అధికారంలో ఉంటేనే హీరో ?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మంత్రులు మీడియాతో మాట్లాడాలన్నా, తెలంగాణా భవన్లో ప్రజా ప్రతినిధులు, నేతలు మీడియాతో ఏమి మాట్లాడాలన్నా కేసీఆర్ అనుమతి ఉండాల్సిందే.

Update: 2024-09-15 09:00 GMT

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మంత్రులు మీడియాతో మాట్లాడాలన్నా, తెలంగాణా భవన్లో ప్రజా ప్రతినిధులు, నేతలు మీడియాతో ఏమి మాట్లాడాలన్నా కేసీఆర్ అనుమతి ఉండాల్సిందే. ఏ మంత్రి ఏమి మాట్లాడాలి ? ఎంత మాట్లాడాలి ? తెలంగాణా భవన్లో ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన విషయాలపైన కూడా పై నుండి డైరెక్షన్ వచ్చేది. అంతా సర్వంసహా కేసీఆర్ కనుసన్నల్లో మాత్రమే నడిచింది. ప్రగతిభవన్ కు ఎవరు రావాలి ? ఫామ్ హౌస్ లో ఎవరుండాలనే విషయాలు కూడా పెద్ద సారే డిసైడ్ చేసేవారు. ఇదే పద్దతిలో దాదాపు తొమ్మిదిన్నరేళ్ళు ఎదురులేకుండా నడిచింది.

సీన్ కట్ చేస్తే పార్టీలో ఎవరేమి మాట్లాడుతున్నారో ? ఎందుకు మాట్లాడుతున్నారో కూడా పెద్ద సారుకు తెలుస్తున్నట్లు లేదు. స్వయంగా తెలంగాణా భవన్లో మీటింగుకు రమ్మని కబురుచేసినా, ఫాంహౌసులో సమావేశం పెట్టినా చాలామంది పట్టించుకోవటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ప్లన్ చేసి అందరు తప్పకుండా హాజరవ్వాలని సమాచారం ఇచ్చినా చాలామంది పట్టించుకోవటంలేదు. పార్టీ ఒక దారి తెన్నులేకుండా నడుస్తోందనటానికి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనటానికి తాజా ఉదాహరణ పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షనే. ఇంతలో ఎంతమార్పు వచ్చేసింది ? ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటి ?

ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో లేకపోవటమే. రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ 2023లో జరిగిన మూడో ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటినుండి పార్టీతో పాటు కేసీఆర్ కు కూడా కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నపుడు ఎంతటి అసమర్ధుడు అయినా పులిలా గర్జిస్తాడని అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ కు ఈ సూత్రం వర్తించకూడదు. ఎందుకంటే ‘తాను చావునోట్లో తలపెట్టి తెలంగాణాను సాధించాన’ని చెప్పుకుంటుంటారు. ‘తాను పోరాటయోధుడనని, అవసరమైతే మెడ నరుక్కుంటాను కాని ఎవరికీ తలొంచన’ని లక్షలసార్లు బహిరంగసభల్లో చెప్పుంటారు. అలాంటి యోధుడికి పార్టీఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ మీద పట్టు తప్పిపోయిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్నారు. ఎంఎల్సీలు కూడా కాంగ్రెస్ లోకి జంప్ చేసేస్తున్నారు. పార్టీలోనే ఉన్న ఎంఎల్ఏల్లో కొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ స్వయంగా కబురుచేసినా వెళ్ళి కలవటంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేయాలని పిలుపిస్తే చాలామంది నేతలు పట్టించుకోలేదు. వరదల సమయంలో జనాలను పరామర్శించేందుకు కూడా పార్టీ నేతల్లో చాలామంది ఆసక్తి చూపలేదు. ఖమ్మం వరదబాదితుల పరామర్శించేందుకు హరీష్, అజయ్ లాంటి వాళ్ళపై దాడి జరిగింది. దాడికి నిరసనగా పార్టీ నేతలు రోడ్లపైకి రాలేదు. హరీష్ పై జరిగిన దాడితో తమకు సంబంధమే లేదన్నట్లుగా చాలామంది వ్యవహరించారు.

పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన నేత ఫాంహౌసులో కుర్చున్నారు. అధినేతేమో ఫాంహౌసును వదిలి బయటకు రావటంలేదు. వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా కేసీఆర్ పర్యటించకపోతే ఎలాగ ? కష్టాల్లో ఉన్నపుడే కదా జనాలకు తామున్నామనే ధైర్యాన్ని ప్రతిపక్షాలు ఇవ్వాల్సింది ? విచిత్రం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాలు జరిగితే కేసీఆర్ హాజరుకాలేదు. జనాలు కష్టాల్లో ఉంటే వచ్చి ధైర్యం చెప్పలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేంత తీరిక కూడా కేసీఆర్ కు ఉండటంలేదు. అందుకనే పార్టీలోని నేతలు కూడా తమిష్టం వచ్చినట్లు తాము నడుచుకుంటున్నారు. అరెకపూడి గాంధీతో మొదలైన వైరాన్ని పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత స్ధాయిలో తేల్చుకోవాలి. అలాకాకుండా బతకటానికి ఆంధ్రా నుండి వచ్చిన ఆంద్రోడు గాంధీకి తెలంగాణా బిడ్డగా తెలంగాణా వపర్ ఏమిటో చూపిస్తానని కౌశిక్ బహిరంగ చాలెంజ్ చేయటం కాస్త కేసీఆర్ కు చుట్టుకుంది. కౌశిక్ లేపిన ప్రాంతీయ వాదానికి కేసీఆర్ సమాధానం చెప్పాలంటు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు గట్టిగా తగులుకున్నారు.

కౌశిక్ వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పలేదు కాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో సమర్ధించుకున్నారు. అయితే పార్టీకి జరగాల్సిన డ్యామేజి అప్పటికే జరిగిపోయింది. జరుగుతున్నది చూసిన తర్వాత పార్టీపైన కేసీఆర్ కు పట్టు జారిపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉంటేనే కేసీఆర్ హీరో లెక్కుంటారని, అధికారంలో లేకపోతే ఎవరూ ఆయన మాట వినరనే టాక్ జనాల్లో పెరిగిపోతోంది. మరిది నిజమేనా కాదా అన్నది కేసీఆరే చెప్పాలి.

Tags:    

Similar News