పోలవరం కొనసాగింపుకే అంతర్జాతీయ నిపుణుల కమిటీ మొగ్గు?

పోలవరం జాతీయ ప్రాజెక్టు వరదల కారణంగా దెబ్బతిన్నదనే ఆలోచనలో నిజం లేదనే నిర్థారణకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

Update: 2024-07-02 02:24 GMT

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు వరం. ఈ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదల్లో ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ నాలుగు చోట్ల దెబ్బతిన్నదని, కాఫర్‌ డ్యాం కూడా దెబ్బతినటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని జాతీయ, రాష్ట్ర ఇంజనీర్లు అభిప్రాయ పడ్డారు. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందరి అనుమానాలు పటాపంచలు చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీని పిలిపించి పరిశీలించేందుకు చర్యలు తీసుకుంది. జర్మని, అమెరికా రాష్ట్రాలకు చెందిన నలుగురు నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రాజెక్టు డయాఫ్రం వాల్, పరిసర ప్రాంతాలు, కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలించింది. నిపుణులు జాతీయ, రాష్ట్ర ఇంజనీర్ల సహకారంతో ప్రాజెక్టు ప్రాంతాన్ని కలియ తిరిగారు.

అనుమానం వచ్చిన ప్రతి చోటా నమూనాలు
డయాఫ్రం వాల్‌పై అనుమానం వచ్చిన ప్రతి చోటా కాంక్రీట్, మట్టి నమూనాలు సేకరించారు. కొన్ని చోట్ల వారు కాఫర్‌ డ్యాం కాంక్రీట్, మట్టి నమూనాలు సేకరించారు. డయాఫ్రం వాల్‌పై పేరుకు పోయిన ఇసుక, బంకమట్టి వంటి వాటిని చేతులుతో పెకిలించి చూశారు. ఇంజనీరింగ్‌ పరికరాల ద్వారా డయాఫ్రం వాల్‌ను లోతుగా చెక్‌ చేసి డయాఫ్రం వాల్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదనే నిర్ణయానికి నిపుణుల బృందం వచ్చినట్లు సమాచారం. జాతీయ ఇంజనీరింగ్‌ నిపుణుల అనుమానాలు ఎప్పటికప్పుడు వారు నివృత్తి చేశారు. బంకమట్టిపై ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వచ్చినప్పుడు బంకమన్ను కూడా చాలా గట్టిగా ఉంటుందని, దానిపై నిర్మించిన నిర్మాణాలకు కూడా ఎటువంటి ఢోకా ఉండదనే అభిప్రాయం వారు వెలుబుచ్చారు. ప్రపంచంలో చాలా చోట్ల అటువంటి మట్టిపై నిర్మాణాలు ఉన్నట్లు వారు ఉన్నతాధికారులకు చెబుతున్నారు.
మరిన్ని పరీక్షలు
అనుమానం వచ్చిన ప్రతిచోటా మట్టి, కాంక్రీట్‌లను వారు పరిశీలించేందుకు నమూనాలు సేకరించారు. ఇప్పటికే పలు నమూనాలు పరీక్షించారు. లాబొరేటరీల ద్వారా రాష్ట్ర, జాతీయ అధికారులు ఎప్పకప్పుడు పరీక్షలు చేసి ఫలితాలు అందిస్తున్నారు. అవి పరిశీలించిన తరువాత వెంటనే ఒక నిర్ణయానికి వారు వస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువైనప్పుడు ఎక్కడైనా నీరు కట్టడాల పై భాగం నుంచి వెళుతుందని, దాని కారణంగా ఇసుక, ఇతర మట్టి కొట్టుకొచ్చి మేటలు వేసే అవకాశం ఉందని అధికారులతో నిపుణుల బృందం మాట్లాడుతూ వెల్లడించారు. ఎక్కడైతే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారో ఆ ప్రదేశాలను అంతర్జాతీయ నిపుణులు పూర్తి స్థాయిలో పరీక్షించారు. అన్ని వైపులా పరిశీలించారు. ఎక్కడైతే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నట్లు జాతీయ అధికారులు చెబుతున్నారో అక్కడ సమాంతరంగా నిర్మాణం చేసి దానిని ఉన్న డయాఫ్రం వాల్‌కు అనుసంధానించడం వల్ల ఎటువంటి నష్టం ఉండే అవకాశం కూడా లేదనేది నిపుణుల అభిప్రాయంగా ఉంది. రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుపై చేసిన అధ్యయనాలు, ఇతర పనుల వివరాల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నేడు, రేపు సమీక్షలు
పోలవరం ప్రాజెక్టుపై నేడు రేపు ప్రాజెక్టు వద్దే సమీక్షలు అంతర్జాతీయ నిపుణులు నిర్వహించనున్నారు. జాతీయ, రాష్ట్ర ఇంజనీరింగ్‌ విభాగాల నిపుణుల అభిప్రాయలను అడిగి తెలుసుకుంటారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని కూడా పరిశీలిస్తారు. సమీక్షల్లో దాదాపు అన్ని అనుమానాలకు తగిన పరిష్కారం చూపిస్తారు. ఆ తరువాత నలుగురు నిపుణులతో కూడిన బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇప్పటికే ఎవరి నివేదికను వారు దాదాపుగా తయారు చేశారు. నలుగురి నివేదికలు పరిశీలించి ప్రత్యేకంగా ఒకే నివేదిక రూపొందిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి పరిశీలనలో వెల్లడైన అంశాలను ముఖ్యమంత్రికి వివరిస్తారు. ప్రాజెక్టు నిర్మాణం ఉన్నది ఉన్నట్లుగా వెంటనే చేపట్టేందుకు సాధ్యా సాధ్యాలను ఆయన దృష్టికి తెస్తారు. ఆ తరువాత కేంద్ర అధికారులు, కేంద్ర జల వనరుల శాఖ మంత్రితో కూడా చర్చించే అవకాశం ఉంది.
మొత్తానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేపట్టేందుకు వెనుకంజ వేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం అంతర్జాతీయ నిపుణుల వద్ద నుంచి వచ్చే అవకాశం ఉంది. వారు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఇవే అంశాలు పేర్కొనే అవకాశాలు వారు చెబుతున్న ఉన్నట్లు ఇంజనీర్లు భావిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రపంచమంతా ఒక్కసారి తిరిగి చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేశారు. అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందాన్ని పిలిపించి ప్రాజెక్టును పరిశీలింప జేయడంతో ప్రపంచ ఇంజనీరింగ్‌ నిపుల్లో ఇది చర్చనియాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు భారత దేశంలో చోటు చేసుకోలేదు. పలు ప్రాజెక్టుల నిర్మాణాల్లో అంతర్జాతీయ సంస్థల సేవలు వినియోగించుకున్నారు. అవసరమైనప్పుడు అంతర్జాతీయ నిపులను తీసుకుని వారికి నిబంధనల ప్రకారం జీతాలు కూడా ఇచ్చారు. కానీ ఒక ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలపై అంతర్జాతీయ కమిటీ పరిశీలించి నివేదిక తయారు చేచయడం ఇదే మొదటి సారి. నిపుణుల కమిటీలో డివిడ్‌ బి పాల్, రిచర్డ్‌ డొన్నెల్లి, గియాస్‌ ప్రాంకో డి సిస్కో, సీస్‌ హించ్‌ బెర్గర్‌లు ఉన్నారు. వీరితో పాటు కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, జాతీయ జల విద్యుత్‌ పరిశోధనా సంస్థ అధికారులు ఉన్నారు.


Tags:    

Similar News