TESLA | ఊరిస్తున్న టెస్లా.. ఊపుమీదున్న ఆంధ్ర..
శ్రీ సిటీనా? అనంతపురమా? టెస్లా కంపెనీకి ఏ ప్రాంతం ఎంపికవుతుంది? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి? ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.;
By : Amaraiah Akula
Update: 2025-02-28 01:20 GMT
టెస్లా.. ఇదొక బ్రాండ్ కాదు, లైఫ్ స్టైల్.. అటువంటి కారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఊరిస్తోంది. ఆ కార్ల తయారీ యూనిట్ ను రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం ఉత్సాహపడుతోంది. దేశదేశాలలో మార్మోగుతున్న కార్ల కంపెనీ పేర్లలో టెస్లా ఒకటి. ఈ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి అత్యంత ఇష్టుడు. అమెరికన్ పాలకవర్గంలో చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఈ కంపెనీ అసెంబ్లింగ్ యూనిట్ ను రాష్ట్రానికి తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా విద్యుత్ వాహన (EV) తయారీ యూనిట్‌ను రప్పించడం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎంత, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, అసలిక్కడే పెట్టడానికి టెస్లా ఎందుకు ఆసక్తి చూపుతోంది వంటి అంశాలను పరిశీలిద్దాం.
ఇండియాలో టెస్లా యూనిట్ ను వ్యతిరేకిస్తున్నా టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తన కంపెనీ అసెంబ్లింగ్ యూనిట్ ను ఇండియాలో స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీ అధికారులు చర్చలు కొనసాగిస్తున్నాయి. నిజానికి ఈ ప్రయత్నం 2024 అక్టోబర్ లోనే మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని ఆస్టిన్ లో టెస్లా సీఎఫ్‌ఓ వైభవ్ తనేజాతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ మధ్య జరిగిన భేటీతో ఈ ప్రాజెక్టు అంశం మరోసారి చర్చకు వచ్చింది.
అంతర్జాతీయంగా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఇండియాను ఎంచుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తక్కువ ఖర్చుతో ఇక్కడ కార్లను తయారు చేసి ఇతర దేశాలకు పంపాలన్నది వ్యూహం అయి ఉండవచ్చు. ఎలాన్ మస్క్ వ్యూహం ఏదైనప్పటికీ టెస్లా కంపెనీ ఇండియాలో ఏర్పాటు కావడం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు. టెస్లా యూనిట్ ప్రతిపాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపాయి. తమ రాష్ట్రాలకు తెచ్చుకోవాలని పోటీ పడ్డాయి. అలా పోటీ పడిన రాష్ట్రాలలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
టెస్లా కంపెనీ సొంతంగా సేకరించిన సమాచారం ప్రకారం తన కార్ల కంపెనీ తయారీకి అందుబాటులో ఉన్న అనువైన ప్రాంతం దక్షిణాది రాష్ట్రాలుగా గుర్తించింది. దీంతో తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టెస్లాను సంప్రదించాయి.
ఏపీ ప్రభుత్వంలోని కీలకవర్గాల ప్రకారం, టెస్లా ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బాబు టెస్లా కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. లోకేశ్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో టెస్లా కంపెనీ మార్కెటింగ్ అధికారిని కలిసి టెస్లా యూనిట్ ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరారు. పలు ప్రోత్సాహకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు తమ రాష్ట్రం అనువైందిగా రాష్ట్ర ప్రభుత్వం టెస్లాకి చెప్పడంతో పాటు కియా కంపెనీ యూనిట్ వచ్చిన తీరును కూడా వివరించినట్టు సమాచారం.
టెస్లా వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో రాష్ట్రాన్ని టెస్లా పెట్టుబడికి అనువుగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి (EDB) టెస్లాకు పోర్ట్ కనెక్టివిటీ, విస్తారమైన భూఅనుకూలతలను వివరించి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ, అనంతపురం జిల్లాలోని కియా క్లస్టర్ సమీపంలోని ప్రీ-అక్వైర్డ్ ల్యాండ్ ఎంపికలపై చర్చలు జరుగుతున్నాయని ఓ అధికారి చెప్పారు.
"పోర్ట్ యాక్సెస్ ద్వారా కార్ల దిగుమతికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే, ఇక్కడ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాటరీ తయారీదారులు, అనుబంధ పరిశ్రమల మద్దతుతో ఏర్పాటైన ఎకోసిస్టమ్ ఉంది," అని ఆయన పేర్కొన్నారు.
