ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డిల అరెస్ట్ తప్పదా?

ఒకపక్క సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు, అరెస్ట్ లు ఉద్యమంలా జరుగుతున్నాయి. మరో పక్క సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి.

Update: 2024-11-16 10:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాను వేదిక చేసుకుని రెచ్చి పోయారంటూ కొంత మందిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపగా మరికొంత మందిని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. తన కుమార్తెలు సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఎంతో బాధపడ్డారని, ఇంటి నుంచి బయటకు కూడా రామని చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పటంతో ఈ కేసులు పెట్టే కార్యక్రమం మొదలైంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టులు వస్తూనే ఉన్నాయి. అయితే అవి ఒకరి వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నందున అటువంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను అవమానించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ఆర్జీవీకి హైదరాబాద్ లో మద్దిపాడు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 19న స్టేషన్ లో హజరు కావాలని ఆదేశించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లోనూ తెలుగు రైతు నాయకుడు నూతలపాటి రామారావు ఆర్జీవిపై కేసు పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ లను అవమానిస్తూ సినిమా తీశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులపై ఆర్జీవి ఇంతవరకు మాట్లాడలేదు. సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒక క్యారెక్టర్ ద్వారా ఒక వ్యక్తిని లేదా కొంతమంది వ్యక్తులను అవమానించారా లేదా అనేది నిర్థారణ చేసుకున్న తరువాతనే రిలీజ్ కు ఆదేశాలు ఇస్తారు. అయితే సినిమాల ద్వారానే కాకుండా ఎక్స్ లో తాను అనేక పోస్టులు పెట్టి అవమానించేలా చేశారని, పాలకులను అవమానించే వారిని అరెస్ట్ చేయాల్సిందేనని కేసులు నమోదయ్యాయి.

సినీ నటుడు, దర్శకుడు, రైటర్ అయినటువంటి పోసాని కృష్ణ మురళిపై పోలీసు కేసులు పలు స్టేషన్ లలో నమోదయ్యాయి. విజయవాడలోని భవానీపురం, ప్రత్తిపాడు, మాచర్ల, కావాలి, రాజంపేట, మునగపాక, టెక్కలి, పాతపట్నం, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, చీరాల, బాపట్ల, తాడేపల్లిగూడెం, విశాఖ వన్ టౌన్, ఆదోని మూడో టౌన్ లో కేసులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి పాలకులను ఇష్టానుసారం మాట్లాడి అవమానపరిచారని, అందువల్ల అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసిన వారు కోరారు. ఇందులో రెండు కేసులు నమోదు కాగా మిగిలిన చోట్ల ఇంకా కేసులు నమోదు కాలేదు.

నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్లో తెలుగు మహిళ నాయకురాలు ఎ నిర్మల ఫిర్యాదు చేశారు. పవన్, చంద్రబాబు, లోకేష్ లపై నోరు శ్రీరెడ్డి పారేసుకుందని, వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు. రాజమండ్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకురాలు మజ్జి పద్మావతి ఫిర్యాదు చేశారు. అనంతపురంలో సంగా తేజస్విని అనే టీడీపీ నాయకురాలు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కంచరపాలెంలోనూ మరో కేసు నమోదైంది. ఆమె యూటూబ్ ను క్యాన్సిల్ చేయాలని ఫిర్యాదు చేసిన పలువురు నాయకులు పోలీసులను కోరారు. శ్రీరెడ్డి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను క్షమాపణ కోరుతూ ఎక్స్ వేదికగా లేఖలు రాసింది. తాను సాక్షిలో పనిచేసిన కాలం నుంచి జగన్, భారతి అంటే అభిమానమని, అందుకే వారికి అనుకూలంగా మాట్లాడినట్లు జగన్ కు ప్రత్యేకంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీ సభ్యురాలును కాకపోయినా అభిమానంతో అనుకూలంగా మాట్లాడానని ఈ జన్మలో మిమ్మల్ని కలిసి ఫొటో దిగుతాననే నమ్మకం కూడా నాకు లేదని పేర్కొన్నారు.

ఈ ముగ్గురు సినీ యాక్టర్స్ ను అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఆర్జీవీకి నోటీసులు జారీ చేసింది. పోసానిపై చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరిని అరెస్ట్ చేస్తే సినీ లోకం స్పందిస్తుందా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది.

Tags:    

Similar News