రేవంత్ కు సోషల్ ఇంజనీరింగ్ అంత ఈజీకాదా ?
పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే సోషల్ ఇంజనీరింగే మంత్రివర్గ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా తెలుస్తోంది;
చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగులో ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినపుడల్లా అదిగో అనుమతి వచ్చేసింది..ఇదిగో అనుమతి వచ్చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది. అంతేకాకుండా కొన్నిసార్లు మీడియా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా పెట్టేసింది. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదాపడుతునే ఉంది. ఒకసారి సమీకరణలు కుదరలేదని, మరోసారి కులగణన సర్వే అని, మరోసారి స్ధానికసంస్ధల ఎన్నికలైపోయాకని, చివరగా ఎంఎల్సీ ఎన్నికలు అయిపోయాకని ఏవేవో కారణాలు అడ్డువస్తున్నాయి. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే సోషల్ ఇంజనీరింగే మంత్రివర్గ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా తెలుస్తోంది. సోషల్ ఇంజనీరింగ్(Social Engineering) అంటే ఏమీలేదు ఏసామాజికవర్గానికి ఎన్నిమంత్రిపదవులు ఇవ్వాలి ? ఏసామాజికవర్గాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న లెక్కలే.
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రస్తుత రాజకీయాలను శాసిస్తున్నది కులాలే అన్నది నూరుశాతం వాస్తవం. ఈకులాలకే షుగర్ కోటింగులాగ సామాజికవర్గాలని, సామాజికసమీకరణలనే పర్యాయపదాలను ఉపయోగిస్తున్నారంతే. విషయంఏమిటంటే రేవంత్(Revanth) తో కలిసి 18 మందికి మంత్రివర్గంలో చోటుంటుంది. ఇపుడు ఏడుస్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడుస్ధానాల్లో ఏ కులానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవాలన్న విషయంపైనే రేవంత్+అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. మంత్రిపదవులేమో పరిమితం. కాని ఆశిస్తున్న వాళ్ళ సంఖ్యేమో అపరిమితం. దాంతో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి ? ఎవరిని పక్కనపెట్టాలన్న విషయం పెద్ద తలనొప్పిగా తయారైంది.
ఎందుకంటే ఎవరిని తీసుకున్నా తలనొప్పే, ఎవరిని పక్కనపెట్టినా రేవంత్ కు తలనొప్పి తప్పదు. ఎలాగంటే పలానా సామాజికవర్గం ఎంఎల్ఏని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆఎంఎల్ఏని కాకుండా ఈ ఎంఎల్ఏనే ఎందుకు తీసుకున్నారనే గొడవ మొదలవుతుంది. ఇదేసమయంలో ఎవరిని పక్కనపెట్టినా అదో గొడవ మొదలవుతుంది. ఎందుకంటే పలానా ఎంఎల్ఏ ఇంతకాలంగా పార్టీకి సేవలందిస్తున్నా ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేదని రేవంత్ ను నిలదీయటం ఖాయం.
పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే ఎంఎల్సీ సీట్లకు నేతలను మరో మూడురోజుల్లో ఖరారు చేయబోతున్నారు. ఎంఎల్ఏల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు నాలుగు ఎంఎల్సీలు దక్కుతాయి. ఈ నాలుగింటిలో ఎవరిని తీసుకుంటారు అనేదానిమీద మంత్రివర్గ విస్తరణ ఆధారపడుంది. నాలుగు సీట్లలో ఒక ఓసీని, ఒక ఎంబీసీని, ఎస్సీల్లో ఒక మాల, మరోటి మాదిగలకు ఇవ్వాలని ఇప్పటికైతే అనుకుంటున్నట్లు సమాచారం. ఓసీల్లో కూడా ప్రభుత్వ సలహాదారు, రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు బాగా వినబడుతోంది. అలాగే తాజా మాజీ ఎంఎల్సీ టీ జీవన్ రెడ్డి(Taparti Jeevan Reddy) పేరు కూడా చక్కర్లు కొడుతోంది. మరో సలహాదారుడు హర్కార్ వేణుగోపాల్ తో పాటు కమ్మ సామాజికవర్గం నుండి జెట్టి కుసుమ్ కుమార్(Jetti Kusumkumar) పేరు ప్రచారంలో ఉంది. ఇక ఎస్సీల్లో మాదిగల నుండి ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎంఎల్ఏ సంపత్ కుమార్ తో పాటు దొమ్మాటి సాంబయ్య, రాచమళ్ళ సిద్ధేశ్వర్ పేర్లు వినబడుతున్నాయి. ఇక మాలల నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) పేరు బాగా వినబడుతోంది.
ఏ పార్టీలో అయినా డార్క్ హార్సెస్ అనే నేతలంటారు. డార్క్ హార్సెస్ అంటే అందరినీ ఆశ్చర్యపరిచే నేతలు. టికెట్ల విషయంలో కాని, మంత్రివర్గం విషయంలో కాని వీళ్ళపేర్లు ఎక్కడా ప్రచారంలో ఉండవు. కాని చివరినిముషంలో తెరపైకి వచ్చి టికెట్టు లేదా మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంటారు. ఇపుడు కాంగ్రెస్ లో కూడా ఇలాంటి డార్క్ హార్సెస్ ఎవరైనా ఉన్నారా అన్నది ఇప్పటికైతే తెలీదు. ఎంఎల్సీ పదవులు అందుకునే సామాజికవర్గాలకు బహుశా మంత్రివర్గంలో చోటుకల్పించకూడదని రేవంత్, అధిష్ఠానం నిర్ణయిస్తారా అనే అనుమానం పార్టీవర్గాల్లో బలంగా ఉంది. కొత్తగా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan) మాటకు అధిష్ఠానం బాగా విలువ ఇస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి ఎంఎల్సీల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణలో కూడా మీనాక్షి ముద్ర ఎలాగుంటుందో చూడాలి.