టెస్లా ముందుంచిన ప్రధాన అంశాలు...
ఈ విద్యుత్ వాహన దిగ్గజాన్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. ఫ్యాక్టరీకి భూమి అందుబాటులో ఉందని, పోర్ట్ యాక్సెస్ వంటి ప్రతిపాదనలతో పాటు పలు ప్రోత్సాహకాలను టెస్లా కంపెనీ ముందుంచింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు, ముఖ్యంగా కృష్ణపట్నం పోర్ట్ సమీపంలోని ప్రాంతాలు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి.
భూ అందుబాటు..
పలు పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేసింది. దీని వల్ల భూసేకరణకు అవసరమయ్యే సమయం గణనీయంగా తగ్గుతుంది.
పోర్ట్ కనెక్టివిటీ:
కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో ఉండటం వలన వాహనాల దిగుమతి, ఎగుమతికి సులభమైన సౌకర్యాలు లభిస్తాయి.
అధునాతన మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయాలు, పారిశ్రామిక క్లస్టర్లు వంటి మౌలిక వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.
టెస్లాను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన పన్ను రాయితీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. 2017లో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెస్లాతో ఓ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు. రాయలసీమలో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు. ఇప్పుడా విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.
ఏపీ వైపు మొగ్గు చూపినట్టేనా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల జరిగిన భేటీ, టెస్లా భారతదేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో టెస్లా కంపెనీకి స్థల ఎంపిక పూర్తయినట్టేనని, బహుశా అది ఆంధ్రప్రదేశ్ అయిఉంటుందని వివిధ వర్గాలు భావిస్తున్నాయి.
"పోర్ట్ యాక్సెస్ టెస్లాకు వాహనాలను దిగుమతి చేసుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే, ఇప్పటికే ఇక్కడ ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాటరీ తయారీదారులు, అనుబంధ పరిశ్రమలతో ఒక పూర్తి స్థాయి పారిశ్రామిక వాతావరణం ఉంది," అని ఓ అధికారి తెలిపారు.
ఇక్కడే ఎందుకంటే...
ఇక, దక్షిణ భారతదేశం విద్యుత్ వాహనాల (EV) విక్రయ మార్కెట్ లో కీలకమైన ప్రాంతంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైలైట్ చేస్తోంది. దేశంలోని మొత్తం 4 వీల్ EV అమ్మకాలలో దాదాపు 60% విక్రయాలు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌ను ఇటీవల అమెరికాలో కలుసుకున్న అనంతరం టెస్లా కంపెనీ ఢిల్లీ, ముంబై, పుణేల్లో 13 టాప్ మోస్ట్ ఉద్యోగాల కోసం ప్రకటన విడుదల చేసింది. వీటిలో కొన్ని కస్టమర్లతో నేరుగా సంప్రదించాల్సినవి కాగా మరికొన్ని సర్వీసు, టక్నికల్ పోస్టులు. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్లు, డెలివరీ స్పెషలిస్టులు, సేవా సాంకేతిక నిపుణులను కూడా నియమించుకోవాలని చూస్తోంది.
టెస్లా విస్తరణ ఎందుకు..
భారతదేశ EV మార్కెట్, చైనాతో పోలిస్తే చాలా చిన్నది. గత ఏడాది చైనాలో 1.1 కోట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా, భారత్‌లో కేవలం 1 లక్ష యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టెస్లా ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది.
టెస్లా ఇప్పటి వరకు భారతదేశంలో కార్ల తయారీపై స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ CBU (Completely Built Unit) & CKD (Completely Knocked Down) మోడల్ లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు.
CBU (Completely Built Unit) అంటే టెస్లా విదేశాల్లో పూర్తిగా తయారు చేసిన కార్లను భారత్‌కు దిగుమతి చేసి అమ్మడం. అయితే, ప్రస్తుతం భారత్‌లో దిగుమతి సుంకాలు (import duties) చాలా ఎక్కువగా ఉండటంతో ఇది ఖరీదైన వ్యవహారం కావొచ్చు.
CKD (Completely Knocked Down) అంటే టెస్లా కార్లకు అవసరమైన విడిభాగాలను (parts) జర్మనీ లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని, భారత్‌లోని అసెంబ్లీ ప్లాంట్‌లో వాటిని అనుసంధానం చేయడం.దీనివల్ల దిగుమతి సుంకం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారనే దానిపై టెస్లా అధికారిక ప్రకటన చేయలేదు.
