వీరయ్య చౌదరి హత్య వెనుక రేషన్ మాఫియా?

టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుల్ని క్షమించబోమని చంద్రబాబు హెచ్చరించిన కొన్ని గంటల లోపే ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2025-04-23 15:59 GMT
వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శిస్తున్న చంద్రబాబు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించిన కొన్ని గంటల లోపే ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు కు చెందిన రేషన్ మాఫియా నాయకుడికి ఈ హత్యకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి అనుచరులుగా భావిస్తున్న ఐదుగుర్ని గుంటూరు జిల్లా పొన్నూరులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వీరయ్య చౌదరి హత్య వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే దిశగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు పరామర్శ..
ఈ హత్య విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వస్తూనే నాగులుప్పలపాడు వెళ్లారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
ఒక మనిషిని ఇంత కిరాతకంగా హత్య చేస్తారా? 53 కత్తిపోట్లా? మనం నాగరిక సమాజంలోనే ఉంటున్నామా? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకుడు వీరయ్య చౌదరి హత్యోదంతంపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పందించారు. నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
వీరయ్య చౌదరి హత్యను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. నిందితుల్ని పట్టుకునేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య చేసింది స్థానికులా.. కిరాయి గూండాలా.. దర్యాప్తు చేస్తోంది.
"నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీరయ్య చౌదరి హత్య విషయం తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. ఈ హత్య జరిగిన విధానం చూస్తే.. కరడుగట్టిన నేరస్థులు సైతం చేయని రీతిలో ఉంది. భౌతికకాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోంది. వీరయ్య చౌదరి మంచి నాయకుడు. సమర్థమంతమైన వ్యక్తి. యువగళం సందర్భంలో 100 రోజుల పాటు లోకేశ్‌తో తిరిగారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో అండగా నిలబడ్డారు. పార్టీకి ఒక సమర్థమైన వ్యక్తిగా పనిచేశారు. ఈ మండలంలో 10వేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితులో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి నేతను కోల్పోవడం బాధాకరం. వీరయ్య చౌదరి హత్యకు కారణాల్ని పరిశీలిస్తున్నాం. వ్యక్తిగత కక్షలా.. ఆర్థిక వ్యవహారాలా? రాజకీయంగా ఎదుగుదల తట్టుకోలేక చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది" అని చంద్రబాబు అన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
"విభేదాలు వచ్చినప్పుడు హత్యలు చేయడం రాక్షస మనస్తత్వం. రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించం. ఈ ఘటనలో నిందితుల గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 9121104784కు చెప్పాలని కార్యకర్తలు, సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని నూటికి నూరు శాతం పట్టుకొని శిక్షిస్తాం. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు, హత్యలు చేసే వ్యక్తులకు ఒకటే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారని గుర్తుంచుకోండి" అని చంద్రబాబు హెచ్చరించారు.
వీరయ్య చౌదరి కుటుంబానికి ఓదార్పు..
వీరయ్య చౌదరి భార్య, కుమారుణ్ణి ఓదార్చారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆఫీస్‌లో ఆయనతో పాటు ఉన్న వ్యక్తినీ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా నిందితులు ముసుగు వేసుకొని ఈ కిరాతకానికి ఒడిగట్టారు. ఏది ఏమైనా నిందితుల్ని శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.
Tags:    

Similar News