్లులను శాసనమండలిలో ప్రశ్నించడంతో పాటు వైసీపీ తీసుకొచ్చిన కొన్ని పథకాలను రద్దు చేయాలన్న అధికార పక్షం ఆలోచనను కూడా అడ్డుకోవాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ మేరకు దిశానిర్దేశం చేయడానికే ఆయన ఈరోజు ఎమ్మెల్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు వివరించారు. అంతేకాకుండా అధికార పక్షాన్ని శాసనమండలిలో సమర్థవంతంగా ఎలా అడ్డుకోవాలి, ఢీకొట్టాలి అన్న విషయాలను వారికి వివరించారు.
మరోసారి ఓదార్పు యాత్ర
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మరోసారి ఓదార్పు యాత్ర తరహా యాత్రను చేపట్టడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ యాత్ర గురించి పార్టీ శ్రేణులతో చర్చించి రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ యాత్రలో టీడీపీ నేతలు, శ్రేణుల దాడులకు గురైన బాధితులకు పరామర్శించనున్నట్లు జగన్ ఈరోజు సమావేశంలో స్పష్టం చేశారు. ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు జగన్ వెల్లడించారు.
సమావేశాలకు జగన్ డుమ్మానా!
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయిన వైసీపీ.. ఈ సమావేశాలకు హాజరవుతుందా? ముఖ్యంగా అసలు జగన్.. అసెంబ్లీ గేటు దాటతారా? అన్న సందేహాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా జగన్ ప్లాన్స్ చూస్తుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలని ఫిక్స్ అయ్యారనే అనిపిస్తోంది. సమావేశాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన సరికొత్త యాత్రకు తెరలేపబోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ జగన్ చేపట్టే యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది? వంటి కీలక సమాచారం ఇంకా వెల్లడించలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత జగన్ తన యాత్రను ప్రారంభిస్తారన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే అసెంబ్లీ సమావేశాలు లేదా జగన్ యాత్ర ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.