ఒకవేళ కంపెనీ CKD మోడల్‌ను అవలంబిస్తే, జర్మనీ, చైనా లేదా ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని భారతదేశంలో అసెంబ్లీ ప్లాంట్‌లో అనుసంధానం చేసే అవకాశం ఉంది.
కారు ధర ఎంత ఉండవచ్చు...
టెస్లా కార్ల ధరలు మోడల్, స్పెసిఫికేషన్లపై ఆధారపడి ఉంటాయి. భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్ల ధరలు సుమారు రూ. 21 లక్షల నుండి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడళ్లకు రూ. 2 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
వివిధ టెస్లా మోడళ్ల అంచనా ధరలు:
అమెరికాలో టెస్లా మోడల్ 3 ప్రారంభ ధర సుమారు $35,000 (రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను కలిపి ఈ కారు ధర సుమారు రూ. 35 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉండవచ్చు.
టెస్లా మోడల్ 3: సుమారు రూ. 60 లక్షలు
టెస్లా మోడల్ Y: సుమారు రూ. 70 లక్షలు
టెస్లా మోడల్ S: సుమారు రూ. 1.5 కోట్లు
టెస్లా మోడల్ X: సుమారు రూ. 2 కోట్లు
టెస్లా సైబర్ ట్రక్: సుమారు రూ. 50.7 లక్షలు
టెస్లా మోడల్ 2: సుమారు రూ. 45 లక్షలు.
ఈ ధరలు అంచనా మాత్రమే. అధికారిక ధరలు టెస్లా నుండి విడుదలైన తర్వాత స్పష్టత వస్తుంది. భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్ల ధరలు దిగుమతి సుంకాలు, పన్నులు, ఇతర ఖర్చులపై ఆధారపడి ఉంటాయి. దిగుమతి సుంకాలు తగ్గిస్తే టెస్లా కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్ల పోటీ..
టెస్లా రాకతో భారతీయ ఈవీ మార్కెట్‌లో లోకల్ మాన్యుఫాక్చర్ల మధ్య పోటీ పెరగవచ్చు. ఇది వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. టెస్లా కార్ల ఖచ్చితమైన ధరలు, లభ్యతపై అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం, మహీంద్రా XUV400, హ్యుందాయ్ కోనా EV, టాటా నెక్సాన్ EV వంటి దేశీయ ఎలక్ట్రిక్ కార్లు సుమారు రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్యలో ఉన్నాయి. టెస్లా కార్లు వీటికి మించే ఉండవచ్చు. అందువల్ల, టెస్లా ఇండియన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తక్కువ ధర మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశముంది.
ఇండియా వైపు టెస్లా ఎందుకు చూస్తోంది?
టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. భారత EV మార్కెట్ విస్తరణ ప్రధాన కారణం. 2030 నాటికి ఇండియాలో EV (Electric Vehicle) మార్కెట్ వేగంగా పుంజుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం కూడా FAME-II (Faster Adoption and Manufacturing of Electric Vehicles) వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది.
టాటా, మహీంద్రా, హ్యుందాయ్, MG వంటి కంపెనీలు ఇప్పటికే EVలపై దృష్టి సారించడంతో భారత EV మార్కెట్ విస్తృతంగా పెరుగుతోంది.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. మధ్య తరగతి పెరుగుతుండటం, EVలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండటం వల్ల EVలపై డిమాండ్ పెరుగుతోంది. చైనా తర్వాత భారతదేశం EVల కోసం అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారుతోంది.
టెస్లా ఎంత పెట్టుబడి పెట్టనుంది?
టెస్లా భారత్‌లో సుమారు ₹30,000-₹50,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మొదటగా, టెస్లా ఒక అసెంబ్లీ ప్లాంట్‌ను ప్రారంభిస్తుందని అంచనా. తరువాత, పూర్తిస్థాయి "Made in India" కార్ల తయారీ కోసం పెద్ద ఫ్యాక్టరీ స్థాపించేందుకు కంపెనీ ప్రయత్నించే అవకాశం ఉంది.
ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
టెస్లా తయారీ, అసెంబ్లీ, సేల్స్, సర్వీస్ సెంటర్లు, బ్యాటరీ తయారీ వంటి విభాగాల్లో వేలాది ఉద్యోగాలను అందించనుంది. సుమారు 25,000 - 50,000 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా.
