శ్రీవారి సొత్తూ వైసిపి గజదొంగలు దోచుకున్నారు..
జగన్ గ్యాంగ్ పాపాలు పండినాయి సామీ.. మంత్రి నారా లోకేష్
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-20 13:49 GMT
అవినీతి అక్రమాల్లో మునిగి తేలిన వైసీసీ పాపాలు పండాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. చివరికి శ్రీవేంకటేశ్వరస్వామి హుండీకి కూడా కన్నం వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, వీడియోలు కూడా బయటపడ్డాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నిందితులే రేపు చిట్టా విప్పబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం టీటీడీలో చర్చ జరుగుతోంది.
"ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు" అని స్పష్టం చేశారు.
వైసీపీ చీఫ్ జగన్ గ్యాంగ్ పాపం పండిందని మంత్రి నారా లోకేష్ చురకలు వేశారు. ఆయన ఏమన్నారంటే..
"జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేశారు జగన్. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు" అని మంత్రి లోకేష్ ఆరోపించారు.
"తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో వాటాలు తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారు" అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు టీటీడీ ఉద్యోగి రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎన్నో అపరాచారాలు
తిరుమల శ్రీవారి సన్నిధిలో అధికారం అండతో జగన్ గ్యాంగ్ చేయని అపచారం లేదని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు.
"భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కష్టంగా మార్చారు" అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు" అని నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు బతిమాలిన చెప్పినా వినలేదు" అని గుర్తు చేసిన మంత్రి నారా లోకేష్ వైసీపీ గ్యాంగ్ కు శిక్ష తప్పదని హెచ్చరిక చేశారు.