TTD|టీటీడీ ఛైర్మన్ మీద ఒత్తిడి పెరిగిపోతోందా ?

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు మీద ఒత్తిడి పెరిగిపోతోందా ? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

Update: 2024-11-28 07:22 GMT

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు మీద ఒత్తిడి పెరిగిపోతోందా ? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. విషయం ఏమిటంటే తెలంగాణా ప్రజాప్రతినిధులు ఇస్తున్న రికమెండేషన్ లెటర్సును టీటీడీ(TTD) బుట్టలో పడేస్తోంది. తెలంగాణా(Telangana) నుండి తిరుమల శ్రీవారి దర్శనార్ధం వెళ్ళే భక్తులకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు లెటర్లు ఇస్తుంటారు. కాటేజీలు, దర్శనాలు, ప్రసాదాల కోసం ప్రజాప్రతినిధులు టీటీడీ ఉన్నతాధికారులకు లెటర్లు ఇవ్వటం చాలా సహజం. తమ ప్రజాప్రతినిధులు లెటర్లు ఇచ్చారు కాబట్టి తిరుమల మీద తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుని పిల్లాపాపలతో సహా తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే అక్కడకు వెళ్ళి అధికారులను కలిసిన తర్వాతే వాళ్ళకు విషయం అర్ధమవుతోంది. అదేమిటంటే తమ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లెటర్లకు తిరుమలలో ఎలాంటి వాల్యు లేవని.

లెటర్లు తీసుకున్న భరోసాతో తిరుమలకు చేరుకున్న భక్తులు అవమానంగా ఫీలవుతున్నారు. అప్పటికప్పుడు కాటేజీలు, దర్శనాలు, ప్రసాదాల(TTD Laddoo)కు నానా అవస్తలు పడుతున్నారు. తిరిగొచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను కలుసుకుని లేదా వాళ్ళ పరపతిగురించి చాలా చులకనగా ప్రచారంచేస్తున్నారు. దాంతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న ప్రజాప్రతినిధులకు జనాల ముందు చాలా అవమానంగా ఉంటోంది. ఇది ఒకరిద్దరికి కాకుండా ఎక్కువమందికి జరుగుతుండటంతో మంత్రులు, ఎంఎల్ఏలకు మండిపోతోంది. ఎంఎల్సీ బాల్మూరి వెంకట్, మహబూబ్ నగర్ ఎంఎల్ఏ ఎన్నం శ్రీనివాసులరెడ్డి తదితరులు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు.

ఈమధ్యనే జరిగిన ఒక సమావేశంలో వీళ్ళు మాట్లాడుతు తిరుమలలో తమ రికమెండేషన్ లెటర్లను ఖాతరుచేయకపోవటంపై తీవ్రంగా మండిపోయారు. వాళ్ళు అసంతృప్తి మొత్తాన్ని చంద్రబాబునాయుడు(Chandrababu naidu) మీద చూపించారు. తెలంగాణా ప్రజాప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అవమానాలకు చంద్రబాబే కారణమని వీళ్ళు ఆరోపించారు. తాము మాట్లాడటమే కాకుండా పార్టీ ఆఫీసు గాంధీభవన్లో మరికొంతమంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో కలిసి ఇదే విషయమై రేవంత్ రెడ్డి(Revanth reddy)ని కలిసి ఫిర్యాదు చేయాలని కూడా డిసైడ్ చేశారు. అదే విధంగా రేవంత్ ను కలిసి చంద్రబాబు మీద ఫిర్యదు కూడా చేశారు. తిరుమల వివాద పరిష్కారానికి తాను చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.

ఇపుడు విషయం ఏమిటంటే బోర్డు ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) రేవంత్ ను కలిశారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working president KTR), హరీష్ రావుతో పాటు కొందరు ముఖ్యులను కలిశారు. అయితే బీఆర్ నాయుడు ఎవరిని కలిసినా తిరుమలలో దర్శనాలు, కటేజీల విషయాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు. తిరుమలలో తెలంగాణా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ప్రోటోకాల్ ప్రకారం తగిన గుర్తింపు, గౌరవం దక్కేట్లుగా చూడాల్సిందే అని గట్టిగా కోరారు. తాము ఇస్తున్న లెటర్లను తిరుమలలో అధికారులు బుట్టలో పడేస్తున్న విషయమై తెలంగాణా ప్రజాప్రతినిధులు ఆరోపించారు.

వీళ్ళల్లో మంట ఏ స్ధాయిలో ఉందంటే చంద్రబాబుకు ఆస్తులు తెలంగాణాలోనే డెవలప్ చేసుకోవాలి, హెరిటేజ్(Heritage)వ్యాపారాలకు తెలంగాణా కావాలి, సొంతిల్లు తెలంగాణాలోనే ఉండాలి కాని తెలంగాణా ప్రజాప్రతినిధులకు మాత్రం తిరుమలలో మర్యాద, గౌరవం ఇవ్వరా ? అంటు బాహాటంగానే నిలదీశారు. తమ లెటర్లకు తిరుమలలో తగిన గౌరవం ఇవ్వకపోతే చంద్రబాబు తెలంగాణాలో వ్యాపారాలు ఎలాగ చేసుకుంటారో చూస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. యెన్నం, బాల్మూరి హెచ్చరికలకు చాలామంది ఎంఎల్ఏలు మద్దతుగా నిలిచారు. దాంతో విషయంలోని తీవ్రత రేవంత్ కు అర్ధమైంది. అందుకనే తిరుమల వివాదాన్ని చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. ఇపుడు టీటీడీ ఛైర్మన్ నాయుడే తమను నేరుగా కలవటంతో తిరుమల వివాదాన్ని తెలంగాణా ముఖ్యనేతలు ప్రస్తావించారు. దాంతో ఏమి బదులివ్వాలో నాయుడుకు అర్ధంకాలేదు.

ఇద్దరు ముగ్గురు ఒకే విషయాన్ని ప్రస్తావించటంలో చేసేదిలేక ఈ వివాదాన్ని చంద్రబాబుతో పాటు బోర్డు మీటింగులో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాల్సొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఛైర్మన్లుగా నియమితులైన వాళ్ళెవరు ఇలా ప్రత్యేకంగా తెలంగాణాలో ముఖ్యులను కలవలేదు. 2014-19 మధ్య ఛైర్మన్లుగా పనిచేసిన చదలవాడ కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్, 2019-24 మధ్య ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా ఇపుడు నాయుడు కలిసినట్లుగా తెలంగాణా ముఖ్యులను కలవలేదు. నాయుడు ప్రత్యేకంగా ఎందుకు కలుస్తున్నారంటే పబ్లిసిటీ కోసం కావచ్చు లేదా తన వ్యాపారాలు, ఆస్తులు కూడా హైదరాబాదు చుట్టూ ఉండటం, స్ధిర నివాసం హైదరాబాదే కావటంతో తన జోలికి ఎవరూ రాకుండా ముందుజాగ్రత్తగా కూడా కావచ్చు. ఏదేమైనా తెలంగాణా ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వకపోతే విషయం చాలా దూరం వెళ్ళేట్లుగా ఉంది. మరి నాయుడు చివరకు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News