కోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వానికి భయం పట్టుకుందా?

సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భయాన్ని సృష్టించాయి. డీజీపీ ప్రకటించిన నిర్ణయం దీనికి బలాన్ని చేకూర్చుతోంది.

Update: 2024-10-01 12:45 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భయం గుప్పెట్లో ఉంది. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ నలుగురు కలిసినా తిరుపతి లడ్డూ.. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు.. తాజాగా డీజీపీ ప్రకటన. వీటిపైన చర్చించుకుంటున్నారు. లడ్డూ వివాదంపై నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై మంగళవారం తిరుమల వెళ్లిన రాష్ట్ర డీజీపీ ద్వారకాతిరుమలరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు దర్యాప్తును నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వానికి భయం పట్టుకుందా?
సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వం తప్పు చేసిందనే ప్రచారం రాష్ట్రంలో జరుగుతుందేమోనన్న భయంలో ప్రభుత్వ నేతలున్నారు. సోమవారం నుంచి టీడీపీ నాయకులు ఈ అంశంపై నోరు మెదపడం లేదు. అంటే అధినేతైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఎవరూ మాట్లాడొద్దనే సమాచారం నేతలకు, శ్రేణులకు వెళ్లిందని సమాచారం. అందుకే ఎవ్వరూ మాట్లాడేందుకు సాహసం చేయడం లేదు. నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన రోజు నుంచి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దుమారం రేపారు. ఒక్క సారిగా వీరందరి నోళ్లు మూత పడ్డాయంటే కేంద్ర బీజేపీ పెద్దల నుంచి వీరికి సంకేతాలేమైనా అందాయా.. లేకా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమా? అనేది ప్రజలకు ఇంకా అంతుపట్టడం లేదు.
ఎవ్వరినీ వదిలేది లేదన్న ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహించారు?
లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మాత్రంగానైనా ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక్కో సారి ప్రత్యేకంగా లడ్డూ వ్యవహారంపైనే తీవ్రంగా స్పందించారు. సీబీఐ దర్యాప్తు జరగాలని ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ దాని ఊసే ఎత్త లేదు. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా సీబీఐ దర్యాప్తును కోరారు. ఆ విషయమై ఎక్కడ కూడా మాట మాత్రంగానైనా సీఎం చంద్రబాబు ప్రస్తావించ లేదు. సిట్‌ దర్యాప్తు వద్దని, సాధారణ విజిలెన్స్‌ విభాగంతో కాకుండా టీటీడీ విజిలెన్స్‌ విభాగంతో దర్యాప్తు చేయాలని పలువురు కోరారు. అయినా ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. తనకు అనుకూలమైన సిట్‌ను వేసింది. మూడు రోజులుగా కొండపైన నానా హడావుడి చేస్తున్నారు.
నిలిపి వేస్తూ ప్రకటన
సిట్‌ దర్యాప్తును మూడు రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసిందని అర్థం అవుతోంది. లేకుంటే సిట్‌ను దర్యాప్తును చేయకుండా ఎందుకు నిలుపుదల చేస్తారనే అనుమానం చాలా మందికి కలుగుతోంది. ప్రభుత్వం కావాలనే ఏదో ఒక విధంగా గత పాలకులను ఇరికించాలనే ఉద్దేశంతో ఇలాంటి దర్యాప్తు చేపట్టారని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ విచారణ నేపథ్యంలోనే ఎక్కడ తమ లోపాలు, తప్పులు పొక్కుతాయనే భయంతో ప్రభుత్వం సిట్‌ దర్యాప్తును నిలిపి వేసినట్లు చర్చ సాగుతోంది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్‌లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వం కోర్టు దెబ్బకు గింగిరాలు తిరిగి భయంతో కాస్త వెనక్కి తగ్గి పునరాలోచనలో పడిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News