వినియోగదారులకు సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా EV సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేయనుంది. ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, సేల్స్ వంటి విభాగాల్లో భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
టెస్లా ఎదుగుదలకు అవరోధాలు..
-దిగుమతి సుంకాలు (Import Duties) ఎక్కువగా ఉండటం. విదేశీ EVలపై భారతదేశంలో 70% నుండి 100% దిగుమతి సుంకం (import tax) ఉంది. టెస్లా భారత్ లో కారు ఉత్పత్తి చేయకపోతే ధరలు చాలా ఎక్కువగానే ఉంటాయి.
EV చార్జింగ్ స్టేషన్ల కొరత...
EVలకు అవసరమైన చార్జింగ్ సదుపాయాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. టెస్లా ఇండియాలో Supercharger Network ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.టెస్లా భారతీయ రోడ్లకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో EVలు తయారు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పెట్టే ఛాన్స్ ఉంది
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని శ్రీ సిటీ, అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ప్లాంట్ సమీప ప్రాంతాల్లో ముందస్తుగా సేకరించిన భూములను టెస్లా ప్రతినిధులకు చూపించిందని సమాచారం. ఈ ప్రాంతాలు చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉండటం వల్ల, టెస్లా ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల, టెస్లా ప్లాంట్ కోసం ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే, టెస్లా ఇంకా అధికారికంగా ఏ రాష్ట్రంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రకటించలేదు.
టెస్లా ప్రత్యేకత ఏమిటి?
టెస్లా కార్లపై ప్రజలు మోజు పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు, రేంజ్. టెస్లా Lithium-ion బ్యాటరీ టెక్నాలజీలో ముందుంది.
Tesla Model- S Long Range – ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 652 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇతర కంపెనీలతో పోల్చితే టెస్లా బ్యాటరీ లైఫ్ ఎక్కువ, డ్రైవింగ్ రేంజ్ ఎక్కువ.
టాటా నెక్సాన్ EV (465 కి.మీ), హ్యుందాయ్ Ioniq 5 (631 కి.మీ), BYD Atto 3 (521 కి.మీ). రేంజ్ పరంగా టెస్లా ఆధిక్యంలో ఉంది.
టెస్లా ఆటోపైలట్ & ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) మోడ్. టెస్లాలో "Autopilot" అనే అధునాతన డ్రైవింగ్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది.
Full Self-Driving (FSD) మోడ్. కారు స్వయంగా నడిపే అవకాశం ఉంది.
AI ఆధారంగా రహదారి పరిస్థితులను అంచనా వేస్తూ, ఆటోమేటిక్‌గా లైన్ మార్చడం, టర్నింగ్‌లు తీసుకోవడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లాంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా, టాటా, హ్యుందాయ్, BMW EVలు డ్రైవింగ్ అసిస్టెంట్ టెక్నాలజీని అందిస్తున్నప్పటికీ, టెస్లా FSD స్థాయికి చేరుకోలేదు.
సూపర్‌చార్జర్ నెట్‌వర్క్ & ఫాస్ట్ ఛార్జింగ్. Tesla Supercharger Network. ప్రపంచవ్యాప్తంగా 50,000+ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.
టెస్లా కారు 30 నిమిషాల్లో 80% చార్జింగ్ పూర్తవుతుంది.
టెస్లా కార్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ & టెక్నాలజీ. టెస్లా కార్లు స్మార్ట్‌ఫోన్‌లా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతాయి. Internet-Based టెక్నాలజీ – టెస్లా కార్లు AI & Machine Learning ద్వారా పని చేస్తాయి.
డిజైన్ & ఇంటీరియర్ స్టైల్. సింప్లీసిటీ + ఫ్యూచరిస్టిక్ డిజైన్ – టెస్లా కార్లలో మీకు కనీసమైన బటన్లు కూడా కనిపించవు. టెస్లా కార్లలో పెద్ద స్క్రీన్ ఒక్కటే ఉంటుంది.
పెనోరమిక్ గ్లాస్ రూఫ్, హై-ఎండ్ ఇంటీరియర్ ఫీచర్లు – Tesla Model X & Model S లలో ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.
మొత్తంగా చూసినపుడు టెస్లా ఓ "ప్రత్యేకమైన" బ్రాండ్. అందుకే యువతకు పెద్ద క్రేజ్. టెస్లా అనేది కేవలం కారు కాదు – అది ఒక లైఫ్ స్టైల్, స్టేటస్ గా మారింది.