ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందా?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో చర్చనియాంశంగా మారాయి.;

Update: 2025-08-24 03:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయి. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ), డిఏ అలవెన్స్ బకాయిలు, మధ్యంతర భృతి (ఐఆర్), కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఆగస్టు 20, 2025న రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశం ఈ సమస్యలపై కీలకమైన చర్చలకు వేదికగా నిలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తమ కోర్కెలను విన్నవించారు. ఉద్యోగ సంఘాల కోర్కెలు ఎంతవరకు సమంజసమైనవి, ఏడాది కాలంగా సమావేశం ఎందుకు జరగలేదు, ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదు వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన కోర్కెలు

12వ పీఆర్సీ కమిషన్ నియామకం, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), మూడు పెండింగ్ డీఏల చెల్లింపు, 11వ పీఆర్సీ బకాయిలు, గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి పెన్షనర్ల సమస్యలు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)లో మెడికల్ రీఇంబర్స్‌మెంట్ లిమిట్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ఫిక్సేషన్, మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, చనిపోయిన టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వంటివి ప్రధానమైనవి.


ఉద్యోగ సంఘాల నాయకులు

కోర్కెలు సమంజసమైనవేనా?

పీఆర్సీ వాయిదా వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల నష్టం ఎదుర్కొంటున్నారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నారు. తెలంగాణలో ఉద్యోగులు ఐఆర్ లబ్ధి పొందుతుండగా, ఏపీలో నష్టపోతున్నారు. మేనిఫెస్టోలో హామీల ప్రకారమే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది. హెల్త్ కార్డులు పనికిరానివిగా మారాయని, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అవసరమని డిమాండ్ చేయడం కూడా ఆరోగ్య సమస్యల దృష్ట్యా సహేతుకమేనని చెప్పొచ్చు. అయితే రిటైర్మెంట్ వయస్సు పెంపు, ఓపీఎస్ అమలు వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా ఉద్యోగుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడేలా ఈ కోర్కెలు ఉన్నాయని చెప్పొచ్చు.

ఏడాది కాలంగా ప్రత్యేక సమావేశం ఎందుకు నిర్వహించలేదు?

2024-25లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను విస్మరించిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల హామీలు ఇచ్చినా ఐఆర్ ప్రకటించకపోవడం, డీఏలు పెండింగ్‌లో ఉంచడం వల్ల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) జూన్ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం కాలంలో సమస్యలు పేరుకుపోయాయి. కొత్త ప్రభుత్వం ఇప్పుడు సానుకూల దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 5న జరిగిన సమావేశాల్లో డీఏ బకాయిల చెల్లింపును డిమాండ్ చేశారు. కానీ క్యాబినెట్‌లో చర్చించాలని సూచించారు. ఎన్నికలు, ప్రభుత్వ మార్పు వల్ల ఆలస్యమైందని అర్థమవుతోంది.


ఉద్యోగ సంఘాల నాయకులు

ముఖ్యమంత్రి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు?

ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగినప్పటికీ, ఆయన హాజరు కాలేదు. ఇది మొదటి సారి కాదు, గత సమావేశాలు కూడా సీఎస్ అధ్యక్షతనే జరిగాయి. ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు (అమరావతి, పోలవరం వంటివి), కేంద్రంతో చర్చలు వంటి కారణాల వల్ల డెలిగేట్ చేశారు. సమావేశంలో సీఎస్ విజయానంద్ సమస్యల సానుకూల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి హాజరైతే మరింత ప్రాధాన్యత లభించేది. ఇది ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను తక్కువగా చూడటం కాదని, అధికారిక ప్రక్రియలో భాగమేననే అభిప్రాయాన్ని సీఎస్ వ్యక్తం చేశారు.

ఉద్యోగుల కోర్కెలు తీరే అవకాశం ఉందా?

సమావేశంలో లేవనెత్తిన 230 సమస్యల్లో 115 పరిష్కరించామని, 114 పెండింగ్‌లో ఉన్నాయని, ఒకటి ప్రాసెస్‌లో ఉందని ప్రభుత్వం తెలిపింది. కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమానికి హామీలు ఇచ్చింది. కాబట్టి ఐఆర్ ప్రకటన, కనీసం ఒక డీఏ చెల్లింపు వంటివి త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. హైకోర్టు కూడా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపుపై నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే పూర్తి అమలు రాష్ట్ర ఆర్థిక స్థితి (బడ్జెట్ డెఫిసిట్)పై ఆధారపడి ఉంటుంది. ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. కాబట్టి పాక్షిక పరిష్కారాలైన డీఏలు, క్రమబద్ధీకరణ తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.


ఉద్యోగుల సమస్యలపై వెల్లడి కాని మంత్రి మండలి నిర్ణయాలు

ఆగస్టు 6న జరిగిన మంత్రి మండలి సమావేశంలో డీఏ బకాయిలు, ఇతర సమస్యలను చర్చించాలని సూచనలు వచ్చాయి. కానీ ఆ తర్వాతి నిర్ణయాలు బహిర్గతం కాలేదు. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత మంత్రి మండలి పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన వంటి నిర్ణయాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి బడ్జెట్ అంచనాల ఆధారంగా పాక్షిక చెల్లింపుల ఆమోదానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. అయితే ఓపీఎస్ వంటి పెద్ద అంశాలు కేంద్రంతో సంప్రదింపులు జరిగిన తరువాతే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా ఈ సమావేశం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని చూపించింది. త్వరలోనే కొన్ని కోర్కెలు తీరే అవకాశం ఉంది. కానీ పూర్తి పరిష్కారానికి కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య నిరంతర చర్చలు అవసరం అవుతాయి.

మూడు నెలల తరువాత మా యాక్షన్ చెబుతాం: బొప్పరాజు

శనివారం జరిగిన అమరావతి జేఏసీ సమావేశంలో ఉద్యోగుల కోర్కెలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఉద్యోగులకు బకాయి ఎంత ఉంది? అనే అంశాన్ని ఆయా ఉద్యోగుల పే స్లిప్స్ లో చూపించాలని డిమాండ్ చేస్తున్నట్లు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం జేఏసీ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాలే అనుసరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రెజరీ నుంచి వచ్చే ప్లేసిప్స్ లో ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఏయే అంశాల్లో ఉన్నాయో పూర్తి అంశాల వారీగా వివరిస్తూ ప్రతినెలా తెలియజేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తూచా తప్పకుండా జరిగే మా యాక్షన్ ప్లాన్ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా 90 రోజుల పాటు ఆందోళన నిర్వహించినట్లు చెప్పారు.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ మోహన్, రాష్ట్ర టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఏపీ ప్రోగ్రస్సివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ప్రసాద్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జి హృదయరాజు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె సూర్యనారాయణ, ఏపీ ఉపాధ్యాయ సంఘ ముఖ్య నాయకులు బాలాజీ, ఏపీ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ నాయకులు బండి శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ క్లాస్ 4 ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ నాయకులు మల్లేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ క్లాస్ 4 ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ నాయకులు శేఖర్, ఏపీ కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణి పేర్రాజు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ప్రత్యేక ఆహ్వానితులు) వెంకటేశ్వరరావు, స్టేట్ గవర్నమెంట్ ఫెన్సనర్ల అసోసియేషన్ ఏపీ ప్రత్యేక ఆహ్వానితులు శాస్త్రి తదితరులు కౌన్సిల్ సమావేశం అనంతరం సెక్రటేరియట్ లో విలేకరులతో మాట్లాడారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచామని, ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తరువాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

Tags:    

Similar News