రాజమండ్రిలోది ప్రచార సభా.. లేదా పొగడ్తల సభా..!

రాజమండ్రిలో కూటమి పార్టీలు నిర్వహించిన ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఇది ప్రచార సభ పొగడ్తల సభ అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే..

Update: 2024-05-06 13:36 GMT

రాజమండ్రిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్వహించిన ‘ప్రజాగళం’ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఈ సభను చూసిన వారంతా ఇది ఎన్నికల ప్రచార సభా లేదంటే మోదీ పొగడ్తల సభా అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ తప్ప ప్రసంగించిన ఇతర నేతలంతా మోదీపై ప్రశంసలు కురిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. వారి ప్రసంగం మొత్తం కూడా ప్రధాని మోదీ భజనే ఉంది. ప్రధాని మోదీ విచ్చేసిన సందర్బంగా టీడీపీ, జనసేన కీలక నేతలు అక్కడకు చేరుకుని ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్, లోకేష్ కూడా పొగడ్తల ప్రసంగాలే చేశారు.

ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంలో భారత్.. ప్రధాని మోదీ హయాంలో మారిందని అన్నారు పవన్. అదే విధంగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్.. అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని, అన్ని రంగాల్లో భారత్ తన సత్తా చాటుతోందని అన్నారు పవన్ కల్యాణ్. భారత్‌ను స్టార్టప్ హబ్‌‌గా మార్చిన ఘనత ప్రధాని మోదీనేనని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రపంచ ఖ్యాతి చెందిన కంపెనీలు భారత్‌లో తమ వ్యాపారం ప్రారంభించడానికి అధిక ఆసక్తి చూపడం ప్రారంభించాయని పవన్ చెప్పారు.


మోదీ మహానుభావుడు

500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యకు శ్రీరాముడిని తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘‘మోదీ అంటే ప్రధాని పేరు కాదు. భారతదేశ గుండె ధైర్యం. భారత్‌వైపు శత్రువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేలా చేసిన నేత ప్రధాని మోదీ. ఈ ఫీట్‌ను ఆయన పదేళ్ల పాలనలోనే సాధించారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు మోదీ. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుంది. కానీ వాటన్నింటికి తమ పేర్లు పెట్టుకుంటూ తమ పథకాలుగా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది’’ అని వివరించారు పవన్.

‘‘ ఐదేళ్లలో ఐదుకోట్ల మంది ప్రజలకు జగన్ నరకం చూపించారు. కేంద్ర పథకాలను అందించపుచ్చుకుని, లబ్దిదారులకు ఇవ్వడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. తమ పేర్లు పెట్టుకున్న పథకాలను కూడా కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలుగా పేరు పెట్టుకున్నారు. ఏపీలో లక్షలాది మంది యువత నేటికీ నిరుద్యోగులుగానే ఉన్నారు. ఐదేళ్లలో ఏ ఏడాదైనా జాబ్ క్యాలెండర్‌ను జగన్ విడుదల చేశారా?’’అని ప్రశ్నించారు.

‘‘మెగా డీఎస్‌సీ అని చెప్తూ దగా డీఎస్సీని.. ఎన్నికల ముంగిన ఫిబ్రవరిలో ప్రకటించారు. అది అలానే పోయింది. దేశానికి జాతీయ జెండాను అందించిన నేల ఇది. కానీ ఈరోజు ఇక్కడ దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వికసిత్ భారత్ కలలో మేమూ భాగస్వాములవుతాం. గతంలో పద్మ అవార్డులు రాజకీయాలు చేసే వారికే వచ్చేవి. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ అవార్డులను అర్హులైన వారికే దక్కుతున్నాయి’’ అని పవన్ అన్నారు.


ప్రధాని మోదీ విశ్వజీత్

ఈ సభలో ప్రసంగించిన నారా లోకేష్ కూడా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు. ‘‘భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన నేత నరేంద్ర మోదీ. దేశానికి మోదీ ఎంతో అవసరం ఉంది. దేశం దశ, దిశ మార్చింది ‘NAMO’ అనే నాలుగు అక్షరాలు. వికసిత్ భారత్ అనేది మోదీ కల. అంతే వికసిత్ ఏపీ అనేది చంద్రబాబు, పవన్ కల. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిని ఏర్పాటు చేశారని, దాని కోసం త్యాగం చేసిన పవన్ కల్యాణ్ తొలి అడుగు వేశారు. అదే విధంగా నేను కూడా దాదాపు 226 రోజులపాటు 3వేల కిలోమీటర్ల యాత్ర చేశాను. ఆ సమయంలో ప్రజల కష్టాలను చూశాను’’ అని చెప్పారు.

‘‘టీడీపీ హయాంలో రాష్ట్ర అబివృద్ధిని పరుగులు పెట్టించాం. విశాఖను ఐటీ హబ్‌గా చేశాం. యువతకు ఉపాధి అందించడం చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ పాలనలోని మొదటి బాధితులు యువతే. ఉపాధి అవకాశాలు తర్వాత ముందు కొత్త కంపెనీలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. పైగా ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రాన్ని విడిచాయి. కానీ మోదీ మాత్రం దేశాన్ని స్టార్టప్స్ హబ్‌గా మార్చారని, యువత నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ వారిని ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ‘మేక్ ఇన్ ఇండియా’ను తీసుకెళ్లారు మోదీ’’అని కొనియాడారు లోకేష్.

ప్రచార సభా.. పొడ్తల సభ..!

రాజమండ్రిలో జరిగిన ‘ప్రజాగళం’ సభపై కొన్ని వర్గాల ప్రజలు, వైసీపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అది ఎన్నికల ప్రచార సభ లేదంటే మోదీ భజన సభా అంటూ విమర్శలు చేస్తున్నారు. అందులో టీడీపీ, జనసేన నేతలు చేసిన ప్రసంగాల్లో మోదీ భజన, వైసీప అంటే ద్వేషమే కనిపించాయని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి ప్రసంగాల్లో ప్రజల కష్టాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వంటి అంశాలే లేవని, వాటిని ప్రజలు గమనించి ఓటేయాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనే కాన్సెప్టే కూటమికి లేదని, అంతేకాకుండా అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న అంశంలో కూడా వారికి రోడ్ మ్యాప్ లేదని దుయ్యబట్టారు. కానీ వైసీపీ అలా కాదని, తమ భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్‌కు క్యాడెర్‌కు పూర్తి అవగాహన ఉందని వారు చెప్తున్నారు. మరి ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News