కులసంఘాల పేరుతో రేవంత్ ను బెదిరిస్తున్నారా ?

గతంలో ఏ ముఖ్యమంత్రికి ఎదురుకానట్లుగా రేవంత్ కు కులసంఘాల నేతల నుండి బెదిరింపులు వస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.;

Update: 2025-03-02 11:55 GMT

ఇపుడీ విషయమే కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. తమకులానికి అది చేయాల్సిందే అని ఒక కులం డిమాండ్ చేస్తుంది. మరోకులం నేతలు తాము అడిగినది వెంటనే చేయకపోతే కథ చూస్తామంటు బెదిరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలముందు హామీఇచ్చినట్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయకపోతే మంటలు పుట్టిస్తామంటు బీసీ సంఘాల నేతలు అల్టిమేటమ్ జారీచేస్తున్నారు. ఇంతకీ ఇంతమంది బెదిరిస్తున్నది ఎవరిని ? అల్టిమేటమ్ జారీచేస్తున్నది ఎవరికి ? అల్టిమేటమ్ ఇస్తున్నది ఎవరికి ? ఇంకెవరికి రేవంత్ రెడ్డి(Revanth)కే. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఎదురుకానట్లుగా రేవంత్ కు కులసంఘాల నేతల నుండి బెదిరింపులు వస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ప్రతికులం కూడా తమకు రాజకీయంగా అన్యాయం జరిగిందని, తమ కులానికి జరగాల్సినంత న్యాయం జరగలేదని, తమ కులజనాభా దామాషాలో పదవులు రాలేదని గోలచేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు(వీహెచ్) ఇంట్లో మున్నూరుకాపు సంఘం నేతల సమావేశం ఇపుడు పార్టీలోనే కాకుండా తెలంగాణ(Telangana)లో హాట్ టాపిక్ అయిపోయింది. వీహెచ్ ఇంట్లో జరిగిన వివిధ పార్టీల్లోని మున్నూరుకాపు నేతలు హాజరవటం వల్లే ఈ సమావేశం హాట్ టాపిక్ అయిపోయింది. కులగణనలో మున్నూరుకాపులకు తీరని అన్యాయం జరిగిందని సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తంచేసింది. తమకు తగిన న్యాయం జరగకపోతే.. అని బెదిరిస్తోంది రేవంత్ ను.

ఇంతకీ మున్నూరుకాపులకు జరిగిన అన్యాయం ఏమిటి ? ఏమిటంటే తమ జనాభా 30 లక్షలుంటే కులగణనలో 13 లక్షలని ప్రభుత్వం చూపిందని మండిపోతున్నారు. పైగా గతంలో ఎప్పుడూ జరగనట్లుగా రేవంత్ హయాంలో మున్నూరుకాపులకు తీరని అన్యాయం జరిగిందని గోలచేస్తున్నారు. ఏమిటా అన్యాయం అంటే రేవంత్ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు చెందిన ఒక్కళ్ళు కూడా లేరట. మంత్రివర్గంలోకి తీసుకునేటపుడు హోలుమొత్తంమీద బీసీలు అని చూస్తారు కాని మున్నూరుకాపులు, గౌడ్లు, యాదవులని బీసీల్లోని ఉపకులాలను విడివిడిగా చూడరని వీహెచ్ లాంటి సీనియర్లకు తెలీదా ? సమావేశం మండిపోతున్నట్లు బీసీల్లోని ప్రతి ఉపకులానికి చెందిన ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకోవటం కుదురుతుందా ? బీసీల్లో సుమారు 140 ఉపకులాలున్నాయి. వీటిల్లోకూడా మున్నూరుకాపులు, యాదవులు, చేనేతలు, గౌడ్లు, ముదిరాజులు జనాభారీత్యా మిగిలిన వాటికన్నా ముందున్నాయి. మరీలెక్కన మంత్రివర్గంలోని పై ఉపకులాల్లోనే ఐదుగురు ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకోవాలి.

ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో అవకాశం ఉన్నదే 18 మందికి. బీసీల్లోని పై ఉపకులాల్లోని ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి మిగిలిన సామాజికవర్గాలు ఊరుకుంటాయా ? శనివారం మున్నూరుకాపు నేతలు సమావేశమై రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు యాదవ సామాజికవర్గానికి చెందిన కీలకనేతలు సమావేశం పెట్టుకున్నారు. తమకు రేవంత్ సరైన న్యాయంచేయటంలేదని మండిపడ్డారు. రేపో, ఎల్లుండో మిగిలిన ఉపకులాల్లోని నేతలు కూడా సమావేశం పెట్టుకుని రేవంత్ కు వార్నింగులు ఇస్తారేమో చూడాలి.

బీసీ కులసంఘాల సంగతి ఇలాగుంటే ఎస్సీలు కూడా రేవంత్ పై మండిపోతున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలన్న రేవంత్ నిర్ణయాన్ని ఎస్సీల్లోని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొందరలో భర్తీచేయబోయే ఎంఎల్సీ సీట్లలో తమకు కచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే అని అటు మాలలు, ఇటు మాదిగలు రేవంత్ పై ఒత్తిడిపెడుతున్నాయి. తొందరలో భర్తీ చేయాల్సిన ఎంఎల్ఏ కోటాలోని ఎంఎల్సీ సీట్లలో కమ్మ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వకపోతే రేవంత్ సంగతి చూస్తామన్నట్లుగా ఆ కులసంఘాల్లోని పెద్దలు మాట్లాడుతున్నారు. కమ్మ సామాజికవర్గంలోని జెట్టి కుసుమ్ కుమార్ కు ఎంఎల్సీ అవకాశం ఇవ్వాల్సిందే అని అల్టిమేటమ్ కూడా జారీచేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా కుసుమ్ కుమార్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కులసంఘాల బెదరింపులను చూస్తుంటే రేవంత్ పరిస్ధితి చివరకు ఇలాగ అయిపోయింది ఏమిటనే ఆశ్చర్యం పెరిగిపోతోంది.

Tags:    

Similar News