ఎన్నికల ప్రచారంలో వైసీపీతో టీడీపీ పోటీపడినట్టేనా?

ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 11న ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎవరి ప్రచారం ఎలా సాగిందంటే..

Update: 2024-05-10 06:41 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో 24 గంటల్లో ముగియనుంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది.

జగన్ ప్రచారం సాగిందిలా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి "సిద్ధం" సభలతో మొదలుపెట్టి 22 రోజుల పాటు బస్ యాత్ర చేసి రోజుకు మూడు సభల చొప్పున చివరి దశ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఐదేళ్ల కిందట తన తండ్రి వైఎస్సార్ పేరు ప్రతిష్టలతో భారీ విజయంతో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో తాను తండ్రి చాటు బిడ్డను కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు.కురుక్షేత్ర యుద్ధాన్ని ఎదుర్కొబోతున్నట్టు చెప్పుకొచ్చారు. “ఆంధ్ర ప్రజలు కృష్ణుడి పాత్ర పోషిస్తే తాను అర్జునుడి పాత్ర పోషిస్తానని, ఈ అసెంబ్లీ ఎన్నికలు పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న పోటీ అని, వర్గపోరాటమని చెబుతూ వచ్చారు.
రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మే 13న ఒకేసారి ఒటింగ్ జరుగుతోంది. 2019లో YSRCP 175 అసెంబ్లీ సీట్లలో 151 స్థానాలను గెలుచుకుంది. 49.95% ఓట్ షేర్‌ ను సొంతం చేసుకుంది. 39.17 శాతం ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది.ఈ రెండు పార్టీల మధ్య సుమారు 17.50 లక్షల ఓట్ల తేడా ఉంది. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ ఒక్క సీటును గెలుచుకుని 5.53 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం 1.17% ఓట్లు వచ్చాయి. ఒక్క సీటూ గెలవలేకపోయింది.
ఇక, 25 లోక్ సభ సీట్లలో వైఎస్సార్ సీపీ 22 సీట్లు (49.89% ఓట్లు) గెలుచుకుంది. టీడీపీ మూడు (40.19%) సీట్లకు పరిమితమైంది.
చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు డీలా పడిన తరుణంలో 6 నెలల కిందటే జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. 175 సీట్లు ఎందుకు గెలవకూడదు అనే నినాదంతో ముందుకు వచ్చారు.
టీడీపీ, బీజేపీ, జేఎస్పీలు పొత్తు పెట్టుకోకుండా వైఎస్సార్ సీపీ చేయాల్సిందంతా చేసినా పవన్ కల్యాణ్ పట్టువీడకుండా మహాకూటమి పేరిట బీజేపీని రంగంలోకి దించారు. డీలా పడిన టీడీపీకి నూతన జవసత్వాలు కల్పించారు. జగన్ ను ఒంటరి చేసి ముఖాముఖి పోరుకు సిద్ధం చేశారు. చంద్రబాబుకు ఇది ఎంతో పెద్ద ఊరట.
చంద్రబాబు కంటే ముందు అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టిన వైఎస్ జగన్ ప్రస్తుత ఎమ్మెల్యేలలో దాదాపు 70 సీట్లలో అభ్యర్థుల్ని మార్చడమూ లేక సీట్లు నిరాకరించడమో చేశారు. ఎంపీ క్యాండిడేట్ల విషయంలోనూ 22 మందిలో ఆరుగుర్ని మాత్రమే ఉంచి మిగతా వాళ్లను కొత్తవాళ్లను తీసుకువచ్చారు.
దీంతో పార్టీలో ఫిరాయింపులు, విమర్శలు, జగన్ వైఖరిని తప్పుబట్టే తీరు, రాజీనామాల పర్వం మొదలైంది. అప్పటివరకు నోరు ఎత్తని వారు, జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారు ఆరోపణలకు దిగారు. ఈ తరహా నేతల్ని కట్టడి చేయాలంటే జనంలోకి పోవడం ఒక్కటే మార్గమని భావించిన జగన్ భారీ స్థాయిలో "సిద్దం" సభల్ని, ఆ తర్వాత 22 రోజులు, 68 నియోజకవర్గాలలో బసు యాత్రలు చేపట్టారు. వైఎస్సార్ సీపీకి ఇక తిరుగులేదనే భావన కల్పించారు. అప్పటి దాకా టీడీపీ గెలుస్తుందన్న వారు ఈ సభల్ని చూసిన తర్వాత ఆ మాట అనడానికి వెనకాడారు. సోషల్ మీడియాను మరింత చురుగ్గా నడిపించింది. వైఎస్‌ఆర్‌సిపి అనుచరులు తనపై కురిపించిన ప్రశంసలకు విస్తృత ప్రచారం వచ్చేలా చేశారు. జగన్‌కు రాజకీయంగా లబ్ధి చేకూర్చిన పాదయాత్ర మాదిరే ఈసారి ఈ యాత్రలు బాగా ప్రయోజనం చేకూర్చాయనే భావనను కల్పించారు. ఇది కొత్తగా ఏర్పాటైన ఎన్‌డిఎ కూటమికి దడ పుట్టించిందనే చెప్పాలి.
