బాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలి.. డిమాండ్ చేసిన జగన్

ఏపీలో అరాచక పాలన సాగుతుందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్‌లను రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యల కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలని కోరారు.

Update: 2024-08-09 10:49 GMT

‘సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లను రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలకు బాధ్యులుగా భావించాలి. ఈ కేసుల్లో ముద్దాయిలుగా చేర్యాలి. ఆధిపత్యం కోసమే వారు ఈ దాడులకు తెగబడుతున్నారు’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు నంద్యాలలో చేసిన వ్యాఖ్యలివి. నంద్యాల జిల్లా సీతారామపురంలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డారంటున్న వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు, ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వారికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారం, ఆధిపత్యం కోసమే వాళ్లు రాష్ట్రమంతటా భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. హత్యలు, దాడులకు పాల్పడుతూ ప్రజల నోళ్లు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది నాశనం అయిందని, శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతా రెడ్ బుక్ పాలనే..

రాష్ట్రంలో కూటమి పాలన సాగట్లేదని, అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పాలనను తానెన్నడూ, ఎక్కడా చూడలేదని చురకలంటించారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో మారణహోమం రగులుకుంది. రాజకీయ లబ్ది, ప్రతీకారం కోసం హత్యలు, దాడులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోబడిన కూటమి సర్కార్.. పాలన మాత్రం రెడ్ బుక్ ప్రకారం చేస్తోంది. ఇదంతా అరాచక పాలన. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లలోనే ఊళ్లో సైతం వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అధికారులను కూడా భయంతో పాలించాలని ప్రయత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత.

నిందితులను ఎందుకు వదిలేశారు!

‘‘కేవలం పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నందుకు పెద్దసుబ్బారయుడిని చంపేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ హత్య జరిగింది. సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి జరిగింది. ఎదుటే నిందితులు ఉన్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఎందుకు వారిని పట్టుకోలేదు? నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు ఇలా చేశారు. ఇందుకు పోలీసులు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

‘ఎస్ఐ సమక్షంలోనే హత్య’

‘‘సుబ్బారాయుడిని హత్య చేసిందెవరు? చేయించిందెవరు? ప్రతిచోటా ఇలానే జరుగుతోంది. నిందితుల కాల్ డేటా చెక్ చేస్తే అసలు విషయం తేటతెల్లం అవుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా కటకటాల వెనక్కి పంపొచ్చు. హత్య జరిగిన తర్వాత కూడా గ్రామానికి అదనపు సిబ్బందిని ఎందుకు పంపలేదు? హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు. తుపాకులు, కత్తులు, రాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులన్నీ కూడా చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతోనే జరుగుతున్నాయి. సుబ్బారాయుడిని కూడా బాబు, లోకేష్ అండదండలతో ఎస్‌ఐ సమక్షంలోనే హతమార్చారు. టీడీపీ నేతలు మీటింగ్‌లు పెట్టి మరీ ఎవరెవరిని చంపాలో చెప్తున్నారు. ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలి’’ అని కోరారు జగన్.

చంద్రబాబుకు ఆ ఆలోచనే లేదు..

ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనే చంద్రబాబుకు లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఆఖరికి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని చంద్రబాబు ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. అలవిమాలిన హామీలతో అక్కాచెల్లెమ్మలను మోసం చేశారని, ఆఖరికి విద్యార్థులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తానన్నారు. ఆ రూ.15 వేలు ఏమయ్యాయో తెలియదు. తల్లికి వందనం అంటూ తల్లికి, పిల్లలకు పంగనామం పెట్టారు. ఉచిత సిలెండర్ అని చెప్పి.. అది కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.. ఎప్పుడు చూసినా అదిగో ఇదిగో అని కాలం వెల్లదీస్తున్నారు. ఆఖరికి అన్నం పట్టే రైతన్నలను కూడా ఖాతాల్లో రూ.20 వేలు వేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు’’ అని ధ్వజమెత్తారు జగన్.

Tags:    

Similar News