ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్‌

తనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను పునరుద్దరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.;

Update: 2025-05-09 05:23 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని పునరుద్దరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. తనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను పునరుద్దరించాలనే అంశంపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాను. కానీ తన వినతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేంద్ర సంస్థలైన సీఆర్‌పీఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌జీలతో కూడిన భద్రత కల్పించకపోవడం అనేది రాజ్యాంగ విరుద్దం. తనకు ప్రాణహాని ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకొని నిర్థిష్ట ప్రొటోకాల్‌కు అనుగుణంగా తనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ పునరుద్దరించాలని కోర్టును కోరారు. వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద సెక్యూరిటీ, వర్కింగ్‌ కండిషన్‌లోని బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం సమకూర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నోటీసులు లేకుండానే, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భద్రతను భారీగా కుదించేశారు. తనకు ఉన్న ప్రాణహానిని కూడా కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అధికారంలో ఉన్న కూటమి వర్గాలే తనపై భౌతికంగా దాడులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం తనకు భద్రత కల్పిస్తున్న క్యాట్‌ బృందాలతో కానీ, పూర్తి స్థాయిలో పని చేయని బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంతో కానీ భద్రత లేదని, గతంలో తనకున్న జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను తిరిగి పునరుద్దరించాలని కోరారు. వైసీపీకి చెందిన సీనియర్‌ నాయకులు, ఎంపీల భద్రతల విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తన భద్రత కుదింపుపై ఇది వరకే హైకోర్టును ఆశ్రయించాను. అయితే ఆ పిటీషన్‌ నేటికీ పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల రీత్యా తనకు తిరిగి జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Tags:    

Similar News