సరిగ్గా ఈ దశలో ఎన్డీఏ కూటమి కూడా భారీ ఎత్తున ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసి తన తొలి సభకు ప్రధానిని రప్పించింది. జగన్ ను వ్యక్తిగతంగా, విధానపరంగా లక్ష్యం చేసుకుని విమర్శలకు దిగింది. ఓవైపు పవన్ మరోవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు బీజేపీ చోటామోటా నాయకులు, తుది దశలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని రప్పించి ప్రచారాన్ని రక్తి కట్టించింది.
అప్పటి వరకు వైసీపీదే పైచేయి అనుకున్నట్టున్న ప్రచార సరళి మధ్య తేడాను ఎన్డీఏ కూటమి కుదించి సమం చేసినట్టుగా భావిస్తున్నారు. మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్సార్ సీపీ, ఎన్డీఏలు సమతూకంలో ఉన్నాయి.
వృద్ధాప్య పింఛను, అమ్మఒడి (తల్లులకు రూ. 15 వేలు, పిల్లలను బడిలో చేర్పించడం), వైఎస్ఆర్ చేయూత (సామాజికంగా వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రూ. 75 వేలు) వంటి సంక్షేమ పథకాలు అందుతున్న గ్రామీణ ఓటర్లు జగన్ కుఅండగా నిలుస్తున్నారు. పట్టణ ప్రాంతాలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా జగన్ తన ప్రధాన ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు పట్టం కట్టారు. ఈ వర్గాలలోనూ అత్యధికులు వైఎస్సార్ సీపీ వైపే నిలిచారు.
ఇక ఎన్డీఏకి ప్రత్యేకించి టీడీపీకి కలిసివచ్చే ప్రధానాంశాలలో ఈ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు సూత్రాల అజెండా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జనంలోకి బాగానే వెళ్లినట్టు అంచనా. పట్టణ నియోజకవర్గాలలో చర్చిస్తున్న.. నిరుద్యోగం, పెట్టుబడుల కొరత, అభివృద్ధి మందగమనం వంటి సమస్యలు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.
విజయవాడ శివార్లలోని కంచికచర్లకు చెందిన ఓ చిరువ్యాపారి నజీర్ (34) అభిప్రాయం ప్రకారం “జగన్ బటన్లు నొక్కి నేరుగా డబ్బును పేదల ఖాతాకు వేయడం వల్ల పేదసాదలకు మంచి మేలు జరిగింది. అభ్యర్థులను మార్చడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదంటూనే అభివృద్ధి కుంటుపడిందని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుండేదని చెప్పారు.
ఎన్డీఏకి కలిసి వస్తాయని భావిస్తున్న అంశాలలో ప్రధానమైంది మూడు రాజధానుల అంశం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రాజకీయ కక్షలతో ప్రత్యర్థుల్ని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించారన్న భావన. ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థుల విజయం కూడా టీడీపీకి ఆశలు రగిలిస్తోంది.
పొత్తులో భాగంగా మొత్తం 175 సీట్లలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. 25 పార్లమెంటు సీట్లలో టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీపడుతున్నాయి. వైసీపీ ఒంటరిగానే అన్నీ సీట్లకు పోటీ చేస్తోంది.
జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రచారం నుంచి తప్పించుకోవడానికి టీడీపీ.. ఉద్యోగాలు, అభివృద్ధి విషయంలో జగన్‌ను కార్నర్ చేయాలని చూస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా అని ప్రశ్నిస్తోంది. ఇది వైసీపీ కాదా అని నిలదీస్తూ మూడు రాజధానుల ఆలోచనే దారుణమైందనే భావన కల్పిస్తోంది.
ఇన్ని వివాదాలు, పరస్పర వాదోపవాదాల మధ్య ఈనెల 13న రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు జరగబోతున్నాయి.
Tags:    

Similar News