కారుకు గుత్తానే పంక్చర్ చేస్తున్నారా ?

కారుపార్టీలో గుత్తా ఫ్యామిలీ బాగా సఫోకేటింగ్ ఫీలవుతోంది. వివిధ కారణాల వల్ల గుత్తాను కలవటానికి కేసీయార్ ఇష్టపడటంలేదు

Update: 2024-04-30 06:19 GMT

బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా సైలెంటుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో కారుకు గుత్తాయే పంక్చర్ చేసేట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే తాజాగా గుత్తా కొడుకు గుత్తా అమిత్ రెడ్డి, సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గుత్తా సుఖేందర్ బీఆర్ఎస్ లో ఉండగా కొడుకు, తమ్ముడు కాంగ్రెస్ లో చేరటం ఏమిటి ? ఏమిటంటే గుత్తాను వీళ్ళిద్దరినీ హస్తంపార్టీలోకి పంపినట్లు అర్ధమైపోతోంది. కారణం ఏమిటంటే కారుపార్టీలో గుత్తా ఫ్యామిలీ బాగా సఫోకేటింగ్ ఫీలవుతోంది. వివిధ కారణాల వల్ల గుత్తాను కలవటానికి కేసీయార్ ఇష్టపడటంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందునుండే అపాయిట్మెంట్ కావాలని గుత్తా ఎంత ప్రయత్నించినా కేసీయార్ కలవటానికి ఇష్టపడలేదు.

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడుక్కి నల్గొండ టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. ఇపుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో అయినా టికెట్ దక్కకపోతుందా అని ప్రయత్నిస్తే ఇపుడు కూడ లాభంలేకపోయింది. దీనికి అదనంగా అపాయిట్మెంట్ ఇవ్వకుండా దూరంగా పెట్టేయటం. పార్టీలో తన విషయంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకున్న గుత్తా ఇమడలేకపోతున్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక అవస్తలు పడుతున్న గుత్తాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఒకదారి దొరకినట్లయ్యింది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో కొందరు మద్దతుదారులు కాంగ్రెస్ లో చేరిపోయారు. దాంతో గుత్తాయే హస్తంపార్టీలోకి మద్దతుదారులను పంపారనే ఆరోపణలు మొదలయ్యాయి. తర్వాత కాంగ్రెస్ లో టికెట్ కోసం ప్రయత్నించినా అక్కడున్న పోటీలో సాధ్యంకాలేదు. అయినా సరే కొడుకు, తమ్ముడిని కాంగ్రెస్ లో చేర్చటానికే గుత్తా డిసైడ్ అయ్యారు. దాని పర్యవసానమే అమిత్, జితేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం.

దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీలోని బలమైన గుత్తా వర్గమంతా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘవీర్ రెడ్డి గెలుపుకు పనిచేస్తారు. దాంతో బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డికి ఇబ్బందులు తప్పవు. అసలే కంచర్ల పరిస్ధితి అంతంతమాత్రంగా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రచారంలో కంచర్ల వెనకబడిపోయారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనిమీద అమిత్, జితేందర్ తో పాటు గుత్తా వర్గమంతా కాంగ్రెస్ గెలుపుకు పనిచేస్తుంది. అంటే తాను బీఆర్ఎస్ లోనే ఉంటు తన కటుంబంతో పాటు వర్గాన్నంతా కాంగ్రెస్ గెలుపుకు పనిచేసేట్లుగా గుత్తా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని కేసీయార్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిజానికి గుత్తా కూడా కాంగ్రెస్ లో చేరిపోవచ్చు. కాని చేరటంలేదు ఎందుకంటే మండలి ఛైర్మన్ పదవీకాలం ఇంకా మూడున్నరేళ్ళుంది. పదవికి రాజీనామా చేయటం గుత్తాకు ఇష్టంలేదు.

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేటలో కూడా గుత్తాకు మద్దతుదారులున్నారు. కాబట్టి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే అర్ధమవుతోంది. ఎలాగూ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల కాంగ్రెస్ ఎంఎల్ఏలే ఉన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నల్గొండ లో కాంగ్రెస్ ఎంఎల్ఏలుంటే ఒక్క సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ గుత్తా కొడుకు, తమ్ముడు, మద్దతుదారుల చేరికతో మరింత బలపడటం ఖాయం. తాను ఎంత ప్రయత్నించినా అపాయిట్మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్న కేసీయార్ పైన గుత్తా చాలా సైలెంటుగా కసి తీర్చుకుంటున్నట్లు అర్ధమవుతోంది. బహుశా పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత గుత్తా తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News