బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణా-ఆంధ్ర చిచ్చు రగిలిస్తోందా ?

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం ఒకటే మార్గమని కేసీఆర్ డిసైడ్ అయ్యారా ?

Update: 2024-09-13 07:00 GMT

కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం ఒకటే మార్గమని కేసీఆర్ డిసైడ్ అయ్యారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీకి మధ్య వివాదం అందరికీ తెలిసిందే. ఫిరాయింపు ఎంఎల్ఏని ఏమీచేయలేని పాడి ఆ కోపంలో బతకటానికి ఆంధ్రానుండి వచ్చావని నోరు పారేసుకున్నాడు. ఆంధ్రానుండి వచ్చినవాడివి తెలంగాణా బిడ్డమీద హత్యాయత్నానికి కుట్రచేస్తావా ? అని మండిపడ్డారు. అంతేకాకుండా తెలంగాణా దెబ్బేంటో చూస్తావంటు చాలెంజ్ చేశాడు. ఇక్కడ విషయం పాడి-గాంధీ మధ్య వివాదం.

ఆ వివాదమేదో తమలో తాము తేల్చుకోకుండా ‘బతకటానికి ఆంధ్రా నుండి వచ్చావని, తెలంగాణా బిడ్డ హత్యాయత్నమని’, ‘ఆంధ్రావాళ్ళు దాడిచేస్తే చూస్తు ఊరుకోమని..తెలంగాణా పవర్ ఏంటో చూపిస్తామ’ని ఏదేదో మాట్లాడాడు. గాంధీతో పాడికి ఏమైనా ఇష్యూ ఉంటే తేల్చుకోవాలి. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయటం అదీకాదంటే కోర్టులో కేసువేయాలి. అంతేకాని ప్రాంతీయతత్వాన్ని తీసుకురావాల్సిన అవసరంలేదు. ఏపీ అయినా తెలంగాణా అయినా ఏ ఒక్కరి సొత్తుకాదన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే గాంధీని ఉద్దేశించి పాడి ఆంధ్రోడు, తెలంగాణా పవర్ చూపిస్తామని అన్నాడంటే అంతర్లీనంగా ఏదో వ్యూహం మొదలైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రేవంత్ ను నియంత్రించాలంటే బీఆర్ఎస్ వల్ల కావటంలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ చాలావరకు ఫాంహౌసుకే పరిమితమైపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరఓటమి దెబ్బకు బయటకు రావటమే మానేశారు. చివరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అందుకనే కేటీఆర్, హరీష్ రావు మాత్రమే వ్యక్తిగతంగా రేవంత్ తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో బురద చల్లేస్తున్నారు. అయితే దాన్ని జనాలు పట్టించుకోవటంలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుహామీలు బూటకమని గోలపెట్టారు. అయితే వాటిల్లో ఐదింటిని రేవంత్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రైతు రుణమాఫీ అంతా బోగస్ అంటు నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు.

ఎందుకంటే రుణమాఫీ కాని వాళ్ళ రైతుల్లో సాంకేతిక సమస్యల కారణమని ప్రభుత్వం చెప్పింది. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ అవుతుందని ప్రకటించింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి రైతురుణమాఫీపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్య హైడ్రా అనేది ఉరుములేని పిడిగులాగ వచ్చి మీదపడింది. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి నిర్మించిన అక్రమకట్టడాలన్నింటినీ హైడ్రా కూల్చేస్తోంది. దీనివల్ల ప్రజలకు ఎక్కువ నష్టమని అంచనా వేసిన బీఆర్ఎస్ నేతలు హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళల్లో మామూలు జనాలు కూడా ఉన్నప్పటికీ మెజారిటి బడాబాబులే ఎక్కువమందున్నారు. దాంతో హైడ్రా యాక్షన్ కు జనాల మద్దతు పెరిగిపోతోంది.

