బీజేపీని ఆపటం రేవంత్ వల్లవుతుందా ?
క్షేత్రస్ధాయిలో జరగుతున్న వ్యవహారాలు చూస్తుంటే శపథాన్ని నెరవేర్చుకోవటం రేవంత్(Revanth) వల్ల అయ్యేపనికాదనే అనిపిస్తోంది;
మంగమ్మశపథం సినిమాలో హీరోయిన్ జమున తన శపథాన్ని నెరవేర్చుకుంటుంది. మరి అలాంటి శపథమే చేసిన రేవంత్ తన శపథాన్ని నెరవేర్చుకుంటారా ? క్షేత్రస్ధాయిలో జరగుతున్న వ్యవహారాలు చూస్తుంటే శపథాన్ని నెరవేర్చుకోవటం రేవంత్(Revanth) వల్ల అయ్యేపనికాదనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు ‘బీజేపీ చాలా డేంజర్ పార్టీ కాబట్టి ఆపార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వం’ అని భీకర శపథం చేశాడు. నిజానికి బీజేపీని నిలువరించటం రాహుల్ గాంధి(Rahul Gandhi), సోనియా వల్లే కాలేదు ఇక రేవంత్ ఎంత ? అయినా ఒకపార్టీ గెలువాలన్నా, ఓడాలన్నా అనుకోవాల్సింది ఓటరు మహాశయులే కాని రేవంత్ కాదు.
ఏదో గాలివీచినపుడల్లా తెలంగాణలో బీజేపీ(BJP)కి కొన్ని సీట్లు వస్తుండేవి. అయితే గాలిసంగతి పక్కనపెట్టేస్తే తనబలాన్ని పెంచుకునేందుకు బీజేపీ కొన్ని సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఒకపుడు అయితే ఎన్నికల్లో ఏ మీడియా వార్తలు రాసినా చివరలో బీజేపీ కూడా పోటీచేస్తోంది అని రాసేది. అయితే కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ బలమైన ఫోర్సుగా తయారవుతోంది. ఇందుకు ప్రధానంగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కేసీఆర్(KCR) కే చెప్పుకోవాలి. తనను సవాలుచేసే ప్రతిపక్షమే ఉండకూడదని కేసీఆర్ అనుకుని టీడీపీ(TDP)ని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్(Congress) ను బాగా దెబ్బకొట్టారు. తెలంగాణలో కేసీఆర్ కు ప్రతిపక్షమే లేదు అన్న నేపధ్యంలో జనాలు బీజేపీ వైపు మొగ్గుచూపించారు. ప్రతిపక్షమే అన్నది లేకుండా చేస్తే జనాలు వేరేదారిలేక బీఆర్ఎస్ కే ఓట్లేస్తారని కేసీఆర్ ఏదో పిచ్చభ్రమలో ఉండేవారు.
అయితే జనాలు మాత్రం బీఆర్ఎస్ కు ప్రతిపక్షంగా బీజేపీని ఎంచుకున్నారు. అందుకనే జెండాలు కట్టేంత సీనుకూడా లేని ఆదిలాబాద్ ఎంపీ సీట్లో కూడా జనాలు 2019 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. అప్పటి ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు సీట్లలో బీజేపీ గెలిచింది. అలాగే నాలుగు ఎంఎల్ఏ సీట్లలో కూడా గెలిచింది. తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కమలంపార్టీనే గెలిచింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లలో గెలిచింది. ఇన్నిసీట్లలో బీజేపీ గెలిచిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీడీపీ, కాంగ్రెస్ ను వాటిమానాన వాటిని వదిలేసుంటే రెండుపార్టీలు బలంగా ఉండేవి. అప్పుడు ఎన్నికల్లో పోటీ మూడు పార్టీల మధ్యే జరిగేవేమో. మూడుపార్టీలతో పోటీపడినా బీజేపీకి ఏవో కొన్ని ఓట్లొచ్చేవే కాని సీట్లు అనుమానమే.
అలాంటిది 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లలో గెలిచి ఏకుమేకైనట్లుగా తయారవుతోంది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ నాయకత్వం బలంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ బలం పెద్దగా పుంజుకోవటంలేదు. ఈ పరిస్ధితుల్లో తెలంగాణలో బీజేపీని నిలువరించటం రేవంత్ వల్ల అయ్యేపనికాదు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఓట్లేయటం ఇష్టంలేని జనాలు కచ్చితంగా ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఎంచుకుంటారనటంలో సందేహంలేదు. బీజేపీనే ఎందుకు ఎంచుకుంటారంటే బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ లో లేని క్రమశిక్షణ కమలంపార్టీలో ఉంది. ఈమధ్యనే జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికలనే తీసుకుందాము. పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంటే బీజేపీ మూడుసీట్లలోను పోటీచేసింది. గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో మాత్రమే కాంగ్రెస్ పోటీచేసింది. అయితే పోటీచేసిన ఒక్కసీటులో కూడా కాంగ్రెస్ గ్రూపుతగాదాలతోనే ఓడిపోయింది.
ఇక, ప్రస్తుతానికి వస్తే రేవంత్ ఏడాదిన్నర పాలనపై జనాల్లో అసంతృప్తులు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు మాత్రమే పూర్తిగా అమలవుతున్నాయి. రైతురుణమాపీ పాక్షికంగా అమలైంది. మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీలు ఇంకా అమలేకాలేదు. అమలుకాని హామీల్లో విద్యార్ధినులకు స్కూటీలు, మహిళలకు తులంబంగారం లాంటి చాలా హామీలున్నాయి. డీఎస్సీ, గ్రూప్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వటం ప్లస్ గానే కనబడుతున్నాయి. అయితే రేవంత్ పాలనలో ప్లస్సులకన్నా మైనస్సులే ఎక్కువగా ఉన్నాయి. హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూ వివాదం, మూసీ సుందరీకరణ, ఫార్మా సిటీకి భూసేకరణలో అయిన గొడవలు ప్రభుత్వానికి కచ్చితంగా చెడ్డపేరే తెచ్చాయి.
ఈనేపధ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూసిన జనాలు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకుంటారు. ఈ విషయంలో రేవంత్ చేసేదేమీలేదు. ఏరకంగా చూసుకున్నా బీజేపీని నిలువరించటం రేవంత్ వల్ల అయ్యేపనికాదన్న విషయం అర్ధమైపోతోంది. కాంగ్రెస్ జాతీయసమావేశాల్లో పాల్గొన్నాడు కాబట్టి సీనియర్ నేతలముందు గంభీరంగా ఏదో ప్రకటనచేయాలి కాబట్టి మంగమ్మశపథం చేసినట్లున్నాడంతే.