జగన్ పై తొడగొట్టిన చంద్రబాబు!
నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా! జగన్ కి నేరుగా సవాల్ విసిరిన చంద్రబాబు;
By : The Federal
Update: 2025-09-02 01:30 GMT
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ఇప్పటి వరకు విమర్శ చేసేటపుడు ఎన్నడూ జగన్ పేరు చెప్పని చంద్రబాబు ఈసారి నేరుగా ఆయన పేరుపెట్టే సవాల్ చేశారు. అదీ కూడా జగన్ సొంతగడ్డ పై నుంచి సవాల్ చేయడం గమనార్హం.
త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో చంద్రబాబు సవాల్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ చెప్తున్నారు. ఈ వ్యవహారమై వైసీపీ కోర్టుకు కూడా వెళ్లారు. అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఆ తర్వాత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు మాత్రమే అసెంబ్లీకి వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన సవాల్ ఇలా..
‘నాడు సిద్ధం.. సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు కదా! అబద్ధపు ప్రచారాలపై వైసీపీకి సవాల్ విసురుతున్నా.. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా అన్నింటిపైనా చర్చిద్దాం. అందుకు నేను సిద్ధం.. మరి మీరు సిద్ధమా?’.. అని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలో సోమవారం సీఎం పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘ఎవరిది సంక్షోభ పాలనో.. ఎవరిది అభివృద్ధి పాలనో శాసనసభ సాక్షిగా తేల్చేద్దాం. సూపర్ సిక్స్ పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు చర్చిద్దాం. రాష్ట్రంలో పెట్టుబడుల నుంచి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల వరకు, వివేకా హత్య నుంచి దళిత డ్రైవర్ మృతదేహం డోర్ డెలివరీ వరకు మాట్లాడదాం. కోడి కత్తి డ్రామా నుంచి.. గులకరాయి నాటకాల వరకు అన్నింటిపైనా చర్చ చేపడదాం’ అని సవాల్ విసిరారు. ‘నాకు మీలా (జగన్) డ్రామాలు ఆడటం తెలియదు. సభకు రాకుండా సొంత మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం కాదు. అవినీతి డబ్బుతో స్థాపించిన పత్రిక, ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు.
మీదో అబద్ధాల ఫ్యాక్టరీ...
‘వైసీపీ ఓ అబద్ధాల పార్టీ. అధికారంలో ఉండగా దొంగ పింఛన్లు ఇచ్చింది. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికి కూడా దివ్యాంగులంటూ తమ అనుకూలురకు ప్రయోజనం చేకూర్చుకుంది. అర్హులకు మాత్రం మొండిచేయి చూపింది. మేం అర్హులకు పింఛన్ ఇస్తూ న్యాయం చేస్తున్నాం. అనర్హులకు ఇవ్వరాదని చెప్పే ధైర్యం ప్రజల్లో రావాలి. ఇటీవల ఒకతను చెయ్యి బాగున్నా.. లేదని చూపుతూ సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేశాడు. అలాంటి బోగస్‌ల పింఛన్లు తీసేయాల్సిందే’ అన్నారు ముఖ్యమంత్రి.
సింగయ్యను ఎవరు తొక్కించి చంపిందెవరు?
పల్నాడు జిల్లాలో వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారు. తిరిగి మాపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌లో చనిపోయాడంటూ అతడి భార్యతోనే అబద్ధాలు చెప్పించారు. మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారు. ఆడబిడ్డలపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మహిళలను ఏడిపించిన వారిని చట్టం ఎదుట నిలబెడతాం’ అని చంద్రబాబు అన్నారు.
గెలుపోటములకు వెరవను..
‘సరిగ్గా 30 ఏళ్ల కింద ఇదేరోజున (సెప్టెంబర్ 1) నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. అయినా వెనకడుగు వేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పని చేశా. సంపద సృష్టించి.. ప్రజలకు పంచి పెట్టాలనే లక్ష్యం కోసం తపిస్తూనే ఉంటా. ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితంలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదు. నిత్యం ఉదయం ఇంట్లో పూజ చేస్తూ మంచి చేసి స్వర్గానికి వెళ్లాలని ప్రార్థిస్తా. నరకానికి వెళ్లేలా తప్పుడు పనులు చేయను.
2014-19 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. 2019 నుంచి వైసీపీ విధ్వంసం చేసింది. ఎమ్మెల్యేలు తప్పు చేసినా.. మంత్రులు సరిగా పని చేయకున్నా నిలదీయవచ్చు’ అని చంద్రబాబు చెప్పారు.