KCR and KTR|టెలిఫోన్ ట్యాపింగ్-ఫార్ములా కేసుల్లో తేడా ఇదేనా ?
ఫార్ములా కార్ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సూత్రదారుతో పాటు పాత్రదారులు కూడా హైదరాబాదులోనే ఉన్నారు.;
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు కేసుల విషయంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆ రెండు కేసులు ఏమిటంటే ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. రెండోది ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి. పై రెండు కేసుల్లోను ప్రభుత్వం గట్టిగా దృష్టిపెడితే బాధ్యులెవరు ? నిందితులు ఎవరన్న విషయం తేలిపోతుంది. అయితే మొదటి కేసువిచారణలో ప్రభుత్వానికి ఛాన్స్ మిస్సయ్యింది. అందుకనే రెండో కేసయిన ఫార్ములా విషయంలో పట్టుబిగిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు(Telephone Tapping Case) విచారణలో ఆరోపణలు ఎదుర్కొటున్న కీలకపాత్రదారి, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీచీఫ్ టీ ప్రభాకరరావు దేశం విడిచిపారిపోవటంతో కేసుదర్యాప్తు అడుగు ముందుకు పడటంలేదు. అందుకనే రెండోది అయిన ఫార్ములా కేసు(Formula E Car Race) విచారణలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్(Revanth) కూడా బాధితుడే. పీసీసీ అధ్యక్షుడిగా తన ఫోన్ను కేసీఆర్(KCR) ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని అప్పట్లో రేవంత్ చాలాసార్లు ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందుకనే అధికారంలోకి రాగానే ఈ కేసువిచారణ విషయంలో వెంటనే స్పందించారు. అయితే ప్రభుత్వంకన్నా ప్రభాకర్ రావు మరింత చురుగ్గా ఆలోచించారు. అందుకనే ట్యాపింగ్ కేసులో 2023, మార్చి 11న మొదటి అరెస్టు జరగ్గానే అప్రమత్తమై మార్చి 12వ తేదీన దేశంవిడిచి పారిపోయారు.
ట్యాపింగ్ అంశంలో ప్రభాకరరావు ఆదేశాలతో కీలకంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అరెస్టుచేసింది. విచారణలో తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రదీప్ రావు, భుజరంగరావు ట్యాపింగ్ లో ఎవరి పాత్ర ఎంత ? ఎన్ని మొబైల్స్ ట్యాపింగ్ చేశారు, ట్యాపింగ్ చేసిన పర్సస్ ఏమిటన్న వివరాలను పూసగుచ్చినట్లు వివరించేశారు. వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారమే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్ధులు, ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ లోని అనుమానిత నేతలు, ప్రత్యర్ధిపార్టీల్లోని నియోజకవర్గాలు, మండలస్ధాయి నేతలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలే కాకుండా చివరకు కొందరు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులు మొత్తం 4 వేల ఫోన్లను ట్యాప్ చేశారు.
ఇక్కడవరకు విచారణలో అధికారులు చెప్పింది క్లియర్ గా ఉంది. తమ చీఫ్ ఆదేశాల ప్రకారమే తాము వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు రాతమూలకంగా వాగ్మూలాలిచ్చారు. అందుకనే ప్రభాకరరావుమీద పోలీసులు కేసు నమోదుచేసింది. కిందస్ధాయి పోలీసు అధికారులకు మొబైల్ ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలిచ్చింది ప్రభాకరరావే అని స్పష్టమైంది. అయితే వేలాది ఫోన్లను ట్యాప్ చేయాలని ఎవరు ఆదేశిస్తే ప్రభాకరరావు తన కిందిస్ధాయి అధికారులను పురమాయించారు ? అన్న విషయమే ఇపుడు కీలకం. ఈ విషయం తేలాలంటే ప్రభాకరరావును విచారించాల్సిందే. విచారించేందుకు అవకాశంలేకుండా ప్రభాకరరావు పోయి అమెరికాలో కూర్చున్నారు. విచారణకు హాజరైతే ఏమిజరుగుతుందో మాజీచీఫ్ కు బాగా తెలుసు. అందుకనే ఇండియాకు రమ్మంటే రావటంలేదు.
ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావటంలేదు. ఈకేసు విషయంలో మంత్రులు చాలామంది కేసీఆర్ మీద ఆరోపణలు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ కు సూత్రదారి కేసీఆర్ ను వెంటనే అరెస్టు చేయాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అనుమానాలతో కేసుపెట్టి ఎవరినీ అరెస్టుచేయటం సాధ్యంకాదు. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముందుకు సాగటంలేదు.
ఫార్ములాలో ఏమి జరుగుతోంది ?
ఇక, ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి విచారణను గమనిస్తే ఈ కేసులో సూత్రదారి కేటీఆర్(KTR). పాత్రదారులు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ(HMDA)లో చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఫార్ములా కార్ రేసులను నిర్వహించాలని నిర్ణయించారు. ఆనిర్ణయమే అవినీతికి దారులువేసింది. బ్రిటన్లోని కార్లరేసు నిర్వహణ కంపెనీ ఎఫ్ఈవో(FEO)కి హెచ్ఎండీఏ నుండి రు. 55 కోట్లు చెల్లింపులు జరిగాయి. చెల్లించేముందు ఆర్ధికశాఖ, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. విదేశీకంపెనీలకు విదేశీకరెన్సీలో డబ్బులు చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి తప్పనిసరి. అసలు ఆర్బీఐకి తెలియకుండానే చెల్లింపులు చేసేశారు. ఇదంతా ఎలాగ జరిగిందంటే కేటీఆర్ ఆదేశాల కారణంగానే. నిదుల బదిలీకి తానే ఆదేశించినట్లు ఆమధ్య కేటీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో కమిట్ అయ్యారు. అయితే నిధుల బదిలీకి తనకు ఎలాంటి సంబంధంలేదని ఇపుడు అడ్డం తిరిగారు.
సరే, మీడియా సమావేశంలో ఏమిచెప్పారు, ఇపుడు ఎందుకు అడ్డంతిరిగారన్న విషయాలు ఏసీబీ, ఈడీ అధికారుల విచారణలో తేలుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలకపాత్రదారి ప్రభాకరరావు లాగ కేటీఆర్ దేశంవిడిచి పారిపోలేదు. కాబట్టి ఫార్ములా కార్ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సూత్రదారుతో పాటు పాత్రదారులు కూడా హైదరాబాదులోనే ఉన్నారు. అందుకనే అందరిపైనా ఏసీబీ, ఈడీ అధికారులు కేసులు పెట్టి, నోటీసులిచ్చి విచారణ మొదలుపెట్టింది. విచారణలో నిజాలన్నీ తొందరలోనే బయటపడతాయి. అప్పుడు తప్పుచేసిన వాళ్ళెవరు ? అందుకు ప్రేరేపించిన వాళ్ళెవరు ? పాత్రదారులు, సూత్రదారులందరి పాత్రలు కోర్టులో తేలిపోతుంది. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లాగకాకుండా ఫార్ములా ఈ కార్ రేసు విచారణ తొందరలోనే తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.