Modi and Chiranjeevi|చిరంజీవి ద్వారా బీజేపీ కాపులకు గాలమేస్తోందా ?

బీజేపీ(BJP)లాంటి బలమైన వేదిక మద్దతుగా నిలబడేట్లయితే రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవటానికి ధైర్యంచేస్తారేమో.;

Update: 2025-01-14 03:57 GMT

రాజకీయాల్లో జరిగే డెవలప్మెంట్లు చాలావరకు ప్రీప్లాన్డ్ గానే జరుగుతాయి. సడెన్ గా జరిగే డెవలప్మెంట్లు చాలా తక్కవనే చెప్పాలి. ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్డు వెలిగినట్లుగా ఉంటాయి కొన్ని డెవలప్మెంట్లు. ఇంతకీ విషయంఏమిటంటే ఢిల్లీలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(Central Minister Kishan reddy) ఇంట్లో సోమవారం జరిగిన సంక్రాంతి పండుగ(Sankranti Festival) సంబరాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Narendra Modi)తో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలు చాలామంది పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంబరాలకు మోడి, కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొనటంలో ఎలాంటి విశేషంలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chairamjeevi) కూడా పాల్గొన్నారు. కిషన్ ఇంట్లో జరగబోయే సంక్రాంతి సంబరాలకు మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నట్లు ముందుగా ఎక్కడా సమాచారం లేదు.

తనింట్లో జరిగే కార్యక్రమాలకు ఎవరెవరిని పిలవాలనేది పూర్తిగా కిషన్ ఇష్టమే అనటంలో సందేహంలేదు. అయితే ప్రత్యేకంగా చిరంజీవిని మాత్రమే పిలవటంలో ఆంతర్యం ఏమిటన్నదే అర్ధంకావటంలేదు. ఇదేఫంక్షన్లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(Badminton Star PV Sindhu)తో పాటు డాక్టర్ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అయితే వీళ్ళిద్దరు సమాజంలో ప్రముఖులే కాని పొలిటికల్ టచ్ లేదు. అయితే చిరంజీవి ప్రముఖ సినీసెలబ్రిటీయే కాకుండా ఒకపుడు ప్రజారాజ్యంపార్టీ వ్యవస్ధాపకుడు, తర్వాత కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కేంద్రమాజీమంత్రి కూడా. ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్(Congress) నేతగానే చెలామణి అవుతున్నారని కాంగ్రెస్ నేతలు చాలామంది ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటికీ అదనంగా ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్వయాన పెద్దన్నయ్య. సినీసెలబ్రిటీతో పాటు చిరంజీవికి ఇన్నిరకాల రాజకీయ బంధాలు బలంగా ఉన్నాయి.

పైగా చిరంజీవి అంటే కాపుల ఆరాధ్యదైవంగా బాగా ప్రొజెక్టయిన విషయం కొత్తేమీకాదు. 2009 ఎన్నికల్లో పీఆర్పీకి కాపులందరూ ఓట్లేయకపోయినా పోలైన సుమారు 70 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఎదురుదెబ్బలుతిన్న చిరంజీవి 2014 తర్వాత నుండి ప్రత్యక్షరాజకీయాలకు దూరమైపోయినా సినిమాల్లో డైలాగులు, తమ్ముడు పవన్ ద్వారా రాజకీయంగా అప్పుడప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తునే ఉన్నారు. అలాంటిది ఇపుడు ప్రత్యేకంగా కిషన్ ఇంట్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనటంతో మోడీ-చిరంజీవి కాంబినేషన్ పై చర్చలు మొదలయ్యాయి. కారణం ఏమిటంటే తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి పలానా సామాజికవర్గం మద్దతుంది అనుకునేందుకు లేదు. గాలివాటంగా నాలుగు సీట్లు గెలవటం గాలిలేకపోతే చతికలపడిపోవటం బీజేపీకి మామూలే.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లలో గెలిచినా తర్వాత జరిగిన పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ, ఎంఎల్ఏ సీట్లలో గెలిచిందంటే గాలివాటే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో ఎటూ జనసేన చీఫ్ కమ్ డిప్యుటీ సీఎం పవన్(Pawan Kalyan) ఎన్డీయేలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బందిలేదు. కాని తెలంగాణాలో పరిస్ధితే అయోమయంగా ఉంది. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. నిజంగానే జమిలిఎన్నికలు జరిగితే ఏపీలో ఇపుడున్న ఎన్డీయే(NDA) కాంబినేషన్లోనే మూడుపార్టీలు ఎన్నికలను ఎదుర్కొంటాయి. కాబట్టి ఏపీలో కాపుల ఓట్లు పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ఇదేసమయంలో తెలంగాణలో పరిస్ధితి ఏమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు.

అందుకనే చిరంజీవిని దువ్వుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవిని బీజేపీలో చేర్చుకుని అవసరమైతే పార్టీపగ్గాలు అప్పగించటమో లేదా సీఎం అభ్యర్ధిగా ప్రకటించటమో చేస్తే తెలంగాణాలోని కాపుల ఓట్లు బీజేపీకి పడతాయని కమలంపార్టీ ఆశిస్తున్నట్లుంది. తెలంగాణ(Telangana)లోని కాపులను చిరంజీవి ఆకర్షించి పార్టీని గెలిపిస్తారని అంచనాలు వేసుకుంటున్నట్లుంది. అందుకనే అవకాశం దొరికినప్పుడల్లా మోడీతో చిరంజీవి భేటీని పార్టీ ఏర్పాటుచేస్తోంది. లేకపోతే కిషన్ ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకించి చిరంజీవి ఢిల్లీకి వెళ్ళి మోడీతో కలిసి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరమేలేదు. మోడీ-చిరంజీవి భేటీని ప్రత్యేకచొరవతో కిషనే ఏర్పాటుచేసినట్లుగా అర్ధమవుతోంది.

తనింట్లో జరిగిన సంబరాలకు సినీఫీల్డులో ఉండే ఇతర సెలబ్రిటీలను కూడా పిలిచుంటే అప్పుడు వ్యవహారం వేరుగా ఉండేది. చాలామంది సెలబ్రిటీలను పిలిచారు కాబట్టి చిరంజీవిని కూడా పిలిచారని, ఇందులో ప్రత్యేకత ఏమీలేదని సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా ప్రత్యేకంగా మోడీపాల్గొనే సంబరాల్లో చిరంజీవిని మాత్రమే పిలిచారు కాబట్టే ఇపుడు మోడీ-చిరంజీవి భేటీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి ద్వారా బీజేపీకి కావాల్సింది ఏమిటంటే కాపుల ఓట్లు. కాపుల ఓట్లతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లు కూడా వస్తే అవి బోనస్ ఓట్లు అవుతాయి. ఆమధ్య భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో మోడీపాల్గొన్న విషయంగుర్తుండే ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవికి కూడా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనే ఉందనిపిస్తోంది. అయితే వివిధ కారణాలతో యాక్టివ్ అవటానికి వెనకాడుతున్నాంతే. బీజేపీ(BJP)లాంటి బలమైన వేదిక మద్దతుగా నిలబడేట్లయితే రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవటానికి ధైర్యంచేస్తారేమో. ఇలాంటి పరిణామాలను చూస్తుంటే కాపుల ఓట్లకోసం బీజేపీ చిరంజీవికి గాలమేస్తోందనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News