అందుకోసమేనా సీఎం చంద్రబాబు వ్యవహార శైలిలో మార్పులు ?

ప్రజలకు, పార్టీ కేడర్‌కు చేరువయ్యే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అధికారాన్ని కాపాడుకోవాలంటే ఇదే మంచి మార్గమనే ఆలోచనలో ఉన్నారు.

Update: 2024-07-03 13:08 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో గతంతో పోల్చితే మార్పులు చోటు చేసుకున్నాయి. 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. 2019 ఎన్నికల నాటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం.. పాలనలో తాను తీసుకున్న నిర్ణయాల పట్ల విమర్శలు వెల్లువెత్తడం.. దీంతో 2019లో అధికారానికి దూరం కావడం.. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండటం, ఆ ఐదేళ్ల కాలంలో తన పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం, చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నారా లోకేష్‌ వంటి నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం, అసెంబ్లీలో చంద్రబా నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని అవమాన పరచడం, ఆ పార్టీకి చెందిన నేతల వ్యాపారాలను దెబ్బ కొట్టడం వంటి అనేక సంఘటనలు అధికారానికి దూరం కావడం వల్లనే చోటు చేసుకున్నాయని, అధికారాన్ని కాపాడుకోవాలంటే ప్రజలకు, పార్టీ కేడర్‌కు ఎప్పుడూ చేరువుగానే ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు తన వ్యవహార శైలిలో మార్పులు చేసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం నుంచే మార్పునకు నాంది పలికారు. గన్నవరంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం సయమంలో డయాస్‌పైన ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులందరికీ ఒక రకమైన కుర్చీలు వేసి, చంద్రబాబుకు మాత్రం ప్రత్యేకమైన కుర్చీ వేశారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు ఆ కుర్చీని తొలగించి, అందరి మాదిరిగానే సమానంగా తనకు కూడా అదేరకమైన కుర్చీని వేయాలని అధికారులకు సూచించారు. దీంతో కుర్చీని మార్చక తప్ప లేదు.
ముఖ్మమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాను ప్రయాణిస్తున్న సమయంలో విధించే ట్రాఫిక్‌ ఆంక్షలలో సడలింపులు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. తన భద్రత పర్యవేక్షణకు భంగం కలగకుండానే, తన కోసం ఎక్కువ సేపు ట్రాఫిక్‌ను నిలిపివేయొద్దని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతారని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ జాగ్రత్తలు తీసుకోవాలని ఒకటిరి రెండు సార్లు అధికారులకు సూచించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం వారంలో ఒక రోజు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తల వినతులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు సమయం కేటాయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిని అమలు చేస్తున్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి వారితో ములాఖత్‌ అవుతున్నారు. గతంలో ఎన్నడు పార్టీ నేతలు, కార్యకర్తలకు సమయం కేటాయించింది లేదు. వారి సమస్యలు స్వయంగా చంద్రబాబు వినింది లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసంతృప్తి కూడా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కేడర్‌ను సంతృప్తి పరచడం ద్వారా వారు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. ప్రతి శనివారం ఆ పార్టీ శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు కూడా తమ సమస్యలు తెలుపుకునేందుకు భారీగానే తరలి వస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామమనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
ప్రజలకు, పార్టీ కేడర్‌కు తనకు మధ్య గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అందులో భాగంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ ప్రజలు తనను కలిసేందుకు ప్రయత్నించే సందర్భాల్లో కూడా పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఎలాంటి హడావుడి లేకుండా, వారిని నెట్టేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. జూలైన 1న సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధిదారుని ఇంటికెళ్లి పింఛన్‌ పంపిణీ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతకు ముందు సభలు, సమవేశాలు పట్టి లబ్ధిదారులను అక్కడికి పిలిపించి నగదును పంపిణీ చేసే వారు. ఆ విధానానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి నేరుగా వెళ్లి పంపిణీకి తెర తీసారు.
విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ, ఉమడ్మి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌ను, ప్రజలను కలిసేందుకు, వారి సమస్యలు వినాలని పెద్దగా ఆలోచనలు చేయలేదు. దీంతో ఆయన అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నారే కానీ ప్రజల నేతగా పేరు తెచ్చుకోలేక పోయారనే టాక్‌ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దీనిని చెరిపేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రజలను, పార్టీ కేడర్‌ను కలడం, వారి సమస్యలు వినేందుకు ప్రయత్నించక పోవడం, అధికారులతో మమేకమై పాలన సాగించడం వంటివి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటించక పోవడం వల్లే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. దీనికి భిన్నంగా వ్యవహరించి, ప్రజలు, పార్టీ కేడర్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తన ఆలోచనలు, వ్యవహార శైలిని మార్చుకున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో టాక్‌ నడుస్తోంది.
Tags:    

Similar News