ఏ విధంగా రేవంత్ జోరుకు పగ్గాలు వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించినా వర్కవుట్ కావటంలటేదు. అందుకనే చివరి అస్త్రంగా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపి ఆంధ్ర-తెలంగాణా అంటు ప్రాంతీయతత్వాన్ని రేకెత్తిస్తున్నారు. నిజానికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన 39 సీట్లలో సుమారు 20 సీట్లు ఆంధ్రా ఓటర్ల వల్ల గెలిచినవే. గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో బీఆర్ఎస్ 16 నియోజకవర్గాల్లో గెలిచిందంటే అందుకు ఆంధ్రా ఓటర్లే ప్రధాన కారణం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఆంధ్రా ఓటర్లే ఎక్కువగా ఆదుకున్నారు. అయినా సరే ఇపుడు పాడి ఆంధ్రా వాళ్ళని అవమానిస్తున్నట్లు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు పాడి చేసిన వ్యాఖ్యలు రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీపై నెగిటివ్ ప్రభావం చూపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

కౌశిక్ వ్యాఖ్యలను సమర్ధిస్తారా ?




 ప్రాంతీయవాదాన్ని రేకెత్తించేట్లుగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సమర్ధిస్తున్నారా అంటు రేవంత్ నిలదీశారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిచిందే సీమాంధ్రుల ఓట్లతోనే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గాంధీతో సమస్యుంటే వ్యక్తిగతంగా తేల్చుకోవాల్సిన పాడి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ఎవరికీ మంచిదికాదని రేవంత్ అభిప్రాయపడ్డారు.

గాంధీకి కాంగ్రెస్ కు సంబంధం లేదు




బీఆర్ఎస్ ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురదచల్లటం తగదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గాంధీకి కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్ గా ఎలాంటి సంబంధంలేదని మహేష్ స్పష్టంగా చెప్పారు. గాంధీ బీఆర్ఎస్ సభ్యుడు కాబట్టే స్పీకర్ పీఏసీ ఛైర్మన్ గా నియమించారని అధ్యక్షుడు చెప్పారు. గాంధీ-పాడి మధ్య జరుగుతున్న వివాదంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు.

పాడి వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి




 ఆంధ్రావాళ్ళని కించపరుస్తూ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని తెలంగాణా సెటిలర్స్ ఫోరం వ్యవస్ధాపక అధ్యక్షురాలు, మాజీ ఎంఎల్ఏ కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ గాంధీతో పడికి ఏవన్నా సమస్యలుంటే తేల్చుకోవాలి కాని మధ్యలో ఆంధ్రా వాళ్ళని అవమానించటం ఏమిటంటే ప్రసూన మండిపోయారు. ఆంధ్ర-తెలంగాణా వాదం తీసుకురావాల్సిన అవసరం పాడికి ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణా అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్రను ఎవరూ తక్కువచేసి చూడలేరని ఆమె గుర్తుచేశారు. పదేళ్ళ క్రిందటివరకు హైదరాబాద్ సమైక్య రాష్ట్రానికి రాజధానిగా ఉంది కాబట్టి అన్నీ జిల్లాల నుండి వచ్చి ఇక్కడ స్ధిరపడ్డారని ప్రసూన గుర్తుచేశారు. వ్యక్తిగత సమస్యలతో ప్రాంతాల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టడం మానుకోవాలని ప్రసూన హితవు పలికారు. పార్టీ మారిన ఎంఎల్ఏలకు చీర, గాజులు పంపుతామని చెప్పటం అంటే కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించటమే అని ప్రసూన చెప్పారు.

మొత్తంమీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డైరెక్టుగా ఏమీచేయలేమని అర్ధమైపోయిన తర్వాత చివరకు ఆంధ్ర-తెలంగాణా వాదాన్ని బీఆర్ఎస్ మళ్ళీ తెరపైకి వ్యూహాత్మకంగా తీసుకొస్తున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ వాదాన్ని తాము తీసుకొస్తే ప్రజా స్పందన ఎలాగుంటుందో అన్న అనుమానంతోనే పాడి కౌశిక్ రెడ్డితో చెప్పించారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి పాడి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News